కరోనా టైంలో.. సంబరాల్లో మునిగి తేలుతున్న ఉత్తర కొరియా!

ABN , First Publish Date - 2020-10-13T00:49:10+05:30 IST

ప్రపంచం మొత్తం కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తుంటే.. ఉత్తర కొరియా మాత్రం సంబరాల్లో మునిగి తేలుతోంది. ఉత్తర కొరియాలో కరోనా కేసులు లేవా? ఎందుకు ఆ వేడుకలు అనే వివరాల్లోకి వెళితే.. ఉత్తర కొరియాలో ప్రస్తుతం అధికారంలో ఉ

కరోనా టైంలో.. సంబరాల్లో మునిగి తేలుతున్న ఉత్తర కొరియా!

సియోల్: ప్రపంచం మొత్తం కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తుంటే.. ఉత్తర కొరియా మాత్రం సంబరాల్లో మునిగి తేలుతోంది. ఉత్తర కొరియాలో కరోనా కేసులు లేవా? ఎందుకు ఆ వేడుకలు అనే వివరాల్లోకి వెళితే.. ఉత్తర కొరియాలో ప్రస్తుతం అధికారంలో ఉన్న ‘వర్కర్స్ పార్టీ ఆప్ కొరియా’ను స్థాపించి 75 సంవత్సరాలు అవుతోంది. ఈ క్రమంలో ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్.. ‘వర్కర్స్‌ పార్టీ ఆఫ్‌ కొరియా’ 75వ వార్షికోత్సవ వేడుకలను ఆదివారం అట్టహాసంగా నిర్వహించారు. అధ్యక్షుడి ఆదేశాల ప్రకారం అధికారులు భారీ ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే వేలాది మంది సింగర్‌లు, డ్యాన్సర్‌లు, జిమ్నాస్ట్‌లు, మార్షల్ ఆర్టిస్ట్‌లు వేడుకల్లో పాల్గొని ప్రదర్శనలు ఇచ్చారు. వీటిని చూడటానికి జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. కాగా.. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌జాంగ్ ఈ సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి ఆనందం వ్యక్తం చేశారు. ఉత్తర కొరియాలో నమోదైన కరోనా వైరస్ కేసుల విషయానికి వస్తే.. తమ దేశంలో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని ఇటీవల కిమ్ జాంగ్ ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి మొదలవగానే ముందుగానే జాగ్రత్తపడిన కిమ్ జాంగ్ దేశ సరిహద్దులను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉంటే.. ఉత్తర కొరియాలో వైరస్ సోకిన ఓ వ్యక్తిని కాల్చి చంపినట్టు గతంలో వార్తలు కూడా వచ్చాయి. కరోనా వైరస్‌కు పుట్టినిల్లు అయిన చైనాలో కూడా ఇటీవల పెద్ద ఎత్తున వేడుకలు జరిగాయి. వుహాన్‌లోని మాయా బీచ్ వాటర్ పార్క్‌లో జరిగిన ఓ పార్టీలో జనం భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించి ఎంజాయ్ చేసిన విషయం తెలిసిందే. కాగా.. భారత్ సహా అమెరికా వంటి అగ్రదేశాలు కరోనా వైరస్‌ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. మహమ్మారకి పుట్టినిల్లు అయిన చైనా దాని పక్కనే ఉన్న ఉత్తర కొరియా దేశాలు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. 

Updated Date - 2020-10-13T00:49:10+05:30 IST