కరోనా కాటుకు వృద్ధ దంపతుల మృతి.. మరణంలోనూ ఒకటిగా!

ABN , First Publish Date - 2020-04-06T02:09:32+05:30 IST

సువర్ట్ బేకర్ వయసు 74 సంవత్సరాలు.. అడ్రియాన్ బేకర్ వయసు 72 ఏళ్లు. వీరిద్దరు 51 ఏళ్ల క్రితం.. వివాహ బంధంతో ఒకటయ్యారు. సుదీర్ఘ వైవాహిక జీవితంలో

కరోనా కాటుకు వృద్ధ దంపతుల మృతి.. మరణంలోనూ ఒకటిగా!

ఫోరిడా: సువర్ట్ బేకర్ వయసు 74 సంవత్సరాలు.. అడ్రియాన్ బేకర్ వయసు 72 ఏళ్లు. వీరిద్దరు 51 ఏళ్ల క్రితం.. వివాహ బంధంతో ఒకటయ్యారు. సుదీర్ఘ వైవాహిక జీవితంలో ఆ దంపతులిద్దరూ.. ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొన్నారు. కష్టసుఖాల్ని కలిసి పంచుకున్నారు. ఈ నేపథ్యంలో చావు కూడా వీరిద్దరినీ విడదీయలేకపోయింది. కేవలం నిమిషాల వ్యవధిలోనే ఇరువురూ మరణించారు. వివరాల్లోకి వెళితే.. 


సువర్ట్ బేకర్.. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఈ విషయం అడ్రియాన్ బేకర్‌కు తెలియకుండా.. వాళ్ల కొడుకు బడ్డీ బేకర్ జాగ్రత్తపడ్డాడు. సువర్ట్ బేకర్‌ను ఆసుపత్రిలో చేర్పించాడు. ఈ నేపథ్యంలో సువర్ట్ బేకర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. ఆయన బతికే అవకాశాలు లేవని డాక్టర్లు చెప్పారు. దీంతో విషయాన్ని తన తల్లి అడ్రియాన్ బేకర్‌కు.. బడ్డీ వివరించాడు. సువర్ట్ బేకర్‌ను చూపించేందుకు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఈ క్రమంలో డాక్టర్లు ఆమెలో కూడా కరోనా లక్షణాలు గుర్తించారు. వైద్య పరీక్షలు చేసి.. ఆమెకు కరోనా సోకినట్లు వివరించారు. దీంతో అడ్రియాన్ బేకర్‌ కూడా హాస్పిటల్‌లో చేరింది. దంపతులిద్దరిని వేరు వేరు వార్డులో పెట్టి.. డాక్టర్లు వారికి చికిత్స చేశారు. ఈ నేపథ్యంలో ఇరువురి ఆరోగ్యాలు పూర్తిగా క్షిణించాయి. శరీరంలోని కొన్ని అవయవాలు కూడా పని చేయకపోవడంతో.. డాక్టర్లు వారికి వెంటిలేటర్లు తొలగించారు. ఈ నేపథ్యంలో బడ్డీ.. తన తల్లిని తన తండ్రి ఉన్న గదిలోకి తీసుకెళ్లాడు. ఈ క్రమంలో ఆ ఆలుమగలు.. ఆప్యాయంగా ఒకరి కళ్లలోకి మరొకరు చూసుకుంటూ ఆరు నిమిషాల వ్యవధిలో తుది శ్వాస విడిచారు.


వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాగా ఈ విషయాన్ని స్వయంగా వారి కొడుకు బడ్డీ బేకరే సోషల్ మీడియాలో వెల్లడించారు. ‘తల్లిదండ్రులు మరణించిన బాధ నుంచి ఇంకా బయటికి రాలేకపోతున్నా. ప్రాణాంత వైరస్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి సామాజిక దూరం పాటించండి’ అంటూ ట్విట్టర్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. 

Updated Date - 2020-04-06T02:09:32+05:30 IST