బర్మాలో ఓ తెలుగు ‘మగాడు’!

ABN , First Publish Date - 2020-05-17T13:56:36+05:30 IST

ఏడు శతాబ్దాల క్రితం బర్మా (నేటి మయన్మార్)లో ఓ రాజుండే వాడు. అతడి పేరు మగాడు. అచ్చతెలుగు పేరు. తమకు తొలి ధర్మ శాస్త్ర గ్రంథాన్ని అందించిన రాజుగా నేటికీ బర్మీయులు అతడిని స్మరించుకుంటారు.

బర్మాలో ఓ తెలుగు ‘మగాడు’!

ఏడు శతాబ్దాల క్రితం బర్మా (నేటి మయన్మార్)లో ఓ రాజుండే వాడు. అతడి పేరు మగాడు. అచ్చతెలుగు పేరు. తమకు తొలి ధర్మ శాస్త్ర గ్రంథాన్ని అందించిన రాజుగా నేటికీ బర్మీయులు అతడిని స్మరించుకుంటారు. ఆయన స్థాపించిన రాజ్యం రెండున్నర వందల ఏళ్లకు పైగా విలసిల్లింది. మగాడు ఇరవై ఏళ్ల పాటు పరిపాలించాడు. 


ఓజర్నలిస్టుగా ఆగ్నేయాసియాలో తెలుగు వారి మూలాలపై పరిశోధన చేస్తున్నాను. బర్మా చరిత్రను అధ్యయనం చేస్తుంటే కన్పించిన పేరు మగాడు. మర్తబాన్ అంటే నేటి మొత్తమా రాజ్య స్థాపకుడు ఆయన. ఆ రాజ్యం రెండున్నర వందల ఏళ్లకు పైగా విలసిల్లింది. మగాడు ఇరవై ఏళ్ల పాటు పరిపాలించాడు. తెలుగు నేల ఎక్కడ.. మొత్తమా ఎక్కడ?ఈ విషయాలన్నిటినీ అర్థం చేసుకోవాలంటే ముందుగా అక్కడి మన్ జాతీయుల గురించి తెలుసుకోవాలి. ఆగ్నేయాసియాలో తొలి రాజ్యాలు స్థాపించిన వాళ్లు మన్ జాతీయులు. వీరిని ‘మో.. రామన్.. మన్’ అని వివిధ పేర్లతో వ్యవహరిస్తుంటారు. ‘గ్రీక్స్ ఆఫ్ ది సౌత్ ఈస్ట్ ఏసియా’గా ప్రఖ్యాతిగాంచారు. 


దక్షిణ బర్మాలో తొలినాటి తటోను, హంసావతి, మర్తబాన్; అలాగే ఉత్తర థాయిలాండ్ లోని తొలి నాళ్లకు చెందిన ద్వారావతి, హరిపుంజాయి రాజ్యాల స్థాపకులు మన్ జాతీయులే. వీరు క్రీస్తు శకం తొలినాళ్లలో కృష్ణా, గోదావరి ముఖద్వారాల నుంచి బర్మాకు వెళ్లారని సర్ ఆర్థర్ ఫెయిరీ 1883లో తన ‘హిస్టరీ ఆఫ్ బర్మా’లో స్పష్టపరచారు. బ్రిటీష్ పౌరుడైన ఫెయిరీ ఆనాడు బర్మాకు లెఫ్ట్ నెంట్ గవర్నర్ జనరల్ గా పనిచేశారు. ‘మన్ జాతీయులను తలైంగులు అని కూడా అనేవారని, దీనికి కారణం వీరి మాతృభూమి తెలంగాణ కావడమేనని’ ఫెయిరీ తేల్చిచెప్పారు. 


