టిక్‌టాక్ స‌హా చైనా యాప్‌ల‌ నిషేధంపై పరిశీలిస్తున్నాం: పాంపియో

ABN , First Publish Date - 2020-07-07T17:46:59+05:30 IST

టిక్‌టాక్ స‌హా చైనా యాప్‌ల‌ను బ్యాన్ చేయాల‌ని అమెరికా ఆలోచిస్తున్న‌ట్లు ఆ దేశ‌ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో తెలిపారు.

టిక్‌టాక్ స‌హా చైనా యాప్‌ల‌ నిషేధంపై పరిశీలిస్తున్నాం: పాంపియో

వాషింగ్టన్ డీసీ‌:  టిక్‌టాక్ స‌హా చైనా యాప్‌ల‌ను బ్యాన్ చేయాల‌ని అమెరికా ఆలోచిస్తున్న‌ట్లు ఆ దేశ‌ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో తెలిపారు. ఓ ప్ర‌ముఖ అంత‌ర్జాతీయ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన‌ ఈ విషయాన్ని వెల్ల‌డించారు. చైనాకు చెందిన యాప్‌లను నిషేధించే విష‌య‌మై యూఎస్‌ పరిశీలిస్తోందని చెప్పారు. "ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ క‌న్నాముందే ఈ విష‌యాన్ని తాను బ‌హిర్గతం చేయ‌డం ఇష్టం లేదు కానీ, త‌ప్ప‌కుండా చైనీస్ యాప్ల‌ను బ్యాన్ చేసే దిశ‌గా ఆలోచిస్తున్నామ‌న్నారు." యూఎస్‌లోనూ టిక్‌టాక్‌ను బ్యాన్ చేయాల‌ని తమ ప్రభుత్వానికి కొన్ని రోజుల క్రితం జాతీయ భద్రతా సలహాదారులు సిఫార్సు చేసిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా పాంపియో గుర్తు చేశారు.


అంతేగాక‌ ఇలాంటి యాప్‌ల ద్వారా అమెరికా పౌరుల డేటాను డ్రాగ‌న్ దేశం చోరీ చేస్తోంద‌ని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే అగ్ర‌రాజ్యం ఆ దిశగా చర్యలు తీసుకోవాలనుకుంటోందని స్ప‌ష్టం చేశారు. ఇక ఇటీవల‌ హాంగ్‌కాంగ్‌ భ‌ద్ర‌తా చట్టాన్ని ఆమోదం తెలిపిన‌ చైనా అక్క‌డ‌ టిక్‌టాక్ ఆప‌రేష‌న్స్‌ను నిలిపివేసింది.


ఇదిలా ఉంటే చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ దేశానికి చెందిన టిక్‌టాక్ స‌హా 59 యాప్‌లను నిషేధిస్తూ ఇటీవ‌ల మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో భార‌త చ‌ర్య‌ను అగ్ర‌రాజ్యం అమెరికా కూడా ప్రశంసించింది. ఈ చర్య ఇండియా సార్వభౌమాధికారం, సమగ్రత, భద్రతలకు దోహదపడుతుందని పాంపియో వెల్ల‌డించారు. కాగా, చైనా యాప్‌ల‌ను భార‌త్ నిషేధించ‌డం స‌రైందేన‌ని ఇదివ‌రకే ఆయ‌న స‌మ‌ర్థించారు కూడా. ఇక మ‌హ‌మ్మారి క‌రోనా విష‌యంలో డ్రాగ‌న్ కంట్రీపై యూఎస్ విరుచుకుప‌డుతోంది. కేవలం చైనా వ‌ల్లే ఇవాళ ప్ర‌పంచ దేశాలు సంక్షోభంలో ప‌డ్డాయ‌ని అగ్ర‌రాజ్యం ఆరోపిస్తోంది. వూహాన్ ల్యాబ్‌లోనే క‌రోనా వైర‌స్ పురుడుపోసుకుంద‌ని అధ్య‌క్షుడు ట్రంప్ ప‌దేప‌దే చెబుతున్న విష‌యం విదిత‌మే. ‌

Updated Date - 2020-07-07T17:46:59+05:30 IST