వ్యాధి లక్షణాలు బయటపడకముందే.. ఒకరి నుంచి మరొకరికి వైరస్
ABN , First Publish Date - 2020-03-16T11:03:12+05:30 IST
అది ఫిబ్రవరి నెల. అమెరికాలోని కేంబ్రిడ్జి నగరంలో బయోజెన్ అనే బయోటెక్నాలజీ కంపెనీ తమ ఉద్యోగులతో ఓ సమావేశం నిర్వహించింది.
- ఒక వ్యక్తికి సోకిన నాలుగోరోజే..
- అతడి నుంచి మరో వ్యక్తిలోకి
- టెక్సస్ వర్సిటీ శాస్త్రవేత్తల వెల్లడి
హూస్టన్(అమెరికా), మార్చి 15: అది ఫిబ్రవరి నెల. అమెరికాలోని కేంబ్రిడ్జి నగరంలో బయోజెన్ అనే బయోటెక్నాలజీ కంపెనీ తమ ఉద్యోగులతో ఓ సమావేశం నిర్వహించింది. ఇది ముగిసిన తర్వాత కరోనా పరీక్షలు నిర్వహించగా ముగ్గురు ఉద్యోగులకు పాజిటివ్ అని తేలింది. చూడటానికి ఆరోగ్యంగా కనిపించిన వారికి కరోనా ఉందని ఎవరూ అంచనా వేయలేకపోయారు. ఇదే తరహాలో ప్రపంచవ్యాప్తంగా మరెన్నో దేశాలు కూడా వ్యాధి లక్షణాలు బయటపడని.. కరోనా రోగులను గుర్తించినట్లు ప్రకటించాయి. ఈ రీతిలో రహస్య శత్రువులా కరోనా వైరస్ మానవాళిపై ముప్పేట దాడి చేస్తోంది. ఓ వ్యక్తి శరీరంలోకి ప్రవేశించిన వారంలోపే(నాలుగో రోజే) అతడి నుంచి మరెందరికో వ్యాపిస్తోంది.
జ్వరం, దగ్గు, ఆయాసం వంటి వ్యాధి లక్షణాలు బయటపడకముందే.. ఒకరి నుంచి ఎంతో మందికి వైరస్ వ్యాప్తి జరిగిపోతోంది. అందుకే కరోనా కేసుల సంఖ్య శరవేగంగా పెరుగుతూపోతోంది. పది శాతానికిపైగా కరోనా రోగులకు వైరస్ బారినపడిన ఇతరుల నుంచే వ్యాధి వ్యాపిస్తోంది. అమెరికాలోని టెక్సస్ వర్సిటీ శాస్త్రవేత్తల అధ్యయనంలోనూ ఇదే ధ్రువీకృతమైంది. చైనాలోని 93 నగరాలకు చెందిన 450 కరోనా ఇన్ఫెక్షన్ కేసుల విశ్లేషణ అనంతరం వారు ఈ నిర్ధారణకు వచ్చారు. ఫ్లూ వ్యాధి తరహాలో కొన్ని రోజుల వ్యవధిలోనే ఒకరి నుంచి మరొకరికి వైరస్ సంక్రమిస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు, యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టకుంటే పరిస్థితి చేయిదాటే అవకాశాలు ఉంటాయని శాస్త్రవేత్తలు హెచ్చరించారు.