ఇటీవల మయన్మార్ వెళ్లినప్పుడు మన్ తెగవారిని ప్రత్యక్షంగా కలుసుకునే అవకాశం కలిగింది. తెలుగు నేలతో ఉన్న ప్రత్యక్ష సంబంధం వారి మాటల ద్వారా స్పష్టమైంది. మన్ మౌఖిక సాహిత్యంలో ఓ జోలపాట (మన్ భాషలో.. మోన్యా తఛ్) ఉంది... ‘ఓ కొడుకా, మన నేల తెలంగాణ.. మన రాజుకు అదృష్టం బాగాలేక యుద్ధంలో ఓడిపోతే మనం పడవల్లో తూరుపు దిక్కున ఉన్న ఈ సువర్ణభూమికి వచ్చాం’. అయితే ఈ జోల పాట ఏ కాలానికి చెందింది అనే దానికి వారి దగ్గర సమాధానం లేదు. అంతేకాదు తెలంగాణ ఎక్కడుందో తెలియదని చెప్పడం విస్మయం కలిగించింది. అయితే ఆ తెలంగాణ మా భారతదేశంలో ఉందని చెబితే వారిలో ఓ విధమైన ఉద్వేగం. కృష్ణా, గోదావరి ముఖ ద్వారాల నుంచి వలసలు, తలైంగుల జోల పాట, చరిత్రకారుల గ్రంథాల ఆధారంగా మన్ జాతీయులు మన వాళ్లేనని గట్టిగా చెప్పవచ్చు. అందుకే కొన్ని పేర్ల లో తల్లి పేరు వాసనలు ఉన్నాయి. అలాంటి ఓ పేరే మగాడు. అతడు రాజు కాబట్టి శాసనాల్లో నేటికీ ఆ అచ్చమైన తెలుగు పేరు సజీవంగా ఉంది. అతడి జీవిత చరిత్ర ఎంతో ఆసక్తికరం.


అతి సామాన్యుడు ఎంత దూరమైనా వెళ్లగలడు అనే దానికి మగాడి జీవిత గాథే నిదర్శనం. అతడు 1253 మార్చి 26న నేటి తటోను సమీపంలోని తగవున్ గ్రామంలో సాధారణ కుటుంబంలో జన్మించాడు. తండ్రితో కలిసి వ్యాపారం చేయడం మొదలుపెట్టాడు. ఇక్కడి నుంచి కొంత మంది వ్యాపారస్తులు అప్పటి సుకోతాయి (నేటి థాయిలాండ్) రాజధాని నగరంలో వ్యాపారానికి వెళ్లి వస్తూ ఉండేవారు. ఓసారి అలా వెళ్లిన మగాడు సుకోతాయి రాజ్యంలో ఏనుగుల శాలలో ఉద్యోగానికి కుదురుకున్నాడు. క్రమంగా ఏనుగులశాలకే ముఖ్యాధికారి అవుతాడు. సుకోతాయి రాజు రామ్ ఖామ్హేంగ్‌తో మాంచి సాన్నిహిత్యం ఏర్పచుకుంటాడు. దాంతో రాజకోటలోనే అతడికి నివాసం ఏర్పాటుచేస్తారు. రాకుమారి మీనాంగ్ సైడో ప్రేమలో పడతాడు. ‘తన తండ్రికి రాజ్యకాంక్ష అధికమని, రాజకీయ ప్రయోజనాలకు తన అక్కలకు ఇష్టం లేని పెళ్లిళ్లు చేశాడని, తన జీవితం అలా కాకుండా రక్షించమని’ సైడో కోరుతుంది. అవకాశం కోసం చూస్తుంటాడు మగాడు. రాజధానిలో రాజు లేని ఒకానొక సందర్భంలో ఇద్దరూ తగ్ వున్ గ్రామానికి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటారు. తమతో పాటు తెచ్చుకున్న కొంత సైన్యాన్ని కూడా అక్కడి నుంచి తీసుకువచ్చినందున దానికి  మగాడు నాయకుడు అవుతాడు. స్థానికంగా మరికొందరిని సమకూర్చుకుని దౌవున్ నగరాన్ని నిర్మిస్తాడు. మర్తబాన్‌కు చెందిన బర్మీస్ సామంత రాజు బగాన్ చక్రవర్తిపై తలపడేందుకు మగాడి సహాయాన్ని కోరతాడు. మగాడి కళ్లు కూడా బగాన్ రాజ్యంపై ఉన్నాయి. ఎందుకంటే బగాన్ వల్లే తమ మన్ జాతి అధోగతి పాలయిందని అతడు గట్టిగా నమ్మేవాడు.


