యూఏఈ నుంచి భారత్‌కు వచ్చే చార్టెడ్ విమానాలకు కొత్త మార్గదర్శకాలు..
ABN , First Publish Date - 2020-06-25T16:46:47+05:30 IST
కరోనా లాక్‌డౌన్‌తో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను కేంద్రం 'వందే భారత్ మిషన్' ద్వారా స్వదేశానికి తరలిస్తున్న విషయం తెలిసిందే.

యూఏఈ: కరోనా లాక్‌డౌన్‌తో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను కేంద్రం 'వందే భారత్ మిషన్' ద్వారా స్వదేశానికి తరలిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈ మిషన్‌లో ఆయా దేశాల్లోని భారత ఎంబసీలు, కాన్సులేట్లు కీలక భూమిక పోషిస్తున్నాయి. విదేశాల నుంచి మూడు దశల్లో ఎన్నారైల తరలింపు కొనసాగుతోంది. ఇదిలా ఉంటే... యూఏఈలో చిక్కుకున్న భారత ప్రవాసులను స్వదేశానికి తరలించడంలో కీలకంగా వ్యవహరించిన అబుధాబిలోని ఇండియన్ ఎంబసీ, దుబాయిలోని భారత దౌత్య కార్యాలయం మే 7వ తేదీ నుంచి జూన్ 20 వరకు సుమారు 60వేల మంది ఎన్నారైలను ఎయిరిండియా, ఇతర ప్రత్యేక విమానాల ద్వారా స్వదేశానికి తరలించాయి. గత మూడు వారాలుగా ఈ తరలింపు మరింత వేగవంతంగా జరుగుతోంది. ఇప్పటి వరకు ప్రత్యేక మార్గదర్శకాలతో దాదాపు 200 చార్టెడ్ ఫ్లైట్స్ భారత్‌కు పంపించడం జరిగింది. అయితే, జూన్ 25 నుంచి ఇండియాకు రానున్న చార్టెడ్ విమానాల విషయంలో భారత ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విధించినట్లు దుబాయిలోని భారత ఎంబసీ పేర్కొంది. యూఏఈతో పాటు ఇతర దేశాల నుంచి వచ్చే అన్ని ప్రత్యేక విమానాలకు ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయని సంబంధిత అధికారులు పేర్కొన్నారు.
ఇండియన్ గవర్నమెంట్ విదేశాల నుంచి వచ్చే చార్టెడ్ విమానాల కోసం విడుదల చేసిన కొత్త మార్గదర్శకాల ప్రకారం ప్రతి ఫ్లైట్ ఆపరేటర్ ముందుగానే తమ ప్రయాణికుల వివరాలతో చార్ట్‌ను రూపొందించాలి. ఆ చార్ట్‌ను భారత్‌లోని గమ్యస్థానం ఉండే రాష్ట్ర ప్రభుత్వానికి అందించడంతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తీసుకోవాలి. అనంతరం ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి పత్రాలు, ప్రయాణికుల చార్ట్‌తో భారత ఎంబసీలు, కాన్సులేట్ల నుంచి ఎన్ఓసీ(నో అబ్జెక్షన్ సర్టిఫికేట్) పొందాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి పత్రాలు... ఎంబసీలు, కాన్సులేట్ కార్యాలయాల ఎన్ఓసీలను జతపరుస్తూ డీజీసీఏ(డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) అనుమతి పొందాల్సి ఉంటుందని దుబాయిలోని భారత ఎంబసీ అధికారులు వెల్లడించారు. అయితే, ఇప్పటికే అనుమతి పొందిన విమాన సర్వీసులకు ఈ మార్గదర్శకాలు వర్తించవు అని అధికారులు తెలిపారు. ఇకపై ఈ కొత్త మార్గదర్శకాలను పాటిస్తేనే ఆయా విమాన ఆపరేటర్లకు అనుమతి లభించనుంది.