‘కొవిడ్19’ నెంబర్‌ప్లేట్.. నెలల తరబడి పార్కింగ్‌లోనే..

ABN , First Publish Date - 2020-07-15T00:30:00+05:30 IST

ఆస్ట్రేలియాలోని అడెలైడ్ ఎయిర్‌పోర్ట్‌లో ఓ బీఎమ్‌డబ్ల్యు కారు నెలల నుంచి పార్కింగ్‌లోనే ఉంటోంది.

‘కొవిడ్19’ నెంబర్‌ప్లేట్.. నెలల తరబడి పార్కింగ్‌లోనే..

సిడ్నీ: ఆస్ట్రేలియాలోని అడెలైడ్ ఎయిర్‌పోర్ట్‌లో ఓ బీఎమ్‌డబ్ల్యు కారు నెలల నుంచి పార్కింగ్‌లోనే ఉంటోంది. పార్కింగ్‌లో కారు ఉండటం పెద్ద వార్త కాకపోయినా.. ఆ కారు నెంబర్ ప్లేట్‌ మాత్రం కొవిడ్19గా ఉండటంతో ఈ వార్త ఒక్కసారిగా వైరల్ అయిపోయింది. ఈ కారు ఫిబ్రవరి లేదా అంతకుముందు నుంచే పార్కింగ్‌లో ఉన్నట్టు ఎయిర్‌పోర్ట్‌లో పనిచేస్తున్న స్టీవెన్స్ స్ప్రై అనే వ్యక్తి చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) కరోనా మహమ్మారిని కొవిడ్-19గా ఫిబ్రవరి 11న నామకరణం చేసింది. ఈ కారు నెంబర్ ప్లేట్ రిజిస్ట్రేషన్ ఆ తర్వాతే జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. అసలు కొవిడ్19 అనే నెంబర్ ప్లేట్ కారు యజమానికి ఎలా వచ్చిందని ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. మరోపక్క రవాణాశాఖ మాత్రం కొవిడ్19 పేరిట ఎటువంటి నెంబర్ ప్లేట్ జారీ చేయనట్టు సమాచారం. ఈ కారు పైలట్ లేదా ఎయిర్ హోస్టెస్‌కు చెందినది అయుండొచ్చని.. వారు కరోనా కారణంగా విదేశాల్లో చిక్కుకుని ఉండొచ్చని స్టీవెన్స్ అభిప్రాయపడుతున్నారు. మరోపక్క లాక్‌డౌన్ ప్రకటించిన నాటి నుంచి విమానసేవలు పూర్తిగా నిలిచిపోయాయని.. ఈ క్రమంలో సిబ్బందిలో ఎవరో ఒకరు కారును పార్కింగ్‌లోనే వదిలేసి ఉండొచ్చన్నారు. సహజంగా ఎయిర్‌పోర్ట్ సిబ్బందికి చెందిన వాహనాలను పార్కింగ్‌లో రెండు రోజుల కంటే ఎక్కువ ఉంచకూడదని స్టీవెన్స్ చెప్పారు. మరి ఈ కారు సిబ్బందికి చెందినదా కాదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందేనని స్టీవెన్స్ చెబుతున్నారు.

Updated Date - 2020-07-15T00:30:00+05:30 IST