మర్తబాన్ సామంత రాజుపై మగాడు ఓ విచిత్రమైన పాచిక పన్నాడు. మగాడికి ఓ తమ్ముడు, చెల్లెలు ఉన్నారు. ‘నా చెల్లిని మీకు ఇచ్చి పెళ్లి చేస్తానని చెబుతూ, బాజాభజంత్రీలతో దౌవున్‌కు రమ్మని సామంత రాజును ఆహ్వానించాడు. వచ్చిన వాళ్లందరినీ మత్తు పానీయాల్లో మునిగేలా చేశాడు. మత్తులో ఉన్న సామంత రాజును, అతడి సైన్యాన్ని చంపేసి మర్తబాన్‌ను ఆక్రమించుకున్నాడు. పక్కనే ఉన్న షాన్ రాజ్యం ‘కంపలని’ని హస్తగతం చేసుకున్నాడు. దీంతో మంత్రులందరూ అతడికి దాసోహమన్నారు. 1287 ఏప్రిల్ 5న మర్తబాన్‌కు రాజుగా మగాడు సింహాసనాన్ని అధిష్టించాడు. ఈ సందర్భంగా ‘వరేరు’ గా తన పేరును మార్చుకున్నాడు. 


రాజకీయ ఎత్తుగడలో భాగంగా సరిహద్దు రాజ్యమైన పెగో రాజు తారాబ్యాతో ఒడంబడిక చేసుకున్నాడు మగాడు. అతడికి తన కూతురును ఇచ్చి వివాహం చేశాడు. తారబ్యా కూతురుని తను పెళ్లాడాడు. అలా అతడికి ఇద్దరు భార్యలయ్యారు. తమ రాజ్యాలపైకి వచ్చిన బగాన్ సైన్యాన్ని వీరిద్దరూ సంయుక్తంగా తిప్పికొట్టారు. అంతే కాదు ఇర్రవాడీ రాజ్యం నుంచి కూడా బగాన్ సైన్యాలను తరిమికొట్టి ఆ ప్రాంతాన్ని తమ హస్తగతం చేసుకున్నారు. దక్షిణం వైపున బగాన్ విస్తరణ నీరుకారేలా చేసిన ఘనత వరేరుకే దక్కుతుంది. 


కొద్ది కాలానికే వరేరు, తారబ్యాల మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఇద్దరి చూపు ఇర్రవాడిపై పడింది. సరిహద్దుల్లో ఇరు సైన్యాల మధ్య యుద్ధం జరిగింది. వరేరు విజయం సాధించాడు. యుద్ధంలో తారబ్యాను చంపే అవకాశం దొరికినా విడిచిపెట్టాడు. తారబ్యాను ఖైదు చేసి కారాగారంలో బంధించాడు. కూతురు, ఇద్దరు మనవళ్లని రాజమందిరానికి తీసుకువచ్చాడు. కసి మీదున్న తారబ్యా వరేరును హతమార్చడానికి కుట్ర పన్నాడు. ఈ విషయం తెలిసిన వరేరు అతడిని హతమార్చాడు. దీంతో వరేరు మూడు రాజ్యాల(మర్తబాన్, పెగూ, ఇర్రవాడి)కి రాజయ్యాడు. అలా కొన్ని శతాబ్దాల తరవాత మన్ జాతీయులందరినీ సంఘటిత పరచిన ఘనత వరేరుదే. ఈ రాజ్యాన్ని ‘రామన్య దేశం’ గా పిలిచేవారు. కళలు, సంస్కృతి పరిఢవిల్లేలా చేశాడు. చక్కటి ప్రభువుగా పేరుతెచ్చుకున్నాడు. 


సింహాసనం అధిష్టించిన మూడేళ్లకు ధర్మ శాస్త్రాన్ని రూపొందించేందుకు వరేరు ఓ సంఘాన్ని ఏర్పాటుచేశాడు. అందులో మంత్రులు, బౌద్ధ గురువులూ సభ్యులు. మూడేళ్లు శ్రమించి ఈ ‘వరేరు ధర్మతాత్’ రూపొందించారు. అది 19 వ శతాబ్దం వరకూ ప్రామాణిక న్యాయ శాస్త్ర గ్రంథంలా బర్మా, థాయిలాండ్ లలో పేరుపొందింది. ఈ గ్రంథం భారతీయ మను ధర్మశాస్త్రానికి దగ్గరగా ఉండడం విశేషం. 


వరేరుకు ఒక్కతే కూతురు. మగ సంతానం లేకపోవడంతో మనవళ్లనే తన వారసులుగా తీర్చిదిద్దడం ప్రారంభించాడు. కానీ తమ తండ్రిని చంపినందుకు తాతపై పగబట్టిన మనవళ్లు అవకాశం కోసం ఎదురుచూస్తూ వరేరు నిద్రిస్తున్న సమయంలో కత్తితో పొడిచి హతమార్చారు. సైనికులు వారిని పట్టుకుని ఉరితీశారు. అప్పటికి వరేరు వయసు యాభై మూడేళ్లు. వారసులు వేరే లేకపోవడంతో అతడి తమ్ముడు రాజయ్యాడు. మగాడి కథ అలా ముగిసిపోయింది. 


