నాట్స్ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌లో పద్య సంగీత విభావరి

ABN , First Publish Date - 2020-06-22T15:01:32+05:30 IST

భాషే రమ్యం.. సేవే గమ్యం అనే నినాదంతో అమెరికాలో తెలుగు ప్రజలకు సేవలందిస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. ఆన్‌లైన్‌లో పద్య సంగీత విభావరి నిర్వ

నాట్స్ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌లో పద్య సంగీత విభావరి

న్యూజెర్సీ: భాషే రమ్యం.. సేవే గమ్యం అనే నినాదంతో అమెరికాలో తెలుగు ప్రజలకు సేవలందిస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. ఆన్‌లైన్‌లో పద్య సంగీత విభావరి నిర్వహించింది. ప్రముఖ రంగస్థల నటులు గుమ్మడి గోపాలకృష్ణ చే నాట్స్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. తెలుగు పద్యాల్లోని మాధుర్యాన్ని గుర్తు చేసేలా గుమ్మడి గోపాలకృష్ణ పద్య సంగీత విభావరి కొనసాగింది. నాట్స్ నాయకులు డాక్టర్ సూర్యం గంటి ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహారించారు. నాట్స్ మాజీ ఛైర్మన్ డాక్టర్ మధు కొర్రపాటి, నాట్స్ వైస్ ఛైర్మన్ అరుణ గంటి ఈ కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు.


అమెరికాలోని తెలుగువారు ఆన్‌లైన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. రంగస్థల నటులు గుమ్మడి గోపాలకృష్ణ.. శ్రీనాథుడు, అల్లసాని పెద్దన్న పద్యాలను రాగయుక్తంగా ఆలపించారు. హరిశ్చంద్ర, చింతామణి నాటక పద్యాలను కూడా ఎంతో శ్రావ్యంగా ఆలపించి తెలుగు భాషలోని మథురిమల గొప్పతనాన్ని చాటారు. తెలుగు పద్యాలు పాడటం భావ వ్యక్తీకరణకు ఎంతో దోహదం చేస్తుందని రంగస్థల నటులు గుమ్మడి గోపాలకృష్ణ తెలిపారు. ఏ విషయాన్నైనా స్పష్టంగా చెప్పగలిగేందుకు కూడా పద్యగానం తోడ్పడుతుందన్నారు. ఏ దేశమేగినా మాతృభాషను మరిచిపోరాదని అన్నారు.  తులభారం  నాటక పద్యాలను ప్రముఖ రంగస్థల నటీమణి రత్నశ్రీ ఆలపించి శ్రోతలను ఆకట్టుకున్నారు.


దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ పద్య సంగీత విభావరి ఆద్యంతం ఆకట్టుకునే విధంగా సాగింది. అమెరికాలో ఉంటున్న తెలుగువారికి ఈ కార్యక్రమం తెలుగు పదాలు, పద్యాలను గుర్తు చేసింది. శ్రీధర్ అప్పసాని మాట్లాడుతూ.. వీక్షకుల కోరిక మేరకు త్వరలో ఈ కార్యక్రమం పార్ట్ 2 కూడా చేయాలని గోపాల కృష్ణ గారిని కోరారు. గోపాల కృష్ణ మాట్లాడుతూ.. ప్రస్తుతం కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా విజృంభించి పేద కళాకారుల జీవనానికి ఆటంకంగా మారిందన్నారు. ఈ నేపథ్యంలో వారిని ఆదుకోవలసిందిగా కోరారు. డా. మధు కొర్రపాటి మాట్లాడుతూ చిన్న పిల్లలతో, నూతన కళాకారులతో కూడా మున్ముందు మంచి కార్యక్రమం చేయాలని కోరారు. పేద కళాకారుల భృతి కోసం, గుమ్మడి గోపాల కృష్ణ ఫౌండేషన్ ద్వారా ఈ కళాభివృద్దికి తమ వంతు సహాయ సహకారాలు అందించటానికి నాట్స్ ఎప్పుడూ ముందుంటుందని వివరించారు శ్రీధర్.  తెలుగు భాష వికాసం కోసం నాట్స్ ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చేపడుతుందని నాట్స్ ఛైర్మన్ శ్రీథర్ అప్పసాని, నాట్స్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడి తెలిపారు.


Updated Date - 2020-06-22T15:01:32+05:30 IST