టీచర్లకు కువైట్ కొత్త వీసాలు !

ABN , First Publish Date - 2020-12-27T14:35:41+05:30 IST

కరోనా వల్ల విదేశాల్లో చిక్కుకున్న టీచర్లకు కువైట్ సర్కార్ తీపి కబురు అందించింది.

టీచర్లకు కువైట్ కొత్త వీసాలు !

కువైట్ సిటీ: కరోనా వల్ల విదేశాల్లో చిక్కుకున్న టీచర్లకు కువైట్ సర్కార్ తీపి కబురు అందించింది. విదేశీ ఉపాధ్యయులు తిరిగి కువైట్‌లో ప్రవేశించేందుకు కొత్త వీసాలు జారీ చేయనున్నట్లు ఆ దేశ విద్యాశాఖ వెల్లడించింది. చాలా మంది టీచర్లు కొవిడ్-19 విజృంభణ నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోవడం వల్ల మార్చి నుంచి వారి దేశాల్లోనే ఉండిపోయారు. వీరిలో కువైట్ నేరుగా ప్రవేశం కల్పించని 35 దేశాలకు చెందిన ఉపాధ్యయులు కూడా ఉన్నారు. దీంతో ఈ సమస్యను పరిష్కరించడానికి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ముందుకువచ్చింది. 


కువైట్ సర్కార్‌తో చర్చించి విదేశాల్లో చిక్కుకున్న టీచర్లను కువైట్ రప్పించేందుకు కొత్త వీసాల జారీ ప్రక్రియకు ఒప్పించింది. దీంతో వీసా గడువు ముగిసిన సుమారు 330 మంది ప్రవాస ఉపాధ్యయులకు కొత్త వీసాల ద్వారా కువైట్ వెళ్లేందుకు మార్గం సుగమమైంది. ప్రధానంగా ఐదు సబ్జెక్టులు మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, మ్యూజిక్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు కొత్త వీసాలపై కువైట్ వెళ్లొచ్చు. కాగా, విదేశీ టీచర్లకు కువైట్ ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆగస్టు నుంచి రెసిడెన్సీ పర్మిట్లను రెన్యూవల్ చేయడం నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా కొత్త వీసాల ద్వారా ప్రవేశానికి అనుమతి ఇవ్వడం విదేశీ టీచర్లకు పెద్ద ఊరట అని చెప్పొచ్చు.    

Updated Date - 2020-12-27T14:35:41+05:30 IST