న్యూయార్క్‌లో పులికి క‌రోనా వైరస్‌...

ABN , First Publish Date - 2020-04-07T14:06:56+05:30 IST

కరోనా జంతువులనూ వదలడం లేదు. అమెరికాలోని న్యూయార్క్‌లో ఓ జూలో పులికి కరోనా సోకడంతో తెలంగాణ అటవీ శాఖ అప్రమత్తమైంది.

న్యూయార్క్‌లో పులికి క‌రోనా వైరస్‌...

తెలంగాణలో దాదాపు 50 పులులు.. 

జాగ్రత్తలు తీసుకోవాలన్న ఎన్టీసీఏ 

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): కరోనా జంతువులనూ వదలడం లేదు. అమెరికాలోని న్యూయార్క్‌లో ఓ జూలో పులికి కరోనా సోకడంతో తెలంగాణ అటవీ శాఖ అప్రమత్తమైంది. న్యూయార్క్‌లోని బ్రోంక్స్‌ జూలో మలయన్‌ జాతికి చెందిన నాలుగేళ్ల నదియా అనే ఆడ పులి కరోనా బారిన పడింది. ఓ ఉద్యోగి నుంచి పులికి కరోనా సోకి ఉంటుందని భావిస్తున్నారు. ఇక బెల్జియంలో యజమాని ద్వారా పిల్లికి కరోనా వచ్చింది. హాంకాంగ్‌లో ఒక కుక్కకు కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే ఈ జంతువుల నుంచి తిరిగి మనుషులకు వైరస్‌ వ్యాపిస్తుందనే విషయంలో ఎలాంటి నివేదికలు వెలువడలేదు. పులికి వైరస్‌ సోకడంతో తెలంగాణ అటవీ శాఖ రంగంలోకి దిగింది. అమ్రాబాద్‌, కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌లలో దాదాపు 4 వేల సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి పులుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు కసరత్తు ప్రారంభించింది.


ఈ నేపథ్యంలో జూపార్క్‌లో పెద్దపులలకు ఆహారం అందించే కీపర్లు, ఇతర సిబ్బంది తరచూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని పీసీసీఎఫ్‌ ఆర్‌.శోభ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. పెద్దపులులకు జ్వరం ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే వెటర్నరీ వైద్యులకు సమాచారం ఇవ్వాలని నిర్దేశించారు. కాగా, తెలంగాణలో ఉన్న పెద్దపులుల రక్షణకు అన్నిచర్యలు తీసుకోవాలని రాష్ట్ర అటవీశాఖకు జాతీయ పులుల సంరక్షణ మండలి(ఎన్టీసీఏ), కేంద్ర జంతుప్రదర్శన మండలి(సీజెడ్‌ఏ) ఆదేశాలు జారీ చేశాయి. ప్రతి జూపార్క్‌లో క్వారంటైన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని వివరించింది. జంతువులు మరణిస్తే నమూనాలు సేకరించి, కరోనా పరీక్షల కోసం భోపాల్‌లోని ఎన్‌హెచ్‌ఎ్‌సఏడీకి పంపించాలని సూచించాయి. అటవీ శాఖ గణాంకాల ప్రకారం తెలంగాణలో మొత్తం 50కి పైగా పెద్దపులులున్నాయి.


కాగా, తెలంగాణలోని పులులు ఆరోగ్యంగానే ఉన్నాయని వన్యప్రాణి విభాగం ప్రత్యేకాధికారి శంకరన్‌ తెలిపారు. దాదాపు 4 వేల కెమెరాలతో పులుల కదలికలను పసిగడుతున్నామని ఆయన వివరించారు. హైదరాబాద్‌లోని జూపార్క్‌లో ఒక క్వారంటైన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశామన్నారు. జంతువులకు ఆహారం అందించే కీపర్లకు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించినట్లు చెప్పారు. జంతువులకు కరోనా సోకకుండా వైద్య, వెటర్నరీ, ఇతర శాఖల అధికారుల సమన్వయంతో పనిచేస్తున్నామని వివరించారు. 

Read more