ప్రొ. గొల్లనపల్లి ప్రసాద్‌కు మహాత్మా గాంధీ భారత్ సేవారత్న పురస్కారం
ABN , First Publish Date - 2020-10-03T12:45:50+05:30 IST
అంతర్జాతీయ సాంస్కృతిక సేవా సంస్థ వంశీ ఇంటర్నేషనల్ మరియు 'దక్షిణాఫ్రికా తెలుగు సాహిత్య వేదిక ' సంయుక్త ఆధ్వర్యంలో ఏడు దేశాల ప్రతినిధులు పాల్గొన్న మహాత్మా గాంధీ 151 వ జయంతి వేడుకలు 2వ తేదీ సాయంత్రం ఆన్‌లైన్ ద్వారా ఘనంగా నిర్వహించబడ్డాయి.
అంతర్జాతీయ సాంస్కృతిక సేవా సంస్థ వంశీ ఇంటర్నేషనల్ మరియు 'దక్షిణాఫ్రికా తెలుగు సాహిత్య వేదిక ' సంయుక్త ఆధ్వర్యంలో ఏడు దేశాల ప్రతినిధులు పాల్గొన్న మహాత్మా గాంధీ 151 వ జయంతి వేడుకలు 2వ తేదీ సాయంత్రం ఆన్‌లైన్ ద్వారా ఘనంగా నిర్వహించబడ్డాయి. తన చిన్నతనంలో గాంధీ గారిని స్వయంగా చూసిన ప్రముఖ సినీనటి, మాజీ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ జమునా రమణ రావు... గాంధీ గురించి తన అనుభవాలను సభాముఖంగా పంచుకున్నారు. ఈ సందర్భంగా 'గాంధీ కింగ్ ఫౌండేషన్' మేనేజింగ్ ట్రస్టీ, ప్రముఖ గాంధేయవాది ప్రొఫెసర్ ప్రసాద్ గొల్లనపల్లికి ప్రముఖ సినీ నటులు, నిర్మాత, పార్లమెంట్ పూర్వ సభ్యులు మురళి మోహన్ 'మహాత్మాగాంధీ- వంశీ ఇంటర్నేషనల్ భారత్ సేవా రత్న' పురస్కారాన్ని అందజేసి సత్కరించారు.
ఈ సందర్భంగా భారతదేశం నుండి రాష్ట్ర శాసనసభ పూర్వ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్, ప్రముఖ సినీ రచయితలు భువనచంద్ర, సుద్దాల అశోక్ తేజ తదితరులు... దక్షిణాఫ్రికా నుండి 'తెలుగు సాహిత్య వేదిక' అధ్యక్షులు రాపోలు సీతారామరాజు, గౌతం లింగా, జొన్నలగడ్డ శ్రీకాంత్, సుధాకర్ పాల్గొన్నారు. అమెరికా నుండి 'మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ అమెరికా' సంస్థ అధ్యక్షులు డా.తోటకూర ప్రసాద్, 'శ్రీ సాంస్కృతిక కళా సారథి' సింగపూర్ సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్న కుమార్, ఆస్ట్రేలియా నుండి 'సిడ్నీ తెలుగు అసోసియేషన్' అధ్యక్షులు సతీష్ వరదరాజు, యూకే నుండి డాక్టర్ వీపీ కిల్లి, ఎంఎస్ నంద కుమార, హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య అధ్యక్షురాలు శ్రీమతి జయ పీసపాటి తదితరులు ఈ కార్యక్రమంలో అతిధులుగా పాల్గొని తమ ప్రసంగాల ద్వారా గాంధీ మహాత్మునికి నివాళి అర్పించారు.
సినీనటి డాక్టర్ జమున రమణ రావు జ్యోతి ప్రజ్వలన గావించగా, గాంధీ మహాత్ముని కీర్తిస్తూ అతని ఆశయాల ప్రతిబింబించే పాటలను, పద్యాలను అమెరికాలోని ఫ్లోరిడా వాస్తవ్యులు శ్రీనివాస భరద్వాజ కిషోర్, శ్రీమతి రాధిక నోరి ఆలపించారు. శ్రీమతి లక్ష్మీ శ్రీనివాస్ వీణపై వైష్ణవ జనతో గీతం పలికించారు. ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం సింగపూర్ ప్రతినిధిగా శ్రీమతి మంగిపూడి రాధిక తన వ్యాఖ్యాన సమన్వయంతో నిర్వహించారు. వంశీ ఇంటర్నేషనల్ సంస్థాపకులు కళాబ్రహ్మ సేవా మహాత్మ శిరోమణి డాక్టర్ వంశీ రామరాజు గారు మాట్లాడుతూ "గాంధీ మహాత్ముని జీవితంలో కీలక పాత్ర పోషించిన రెండు దేశాలైన భారత్, దక్షిణాఫ్రికా సంస్థలు కలసి ఈ విధంగా గాంధీ జయంతి కార్యక్రమం నిర్వహించడం... దానికి మరిన్ని దేశాల ప్రతినిధులు విచ్చేసి సహకరించడం... ఆ మహాత్మునికి ఘనమైన నివాళిగా భావిస్తున్నాము" అని తెలియజేశారు.
వంశీ సంస్థ అధ్యక్షులు శ్రీమతి తెన్నేటి సుధ పురస్కారానికి అభినందన పత్రం రచించి చదువగా, వేగేశ్న ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి సుంకరపల్లి శైలజ కార్యక్రమంలో పాల్గొని తమ సహాయ సహకారాలు అందించారు. మహాత్మా గాంధీ అడుగు జాడలు, వారందించిన నైతిక విలువలు చిరస్మరణీయమని వచ్చే తరాలకు కూడా ఆచరణీయమని, నేటి సమాజ అభివృద్ధికి అన్నివిధాలా అవసరమని వక్తలందరూ అభిప్రాయపడ్డారు.
