కరోనా కాలంలో సరికొత్త రికార్డులు..!
ABN , First Publish Date - 2020-07-20T02:39:03+05:30 IST
కరోనా వేళ గిన్నిస్‌బుక్‌లో కొన్ని కొత్త రికార్డులు నమోదయ్యాయి. కొన్ని ఆసక్తికర రికార్డులు

కరోనా వేళ గిన్నిస్‌బుక్‌లో కొన్ని కొత్త రికార్డులు నమోదయ్యాయి. కొన్ని ఆసక్తికర రికార్డులు ఇవిగో..
కింగ్ ఆఫ్ బ్యాలెన్సింగ్
ఈ కుర్రాడి పేరు మహమ్మాద్ ముక్బల్, ఉండేది యెమెన్ దేశంలో. బ్యాలెన్స్ చేయడంలో దిట్ట. కాయిన్లు, సెల్‌ఫోన్లు, రాళ్లు ఇలా ఏ వస్తువులు ఇచ్చినా బ్యాలెన్స్ చేస్తూ నిల్చోబెట్టేస్తాడు. తాజాగా మూడు గుడ్లను ఒకదానిపై ఒకటి నిల్చోబెట్టి రికార్డు సాధించాడు. సోషల్ మీడియాలో ఇతడిని‘కింగ్ ఆఫ్ బ్యాలెన్సింగ్’ అని పిలుచుకుంటారు. గత ఐదేళ్లుగా ‘బ్యాలెన్సింగ్ ఆర్ట్’ను పెంచుకుంటూ ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చుకున్నాడు.
సూపర్ డాడీ..
అమెరికాలో నివసిస్తున్న జంట చాడ్, అమీలకు మొదట ఇద్దరు పిల్లలు. తరువాత ఒకే కాన్పులో అయిదాగురు పిల్లలు పుట్టారు. ఇప్పుడు వారికి ఏడాదిన్నర వయసు. తండ్రి చాడ్‌కు తరచూ మారథాన్‌లలో పాల్గొనే అలవాటుంది. ఈ జూన్‌లో తన అయిదుగు పిల్లలను స్ట్రోలర్‌లో కూర్చోబెట్టి, దాన్ని తోసుకుంటూ 27.3 మైళ్లు పరిగెత్తాడు. తన భార్య అమీ అయిదుగురిని 27 వారాల మూడు రోజులు తన కడుపులో మోసిందని, ఆమె గౌరవార్థం ఈ పరుగు తీసినట్టు చెప్పాడు. పదిమైళ్లు అయిదుగురు పిల్లలతో పరుగెట్టిన వ్యక్తిగా గిన్నిస్ బుక్ అతడిని గుర్తించింది.
హాట్‌డాగ్స్ హాంఫట్

కడుపునిండా భోజనం చేయడానికే పావుగంట పైనే పడుతుంది. అలాంటిది ఓ వ్యక్తి కేవలం పదినిముషాల్లో 75 హాట్‌డాగ్స్ తినేశాడు. అమెరికాలో గత పద్నాలుగేళ్లుగా ‘హాట్ డాగ్స్ ఈటింగ్ కాంటెస్ట్’ జరుగుతుంది. కాగా గత పదమూడేళ్లుగా జోయ్ చెస్ట్‌సట్ అనే వ్యక్తే విజేతగా నిలుస్తున్నాడు. ఈ ఏడాది జూన్‌లో జరిగిన పోటీలో కూడా ఇతనే గెలిచాడు. పదివేల డాలర్లు బహుమానంగా అందుకున్నాడు.
