కెనడా నుంచి స్కాట్లాండ్.. బాటిల్‌లో 2వేల మైళ్లు ప్రయాణించిన మెసేజ్!
ABN , First Publish Date - 2020-12-12T00:42:47+05:30 IST
బాటిల్ ఓ సమాచారాన్ని కెనడా నుంచి స్కాట్లాండ్ వరకు దాదాపు 2వేల మైళ్ల దూరం మోసుకెళ్లి ఓ జంటకు చే
బ్రిటన్: బాటిల్ ఓ సమాచారాన్ని కెనడా నుంచి స్కాట్లాండ్ వరకు దాదాపు 2వేల మైళ్ల దూరం మోసుకెళ్లి ఓ జంటకు చేరవేసిన ఘటన ఇటీవల చోటుచేసుకుంది. ఇంతకూ ఆ బాటిల్‌లో ఏం సమాచారం ఉంది? ఎవరు ఎవరికి చేరవేశారు? అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకునేందుకు ఈ వార్తను చదవండి. స్కాట్లాండ్‌కు చెందిన షారోన్, మిచెయిల్ కాక్స్ దంపతులు తమ శునకాన్ని వెంటపెట్టుకుని సరదాగా బీచ్‌లో గడిపేందుకు వెళ్లారు. బీచ్ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ ఆ జంట నడుస్తుండగా.. వారి శునకం బీచ్‌లో ఉన్న ఇసుక నుంచి ఓ ప్లాస్టిక్ బాటిల్‌ను తీసింది. బాటిల్‌లో కాగితం ఉండటంతో.. ఆ దంపతులు ఇద్దరూ ఆశ్చర్యపోయారు. అనంతరం బాటిల్‌లోని కాగితాన్ని తీసి చూశారు.
అందులో.. ‘హాయ్ నా పేరు కాయా. నేను మా అంకుల్ కర్ట్ కలిసి దీన్ని రాస్తున్నం. ఈ లెటర్‌ను ఎవరో ఒకరికి చేరుతుందని.. ఎంత దూరం ఇది ప్రయాణించిందో తెలుసుకుంటారని భావిస్తున్నాం. ఫిషింగ్ బోట్ నుంచి మా అంకుల్ దీన్ని సముద్రంలో వేస్తారు. ఆయన బాటిల్ ను విడిచే ప్రాంతంకు సంబంధించిన లాటిట్యూడ్, లాంగిట్యూడ్ వివరాలను లెటర్‌లో పేర్కొంటారు. నేను కెనడాలోని రీఫ్స్ హార్బర్ అనే చిన్న పట్టణంలో నివసిస్తున్నాను’ అని ఉండటంతో ఆ దంపతులు షాక్ అయ్యారు. తర్వాత తమకు బాటిల్ దొరికిందనే విషయాన్ని ఆ అమ్మాయికి తెలిపేందుకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఈ క్రమంలో ఆ దంపతుల ప్రయత్నం ఫలిచింది. వాళ్లు పెట్టిన పోస్ట్‌ను కాయా కుటుంబం చూసింది. ఈ విషయాన్ని షారోన్, మిచెయిల్ కాక్స్ దంపతులే స్వయంగా తెలిపారు. పోస్ట్ చూసి కాయా బామ్మ తమను సంప్రదించినట్టు పేర్కొన్నారు. ఈ విషయాన్ని తెలుసుకుని కాయా సంబరపడినట్టు తన బామ్మ చెప్పారని ఆ దంపతులు వెల్లడించారు.