అమెరికా ఆగ‌మాగం.. క‌రోనా కేసులు @ 1,00,000

ABN , First Publish Date - 2020-03-28T19:50:15+05:30 IST

మ‌హ‌మ్మారి క‌రోనావైర‌స్ అగ్ర‌రాజ్యం అమెరికాను ఆగ‌మాగం చేస్తోంది. రోజురోజుకూ కొత్త కేసులు గ‌ణ‌నీయంగా పెరిగి పోతున్నాయి. గ‌త నాలుగైదు రోజులుగా ప్ర‌తిరోజు వేల సంఖ్య‌లో కొత్త కేసులు న‌మోదు కావ‌డం అమెరికన్ల‌ను బెంబేలెత్తిస్తోంది.

అమెరికా ఆగ‌మాగం.. క‌రోనా కేసులు @ 1,00,000

వాషింగ్టన్‌ డీసీ: మ‌హ‌మ్మారి క‌రోనావైర‌స్ అగ్ర‌రాజ్యం అమెరికాను ఆగ‌మాగం చేస్తోంది. రోజురోజుకూ కొత్త కేసులు గ‌ణ‌నీయంగా పెరిగి పోతున్నాయి. గ‌త నాలుగైదు రోజులుగా ప్ర‌తిరోజు వేల సంఖ్య‌లో కొత్త కేసులు న‌మోదు కావ‌డం అమెరికన్ల‌ను బెంబేలెత్తిస్తోంది. మరణాల సంఖ్య 1700 దాటిపోగా.. బాధితుల సంఖ్య‌లో శుక్ర‌వారం చైనా(81,340), ఇటలీ(80,589)లను మించిపోయిన యూఎస్ శ‌నివారం నాటికి ఏకంగా ల‌క్ష మార్క్‌కు చేరింది. ప్ర‌స్తుతం అమెరికాలో క‌రోనా బారిన ప‌డిన వారి సంఖ్య 104,256గా ఉంది.


అయితే, మ‌ర‌ణాల్లో ఇట‌లీ, స్పెయిన్‌, ఇరాన్‌, చైనా, ఫ్రాన్స్‌ల కంటే త‌క్కువ‌గా ఉండ‌డం అగ్ర‌రాజ్యానికి కాస్త ఊర‌ట‌నిచ్చే అంశం. కాగా, ప్ర‌స్తుతం ఈ మ‌హ‌మ్మారి దేశ వ్యాప్తంగా  విస్త‌రిస్తున్న తీవ్ర‌త‌ను బ‌ట్టి ప్రజలు సామాజిక దూరాన్ని ఖచ్చితంగా పాటించినా, పెద్ద సంఖ్యలో స్వీయ నిర్బంధంలోకి వెళ్లినా కూడా మరణాల సంఖ్య 80 వేలు దాటొచ్చ‌ని ఆరోగ్య నిపుణులు అభిప్రాయప‌డుతున్నారు. మ‌రోవైపు అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా వ్యాప్తి, నియంత్ర‌ణ‌కు అన్ని చ‌ర్య‌లు చేప‌డుతున్నామ‌ని, వీలైనంత ఎక్కువ మందికి చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్న‌మన్నారు. 


ప్ర‌ధానంగా 'కొవిడ్‌-19' న్యూయార్క్ న‌గ‌రాన్ని కోలుకోని దెబ్బ‌ తీస్తోంది. అనేక ప్రపంచస్థాయి కార్యాలయాలకు, ప్ర‌ముఖ‌ కంపెనీల హెడ్‌క్వార్టర్లకు నెలవైన న్యూయార్క్‌ నగరం ఇపుడు క‌రోనాకు కేంద్ర స్థానంగా మారింది. ఒక్క న్యూయార్క్ న‌గ‌రంలోనే ఇప్ప‌టి వ‌ర‌కు 46,262 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 600పైగా మ‌ర‌ణించారు. ఈ గ‌ణంకాలే ఈ న‌గ‌రంలో వైర‌స్‌ ప్ర‌భావం ఏ స్థాయిలో ఉందో తెలియ‌జేస్తున్నాయి. అటు న్యూజెర్సీ, కాలిఫోర్నియా, వాషింగ్టన్‌ డీసీ, ఫ్లోరిడా, ఇల్లినాయిస్‌, మిచిగాన్‌, పెన్సిల్వేనియా, టెక్సాస్‌, లూసియానా, జార్జియాల్లో, కొల‌రాడో, మసాచుసెట్స్, చికాగో, డెట్రాయిట్ త‌దిత‌ర రాష్ట్రాల్లో తీవ్రంగా ఉంది. 

Updated Date - 2020-03-28T19:50:15+05:30 IST