అమెరికాలో భారతీయ వైద్యురాలికి దక్కిన అరుదైన గౌరవం...
ABN , First Publish Date - 2020-04-21T16:01:09+05:30 IST
అమెరికాలోని సౌత్ విండ్సర్ ఆస్పత్రిలో పనిచేసే భారత్‌లోని మైసూర్‌కు చెందిన ఉమా మధుసూదన అనే వైద్యురాలికి అరుదైన గౌరవం దక్కింది. కరోనా బాధితులకు మధుసూదన చేస్తున్న సేవలకు గాను అధికారులు ఆమె ఇంటిముందు నుంచి ప్రభుత్వ వాహనాలతో పరేడ్ నిర్వహించారు.

వాషింగ్టన్: అమెరికాలోని సౌత్ విండ్సర్ ఆస్పత్రిలో పనిచేసే భారత్‌లోని మైసూర్‌కు చెందిన ఉమా మధుసూదన అనే వైద్యురాలికి అరుదైన గౌరవం దక్కింది. కరోనా బాధితులకు మధుసూదన చేస్తున్న సేవలకు గాను అధికారులు ఆమె ఇంటిముందు నుంచి ప్రభుత్వ వాహనాలతో పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరుగుపొరుగు వారు ఇళ్ల నుంచి బయటకు వచ్చి చప్పట్లు కొడుతూ ఆమె సేవలకు సెల్యూట్ చేశారు. ఇలా అగ్రరాజ్యంలో భారత వైద్యురాలికి అరుదైన గౌరవం దక్కింది. ఇక అమెరికాలో కరోనా బాధితులకు సేవలు చేస్తున్న వైద్యులను ఇలా ప్రత్యేకంగా గౌరవించి సన్మానిస్తుంటే... మన దగ్గర మాత్రం అదే వైద్యులపై దాడులకు తెగబడుతున్నారు కొందరు అల్లరి మూకలు. ఇది నిజంగా బాధకరం. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి... రోగులను కాపాడేందుకు కృషి చేస్తున్న డాక్టర్ల పట్ల ఇలా అమానుషంగా ప్రవర్తించడం శోచనీయం.
మరోవైపు మహమ్మారి కరోనా వైరస్ అమెరికాను గడగడలాడిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు అగ్రరాజ్యం చిగురుటాకులా వణికిపోతుంది. ప్రతిరోజు వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తుండడం అమెరికన్లను కంటిమీద కనుకు లేకుండా చేస్తోంది. ఎన్ని చర్యలు తీసుకుంటున్న అమెరికాలో 'కొవిడ్-19' మృత్యుహేల మాత్రం ఆగడం లేదు. ఇప్పటివరకు సుమారు 42వేల మందిని ఈ మహమ్మారి పొట్టనబెట్టుకుంది. మరో 7.90 లక్షల మంది ఈ వైరస్ బారిన పడ్డారు. దీంతో అగ్రరాజ్యం ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో బిక్కుబిక్కుమంటోంది. ఇక కరోనా బాధితులకు చికిత్స చేసేందుకు అక్కడి వైద్యులు రెయింబవళ్లు కష్టపడుతున్నారు. నెల రోజులుగా కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య క్షణ క్షణం పెరుగుతూనే ఉంది. దేశంలోని ఆస్పత్రులన్ని కరోనా పేషెంట్లతోనే నిండిపోయాయి. దీంతో కరోనా బాధితులకు చికిత్స అందించే క్రమంలో వైద్యులు రోజుల తరబడి తమ కుటుంబాలకు కూడా దూరం అవుతున్నారు. ఇలా తమ వ్యక్తిగత జీవితాలను దూరం చేసుకొని మరి బాధితులకు సేవలు చేస్తున్న వైద్యులకు అక్కడి ప్రజలు, ప్రభుత్వ అధికారులు, తోటివాళ్లు తమదైన శైలిలో ప్రత్యేకంగా గౌరవ మర్యాదలు చేస్తున్నారు.