అమెరికాపై మృత్యు మేఘాలు.. 3 లక్షలకు పైగా పాజిటివ్‌లు

ABN , First Publish Date - 2020-04-05T08:40:42+05:30 IST

కరోనా విలయం ప్రపంచాన్ని విషాదంలోకి నెట్టివేస్తోంది. ‘ఇప్పుడేముంది.. అసలు ముప్పు మునుముందు ఉంది’ అంటూ అంతర్జాతీయ సంస్థలు చేస్తున్న హెచ్చరికలు మానవ జాతికి మరింతగా ప్రమాద ఘంటికలను పెంచుతున్నాయి. యూరప్‌ గడగడలాడిపోతుంటే, అమెరికాపై మృత్యుమేఘాలు అలుముకొన్నాయి. ఒక్కరోజే 1500 మంది అక్కడ చనిపోయారు.

అమెరికాపై మృత్యు మేఘాలు.. 3 లక్షలకు పైగా పాజిటివ్‌లు

  • 3 వేల మృతులకు 3 నిమిషాలు నివాళులర్పించిన చైనీయులు
  • సిరియా,లిబియాకీ విస్తరణపై ఐక్యరాజ్యసమితి కలవరం
  • స్పెయిన్‌లో లాక్‌డౌన్‌ పొడిగింపు


వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 4 : కరోనా విలయం ప్రపంచాన్ని విషాదంలోకి నెట్టివేస్తోంది. ‘ఇప్పుడేముంది.. అసలు ముప్పు మునుముందు ఉంది’ అంటూ అంతర్జాతీయ సంస్థలు చేస్తున్న హెచ్చరికలు మానవ జాతికి మరింతగా ప్రమాద ఘంటికలను పెంచుతున్నాయి. యూరప్‌ గడగడలాడిపోతుంటే, అమెరికాపై మృత్యుమేఘాలు అలుముకొన్నాయి. ఒక్కరోజే 1500 మంది అక్కడ చనిపోయారు. అందులో 560 మంది ఒక్క న్యూయార్క్‌ నగరంలోనే ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ దేశం మాస్కులు ధరించడాన్ని ప్రతి పౌరుడికీ తప్పనిసరి చేసింది. ఫ్లూతో బాధపడేవారు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు పరిసరాల్లో ఉంటే కరోనా సోకుతుందని ఇప్పటిదాకా భావించారు. అయితే, వారు మాట్లాడినప్పుడు పక్కన ఉన్నా, శ్వాస తీసుకొన్నా ఆపదేనని ఆంటోనీ ఫౌచీ అనే శాస్త్రవేత్త ప్రకటించడంతో ప్రభు త్వం ఈ నిర్ణయం తీసుకొంది.దీనిపై అధ్యక్షుడు ట్రంప్‌ స్వయంగా ప్రకటన చేశారు.


అయితే, తాను మాత్రం మాస్కు ధరించబోనని చెప్పారు. ‘‘వ్యాధుల నియంత్ర ణ కేంద్రం సూచనల మేరకు అందరూ మాస్కులు పెట్టుకోవాలి. గుడ్డతో తయారుచేసినవి ధరిస్తే సరిపోతుంది. మెడికల్‌ గ్రేడ్‌, సర్జికల్‌గ్రేడ్‌ మాస్కులు మనల్ని రక్షిచే వైద్యులు, సర్జన్లు మాత్రమే వాడతారు’’ అని వివరించారు. కరోనా వైద్యానికి హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ వాడొచ్చునని ట్రంప్‌ పునరుద్ఘాటించారు. యుద్ధానికి ఏమాత్రం తక్కువగాని ఈ పరిస్థితిని ఎదుర్కొనేందు కు సైన్యాలను దించకతప్పదని ఆయన తెలిపారు. అమెరికాలో ఈ రోజు వరకు 2,70లక్షల పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 7 వేల మంది చనిపోయారు. ప్రతి 10 మందికి 9 మంది కట్టడిలో ఉన్నారు. 


జాతి యావత్తు శిరస్సు వంచి.. 

