దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రచారానికి ఎన్నారైల ప్రత్యేక కార్యాచరణ

ABN , First Publish Date - 2020-10-04T01:21:47+05:30 IST

ఎన్నారై టీఆర్ఎస్ యూకే కార్యవర్గ సమావేశం లండన్‌లో జరిగింది. కొవిడ్ నిబబంధనల కారణంగా ఆరుగురు సభ్యులు మాత్రమే..

దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రచారానికి ఎన్నారైల ప్రత్యేక కార్యాచరణ

లండన్: ఎన్నారై టీఆర్ఎస్ యూకే కార్యవర్గ సమావేశం లండన్‌లో జరిగింది. కొవిడ్ నిబబంధనల కారణంగా ఆరుగురు సభ్యులు మాత్రమే.. ఈ సమావేశానికి ప్రత్యక్షంగా హాజరయ్యారు. మిగిలిన సభ్యులు ఆన్‌లైన్‌లో జూమ్ మీటింగ్ ద్వారా పాల్గొన్నారు. అనారోగ్యంతో ఇటీవల మృతి చెందిన దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డికి.. నివాళులర్పించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు అశోక్‌ గౌడ్ దూసరి మాట్లాడుతూ.. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఎన్నారై టీఆర్‌ఎస్ ప్రచారంపై ప్రత్యేక కార్యచరణ రూపొందించి, కొవిడ్ వల్ల ఇబ్బందులు పడ్డ వారికి సహాయ సహకారాలు అందించిన కార్యవర్గ సభ్యులను అభినందించడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 


ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ.. గత పది సంవత్సరాలుగా ఎన్నికల సందర్భంగా ప్రత్యక్షంగా ప్రచారం నిర్వహించినట్లు తెలిపారు. అంతేకాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా ప్రచారం చేసినట్లు గుర్తు చేశారు. దుబ్బాక ఎన్నికల్లో సైతం ఉద్యమ స్పూర్తితో, కేసీఆర్ నాయకవత్వంలో ఎన్నికల ప్రచారం చేయాలని సభ్యులకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక కార్యాచరణను వెల్లడించారు. అడ్వైజరీ బోర్డు వైస్ ఛైర్మన్ సిక్కా చంద్రశేఖర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి రత్నాకర్‌ కడుదుల సంయుక్త నాయకత్వంలో ఎన్నారైల బృందం దుబ్బాక నియోజకవర్గంలో పర్యటించి ప్రచారం నిర్వహిస్తుందని చెప్పారు. దుబ్బాక అభివృద్ధిపై కర పత్రాలను రూపొందించి, సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటికి వెళ్లి వివరిస్తారని  పేర్కొన్నారు. 


కాగా.. మంత్రి హరీష్ రావుతో సమావేశమై.. ఆయన సలహాలు సూచనలతో ముందుకెళ్తామని సిక్కా చంద్రశేఖర్ గౌడ్, రత్నాకర్ కడుదుల చెప్పారు. కార్యదర్శి సత్య చిలుముల మాట్లాడుతూ.. దుబ్బాకలో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్నారై టీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. అంతేకాకుండా కరోనా సమయంలో విద్యార్థులకు లబ్ధి చేకూరేలా ‘కేసీఆర్ కూపన్స్’ ను రూపొందించిన అనిల్ కూర్మాచలం, వాటిని అమలు పరిచిన అశోక్, చంద్రశేఖర్‌ను సత్య చిలుముల అభినందించారు. చివరగా అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ దుబ్బాక ప్రజలంతా విజ్ఞతతో ఆలోచించి, టీఆర్ఎస్ పార్టీకే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. 


Updated Date - 2020-10-04T01:21:47+05:30 IST