అంబానీని వెనక్కు నెట్టిన జెఫ్ బెజోస్ మాజీ భార్య

ABN , First Publish Date - 2020-04-15T22:16:44+05:30 IST

కొవిడ్-19 కారణంగా ప్రపంచం మొత్తం స్తంభించిన విషయం తెలిసిందే. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడంతో ప్రపంచవ్యాప్తంగా అనేక మల్టీనేషన

అంబానీని వెనక్కు నెట్టిన జెఫ్ బెజోస్ మాజీ భార్య

వాషింగ్టన్: కొవిడ్-19 కారణంగా ప్రపంచం మొత్తం స్తంభించిన విషయం తెలిసిందే. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడంతో ప్రపంచవ్యాప్తంగా అనేక మల్టీనేషనల్ కంపెనీలు లక్షల కోట్ల నష్టాలను చవిచూస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ప్రపంచంలో అత్యధిక ధనవంతుడు, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఆస్తులు మాత్రం రోజురోజుకూ పెరుగుతూ పోతున్నాయి. కరోనా అంశం ఒకవిధంగా అమెజాన్ సంస్థకు లాభాన్ని చేకూర్చిందనే చెప్పాలి. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అమెజాన్ సంస్థకు చెందిన సర్వీసులపైనే ఆధారపడుతున్నారు. దీంతో అమెజాన్ స్టాక్ విలువ రోజురోజుకూ పెరుగుతూ పోతోంది. ఒక్క మంగళవారం రోజునే అమెజాన్ స్టాక్ విలువ 5.3 శాతం పెరిగింది. దీంతో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ నికర ఆస్తుల విలువ 138.5 బిలియన్ డాలర్లకు చేరింది. 


జెఫ్‌బెజోస్‌తో పాటు అమెజాన్‌లో స్టాక్ కలిగిన వారి ఆస్తుల విలువ కూడా అమాంతం పెరిగింది. జెఫ్ బెజోస్ మాజీ భార్య మెకెంజీ బెజోస్ అమెజాన్‌‌లో నాలుగు శాతం స్టాక్ కలిగి ఉన్నారు. అమెజాన్ స్టాక్ విలువ పెరగడంతో.. ఆమె నికర ఆస్తుల విలువ కూడా 8.2 బిలియన్ డాలర్లు పెరిగింది. తాజాగా పెరిగిన లెక్కలతో మెకెంజీ బెజోస్ భారతదేశ అత్యంత ధనవంతుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ స్థానాన్ని అధిగమించారు. ప్రస్తుతం ముఖేష్ అంబానీ నికర ఆస్తుల విలువ 42.1 బిలియన్ డాలర్లుగా ఉండగా.. మెకెంజీ నికర ఆస్తుల విలువ 44.8 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇప్పటివరకు ప్రపంచ అత్యధిక ధనవంతుల జాబితాలో ముఖేష్ అంబానీ 18వ స్థానంలో ఉండగా.. ఇప్పుడు ఆ స్థానాన్ని మెకెంజీ బెజోస్ ఆక్రమించారు. 2020వ సంవత్సరం మొదలైన సమయంలో అంబానీ నికర ఆస్తుల విలువ 58.6 బిలియన్ డాలర్లగా ఉండేది. కరోనా దెబ్బ ముఖేష్ అంబానీ సంస్థలపై కూడా భారీగా పడింది. కాగా.. అమెజాన్‌తో పాటుగా అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా సంస్థ కూడా లాభాలను చూస్తోంది. గడిచిన 2 రోజుల్లో టెస్లా స్టాక్ 28 శాతం పెరిగింది. దీంతో టెస్లా సీఈఓ ఇలాన్ మస్క్ నికర ఆస్తుల విలువ 10.4 బిలియన్ డాలర్లు పెరిగింది. 

Updated Date - 2020-04-15T22:16:44+05:30 IST