కరోనా కేంద్రం చైనా ఈ వైర్‌సతో మరణించిన 3 వేలమందికి 3నిమిషాలు మౌనం పాటించింది. వూహాన్‌లో చనిపోయిన వీరికి జాతి యావత్తు నివాళులర్పించింది. అధ్యక్షుడు జింపింగ్‌ సహా కమ్యూనిస్టు అత్యున్నత నాయకత్వమంతా శిరస్సులు వంచి నివాళులు అర్పించారు. జాతీయ జెండాలను సగంమేర అవనతం చేశారు. కరోనాను ధీరోదత్తం గా ఎదుర్కొన్న 14మంది వైద్య సిబ్బందికి పతకాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా ముప్పును తొలిలోనే పసిగట్టి చెప్పినందుకు అధికారుల శిక్షకు గురైన వైద్యు డు కూడా ఈ జాబి తాలో ఉండటం గమనార్హం. కరోనాపై పోరులో భాగంగా 46 మంది వైద్య సిబ్బంది, 95 మంది పోలీసు అధికారులు చనిపోయారు. ఆరోగ్య విషాదంపై చైనా జాతీయ సంతాపం ప్రకటించడం ఇదే తొలిసారి. అక్కడ ప్రాణం పోసుకొన్న ఈ మహమ్మారి శనివారం వరకు 11 లక్షలమందికి సోకగా, 60వేలమంది మృత్యువాతపడ్డారు. ఈ మరణాల్లో 40వేలు దాకా యూర్‌పలోనే చోటుచేసుకొన్నాయి.


హాట్‌స్పాట్‌ దేశం స్పెయిన్‌లో 24 గంటల్లోనే 900 మంది చనిపోయారు. ఈ నెల 25 దాకా లాక్‌డౌన్‌ను కొనసాగించాలని స్పెయిన్‌ నిర్ణయించింది. ఇటలీలో 766 మంది చనిపోయారు. 17 మంది వైద్యుల్లో పాజిటివ్‌ లక్షణాలు బయటపడ్డాయి. మరికొంత కాలం భౌతిక దూరం పాటించాలని జర్మనీ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. బ్రిటన్‌ నులివెచ్చటి వేసవి వాతావరణంలో ఆదివారం గడపాలనే కోరికను తాత్కాలికంగా విరమించుకోవాలని ఆదేశించింది. అక్క డ ఒక్కరోజే 708 మంది మరణించారు. దీంతో మరణాలు 4,313కు చేరాయి. 42వేల పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.   


కొత్త తావుల్లో కలకలం..

పశ్చిమ, తూర్పు యూర్‌పను చుట్టుబెట్టిన కరోనా ఇప్పుడు సిరియా, లిబియా, యేమెన్‌ వైపు విస్తరిస్తుండటం పట్ల ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది. నిత్య యుద్ధ, హింసాత్మక ఘర్షణలతో నిండిన ఈ దేశాల్లో కరోనా విజృంభిస్తే ఘోర పరిస్థితి తప్పదని ప్రకటించింది. పాకిస్థాన్‌లో పాజిటివ్‌ కేసులు ఒక్కరోజే 2,708కి చేరాయి. పాక్‌కు 200 మిలియన్‌ డాలర్లను ప్రపంచ బ్యాంకు మంజూరు చేసింది. ఒకేరోజు 9 పాజిటివ్‌ కేసులు బయటపడటంతో ఈ నెల 11 వరకు రవాణా బంద్‌కు బంగ్లాదేశ్‌ పిలుపునిచ్చింది. సింగపూర్‌లో కేసులు 1,114కు చేరాయి. కాగా, అమెరికా, రష్యాల మధ్య కరోనా కారణంగా మరోసారి అగ్గి రాజుకొంది. అత్యవసర మందులు, చికిత్స పరికరాలతో నిండిన విమానం రష్యా నుంచి బుధవారం అమెరికా చేరడంపై రెండు దేశాల మధ్య వివాదం నెలకొంది.


భారత సంతతి దాతృత్వం 

అమెరికాలోని ప్రవాసులు భారత్‌లో కరోనా నిరోధక  యత్నాలకు సహకరించాలని నిర్ణయించారు. గుజరాత్‌ భూకంప బాధితుల సహాయార్థం విరాళాలు సేకరించిన అమెరికా-ఇండియా ఫౌండేషన్‌ ఇప్పుడు కూడా ముందుకొచ్చింది. పేదరికంతో బాధపడుతూ కరోనా ప్రమాదం గురించి అవగాహన తక్కువగా ఉండేవారికి, హెల్త్‌ ఎమర్జెన్సీతో ఆర్థికంగా చితికిపోయినవారికీ అన్ని సేవలు అందిస్తామని సంస్థ సీఈవో నిషాంత్‌ పాండే తెలిపారు. 

Updated Date - 2020-04-05T08:40:42+05:30 IST