ఆందోళనలో ఎన్నారైలు.. భారత ప్రభుత్వ తాజా నిర్ణయమే కారణం..!

ABN , First Publish Date - 2020-05-18T17:44:48+05:30 IST

కరోనా వైరస్ నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను ఇండియాకు తరలిస్తున్న ప్రభుత్వం.. భారత్‌లో చిక్కుకున్న ఎన్నారైలను కూడా విదేశాలకు వెళ్లేందుకు

ఆందోళనలో ఎన్నారైలు.. భారత ప్రభుత్వ తాజా నిర్ణయమే కారణం..!

న్యూఢిల్లీ: కరోనా వైరస్ నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను ఇండియాకు తరలిస్తున్న ప్రభుత్వం.. భారత్‌లో చిక్కుకున్న ఎన్నారైలను కూడా విదేశాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచమే స్వీయ నిర్భంధంలోకి వెళ్లిపోయింది. లాక్‌డౌన్ వల్ల ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం అవుతున్న నేపథ్యంలో చాలా దేశాలు ఆంక్షలను సడలిస్తున్నాయి. ఈ క్రమంలోనే భారత ప్రభుత్వం కూడా లాక్‌డౌన్ నిబంధనలను క్రమంగా సడలిస్తూ.. విదేశాల్లో చిక్కుకున్న భారతీయును ఇండియాకు తరలించేందుకు ‘వందే భారత్ మిషన్’ను ప్రారంభించింది. ‘వందే భారత్ మిషన్’ మొదటి దశ కూడా పూర్తయి.. ప్రస్తుతం రెండో దశ కొనసాగుతోంది.


ఈ నేపథ్యంలో భారత్‌లో చిక్కుకున్న ఎన్నారైలు.. లాక్‌డౌన్‌ గడువుకు నిన్న ఆఖరి రోజు కావడంతో విదేశాలకు వెళ్లేందుకు తమకు ప్రభుత్వం అనుమతిస్తుందని ఆశగా ఎదురు చూశారు. అయితే దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ను మే31 వరకు పొడగించిన భారత ప్రభుత్వం.. విమాన సర్వీసులపై విధించిన ఆంక్షలను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఇండియాలో చిక్కుకున్న ఎన్నారైలు ఆందోళన చెందుతున్నారు. విదేశాల్లో చిక్కుకున్న వారిని ఇండియాకు తరలిస్తున్న ప్రభుత్వం.. తమను కూడా విదేశాలకు వెళ్లేందుకు అనుమతించాలని కోరుతున్నారు. 


కాగా.. పంజాబ్‌కు చెందిన ప్రతిమా చత్వాల్ అనే మహిళ.. తన తల్లిదండ్రులను చూడటానికి కూతురుతో సహా మార్చి 10న దుబాయి నుంచి ఇండియాకు వచ్చారు. లాక్‌డౌన్ పొడగిస్తూ కేంద్ర నిర్ణయం తీసుకోవడంపట్ల ఆమె తన ఆందోళను వ్యక్తం చేశారు. ‘నా తల్లిదండ్రులను చూడటానికి మార్చి 10న వచ్చాను. నాతోపాటు మా పాప కూడా ఇండియాకు వచ్చింది. కరోనా నేపథ్యంలో భారత ప్రభుత్వం లాక్‌డౌన్ విధించడంతో ఇండియాలో చిక్కుకున్నాం. లాక్‌డౌన్ గడువు పూర్తవుతున్న ప్రతిసారి.. తమకు ఊరటనిచ్చే ప్రకటన వస్తుందేమో అని ఆశగా ఎదురు చూస్తూనే ఉన్నాం. కానీ ప్రభుత్వం మాత్రం మా ఆశలపై నీళ్లు చల్లుతూనే ఉంది. దుబాయిలో ఉన్న తన తండ్రిని కలుసుకునేందుకు నా కూతురు ఎదురుచూస్తోంది. అయితే ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పొడగిస్తుండటంతో..నా కూతురు మానసికంగా కుంగిపోతోంది. విదేశాల్లో చిక్కుకున్న వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు.. ఇండియాలో చిక్కుకున్న వారు విదేశాలకు వెళ్లేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలంటూ’ ఆమె తన ఆవేదనను వ్యక్తం చేశారు. కాగా.. భారత్‌లో కరోనా కేసులు 90 వేలు దాటడంతో.. లాక్‌డౌన్ మే 31 వరకు పొడగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకన్న విషయం తెలిసిందే. 


Updated Date - 2020-05-18T17:44:48+05:30 IST