సియాటెల్‌లో ఎన్నారైల వర్చువల్ ఫండ్ రైజర్ కార్యక్రమం

ABN , First Publish Date - 2020-10-31T12:36:52+05:30 IST

సియాటెల్‌లో ఇటీవల ప్రవాస భారతీయుల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాషింగ్టన్ రాష్ట్ర గవర్నర్ జే రాబర్ట్ ఇన్‌స్లీ హాజరయ్యారు.

సియాటెల్‌లో ఎన్నారైల వర్చువల్ ఫండ్ రైజర్ కార్యక్రమం

ముఖ్య అతిథిగా హాజరైన వాషింగ్టన్ రాష్ట్ర గవర్నర్ జే రాబర్ట్ ఇన్‌స్లీ

సియాటెల్‌లో ఇటీవల ప్రవాస భారతీయుల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాషింగ్టన్ రాష్ట్ర గవర్నర్ జే రాబర్ట్ ఇన్‌స్లీ హాజరయ్యారు. టీజీ విశ్వ ప్రసాద్, శ్రీమతి వందన ప్రసాద్ నిర్వహించిన వర్చువల్ ఫండ్ రైజర్‌ కార్యక్రమంలో ప్రవాస భారతీయులతో గవర్నర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రవాస భారతీయులు వాషింగ్టన్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నిర్మాణంతో పాటు రాష్ట్ర సాంస్కృతిక గుర్తింపును సుసంపన్నం చేయడంలో గవర్నర్ ఇన్‌స్లీ పాత్ర ఎనలేనిదని ప్రశంసించారు. దేశంలో ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో వాషింగ్టన్ రాష్ట్రాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన ప్రగతిశీల నాయకుడిగా గవర్నర్‌ను ప్రవాస భారతీయులు కొనియాడారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో తమ ప్రభుత్వం ఎంత సమర్ధవంతంగా పని చేస్తోందో గవర్నర్ వివరించారు.  


ఈ సమావేశంలో భారత పార్లమెంటు ఇటీవల తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం ఆర్టికల్ 370 చర్చకు వచ్చిన సందర్భంలో గవర్నర్ మాట్లాడుతూ... ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం కంటే తమ పరిధిలో ఉన్న కమ్యూనిటీకి సేవలందించడంపై దృష్టి సారించాలని వ్యాఖ్యానించారు. ప్రతి దేశానికి సొంత సమస్యలున్నాయని, మన అంతర్గత సమస్యలపై దృష్టి సారించాలని ఆయన అన్నారు. 2021లో 75 వసంతాల భారత స్వాతంత్రదినోత్సవ వేడుకలను సియాటెల్‌లో భారీగా నిర్వహించబోతున్నారు టీజీ విశ్వప్రసాద్. 20 వేల మందితో ఏర్పాటు చేసే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని ఈ సందర్భంగా గవర్నర్‌ను విశ్వప్రసాద్ ఆహ్వానించారు. ఆయన ఆహ్వానంపై గవర్నర్ సానుకూలంగా స్పందించారు. 2021 ఆగస్టు నాటికి కొవిడ్ మహమ్మారి పరిస్థితి తగ్గిపోతుందని, దీంతో ఈ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహించవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 2012లో విశ్వప్రసాద్ అప్పటి గవర్నర్ క్రిస్టిన్ గ్రెగోయర్ యొక్క వాణిజ్య ప్రతినిధి బృందాన్ని భారతదేశానికి సమన్వయపరిచారు. అలాగే 2021లో భారతదేశానికి ఒక ప్రతినిధి బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆయన ఇన్ స్లీని కోరారు. గవర్నర్ ఈ విషయమై చాలా ఆసక్తితో స్పందించడంతో పాటు తమ సానుకూలత తెలియజేశారు.

Read more