ఎన్నారైలను కించపర్చొద్దు.. మన ఆర్థిక వ్యవస్థకు వారు వెన్నెముక
ABN , First Publish Date - 2020-04-01T15:42:26+05:30 IST
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పటికే 42వేలకు పైగా మందిని పొట్టనబెట్టుకుంది. అగ్రరాజ్యలైన యూఎస్, యూకే, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీలో ఈ మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉంది.

తిరువనంతపురం: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పటికే 42వేలకు పైగా మందిని పొట్టనబెట్టుకుంది. అగ్రరాజ్యలైన యూఎస్, యూకే, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీలో ఈ మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉంది. ఇక భారత్‌లోనూ కొవిడ్-19 చాప కింద నీరులా విస్తరిస్తుంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు 1400 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 35 మంది వరకు మరణించారు. కాగా, దేశంలో కరోనా వ్యాప్తికి విదేశాలకు వెళ్లిన వచ్చిన వారే కారణమని, ఎన్నారైల వల్లే ఈ పరిస్థితి దాపురించిందని కొందరి అభిప్రాయం. ఇదిలాఉంటే ఈ వ్యాఖ్యలపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తాజాగా స్పందించారు.
ఈ వైరస్ వ్యాప్తిని ఎన్నారైలకు ముడిపెట్టొద్దని ఆయన అన్నారు. ఎన్నారైల వల్లే కొవిడ్-19 వచ్చిందని కొందరంటున్నారని అది నిజం కాదన్నారు. ప్రపంచమంతా కరోనా వ్యాప్తి చెందిన విషయాన్ని గుర్తు చేసిన విజయన్ ఇదొక మహమ్మారి అని తెలిపారు. కనుక దీనికోసం ఎవరిని నిందించాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. ఎన్నారైలు రాష్ట్ర ఆర్థికవ్యవస్థకు వెన్నెముక లాంటివారని వారిని ఎవరూ కించపర్చొద్దని విజయన్ పేర్కొన్నారు. వారు బయటి దేశాల్లో ఎంతో శ్రమ పడి స్వదేశానికి పంపిస్తున్న ఆదాయం వల్లే మన ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరుతుందని అన్నారు. ఇక కేరళలో కూడా కరోనా విజృంభిస్తోంది. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 241 కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.