30 వేల మందిపై కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్.. అమెరికాలో..

ABN , First Publish Date - 2020-07-28T01:17:51+05:30 IST

ప్రపంచలోనే అతిపెద్ద కొవిడ్-19 వ్యాక్సిన్ అధ్యయనం సోమవారం ప్రారంభమైంది

30 వేల మందిపై కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్.. అమెరికాలో..

వాషింగ్టన్: ప్రపంచలోనే అతిపెద్ద కొవిడ్-19 వ్యాక్సిన్ అధ్యయనం సోమవారం ప్రారంభమైంది. కొవిడ్-19 వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్న సంస్థల్లో అమెరికాలోని బయోటెక్ కంపెనీ మోడర్నా ముందు వరుసలో ఉన్న విషయం తెలిసిందే. వ్యాక్సిన్ అభివృద్ధి చేయడానికి ఈ సంస్థకు అమెరికా ప్రభుత్వమే నిధులు సమకూర్చింది. ఇక ఈ సంస్థ తమ లాస్ట్ స్టేజ్ ట్రయల్స్‌ను సోమవారం ప్రారంభించింది. ఈ ట్రయల్‌లో కొవిడ్-19 వల్ల తలెత్తే శ్వాసకోస సమస్యలు లేని దాదాపు 30 వేల మంది యుక్తవయసున్న వాలంటీర్లు పాల్గొన్నారు. మోడర్నా సంస్థ, అమెరికా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ షాట్స్‌‌ను ఈ వాలంటీర్లపై ప్రయోగించనున్నారు. రెండు డోస్‌లు ఇచ్చిన తరువాత ఎవరిలో ఏ విధంగా ఈ షాట్స్ ప్రభావం చూపిస్తున్నాయన్నదానిపై శాస్త్రవేత్తలు పరీక్షిస్తారు. కాగా.. చైనా, బ్రిటన్‌లో కూడా లాస్ట్ స్టేజ్ ట్రయల్స్‌ జరుగుతున్నప్పటికి అక్కడ చాలా తక్కువ మంది వాలంటీర్లపైనే ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. మోడర్నా సంస్థ మాత్రం ఒకేసారి దాదాపు 30 వేల మందిపై అధ్యయనం చేస్తోంది. కేవలం తామిచ్చిన షాట్స్ పనిచేస్తున్నాయా లేదా అనేది మాత్రమే కాకుండా ఈ అధ్యయనం ద్వారా వ్యాక్సిన్ ఎంత వరకు సురక్షితం అనేది కూడా పరీక్షిస్తున్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక మోడర్నా 30 వేల మందితో లాస్ట్ స్టేజ్ ట్రయల్స్‌ను ప్రారంభిస్తోందనే వార్త వైరల్ అవ్వడంతో.. మోడర్నా షేర్లు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ సంస్థ షేర్లు 11 శాతం పెరిగి ప్రస్తుతం షేర్ ధర 81.31 డాలర్లకు చేరింది. 


Updated Date - 2020-07-28T01:17:51+05:30 IST