ఇదంతా క్రీస్తు శకం పదమూడో శతాబ్దికి చెందిన చరిత్ర. అయితే బర్మాలో మన్ జాతీయుల కథ క్రీస్తు శకం అయిదో శతాబ్దిలో ‘తటోన్’ రాజ్య స్థాపనతో మొదలవుతుంది. అప్పట్లో తటోనును ‘సుద్ధర్మపురం’గా పిలిచేవారు. బౌద్ధ సాహిత్యంలో ‘సువర్ణభూమి’గా కన్పిస్తుంది. ఇదే పేరు ‘మన్ జోల పాట’ లోనూ ఉండడం విశేషం. తటోను రాజ్య స్థాపకుడు సింహరాజు. అతడి తరవాత యాభై ఏడు మంది రాజులు పరిపాలించారు. అయితే 11వ శతాబ్దిలో బగాన్‌కు చెందిన అనవ్రత అనే బర్మీస్ రాజు మన్ జాతీయులు సాంస్కృతికంగా ముందున్నారని, దీనికి కారణం వారి త్రిపిటకాలని గ్రహించాడు. 


వాటిని తనకు అప్పగించవలసిందిగా తటోను రాజు ‘మనుహ’ను అడిగాడు. అతడు కాదనడంతో పెద్ద సైన్యంతో దండెత్తి వచ్చి రాజును, 30 వేల మంది మన్ జాతీయులను బానిసలుగా తనతో తీసుకువెళ్లాడు. బగాన్‌లో వేల కొద్దీ బౌద్ధ స్థూపాలను వీరి చేత నిర్మింపచేశాడు. ఈ స్థూపాల కారణంగానే నేడు ప్రపంచంలో అత్యంత విస్తృతమైన పురాతత్వ ప్రదేశంగా బగాన్ పేరుతెచ్చుకుంది.


అక్కడి మరో మన్ రాజ్యం పెగూ. మన తెలుగు జాతికి సంబంధించిన కీలక ఆధారాలు ఇక్కడ లభించాయి. ఈ రాజ్యానికి మరో పేరు ‘హంసావతి’. క్రీస్తు శకం ఆరో శతాబ్దిలో ఇద్దరు రాకుమారులు విమల, సామల తటోనులోని తమ తల్లితో గొడవ పడి కొంత సైన్యాన్ని తీసుకుని ఉత్తరంగా వచ్చి హంసావతి రాజ్యాన్ని స్థాపించారు. నూటా యాభై సంవత్సరాల పాటు ఈ వంశానికి చెందిన పదిహేడు మంది రాజులు పరిపాలించారు. ఓ రాజు పేరు లక్కన్న, మరో రాజు పేరు తిస్స.


మర్తబాన్ రాజుల్లో అత్యంత గొప్పవాడు రాజాధిరత్. ఇతడు మగాడికి మునిమేనల్లుడు. 14వ శతాబ్దికి చెందిన వాడు. ఈనాటికీ మన్ నగరాల కూడళ్లలో రాజాధిరత్ శిల్పాలు కన్పిస్తాయి. ఒరలో కత్తితో పరాక్రమవంతుడిగా కన్పించే రాజాధిరత్ శిల్పం లో వెంటనే ఆకట్టుకునే అంశం వత్తైన మీస కట్టు. బర్మీయులు, చైనీయులు, థాయి ప్రజలలో ఇలాంటి మీసకట్టు ఉండదు. మన్ లిపికి మూలం దక్షిణ భారత దేశానికి చెందిన పల్లవ గ్రంథి లిపి. దీని నుంచే బర్మీస్, థాయి, లాన్నా లిపులు అభివృద్ధిచెందాయి. మన్ జాతీయుల ప్రధాన ఆధారం నేత. ప్రతి ఇంటిలోనూ మగ్గం ఉంటుంది. వారు నేసే పట్టు ఎంతో ఖరీదైనది. 


మగాడి లాంటి రాజుల పేర్లు, లిపి, సంస్కృతి పరంగా చూస్తే మన్ జాతీయులకు తెలుగు నేలతో దగ్గర సంబంధాలు ఉన్నట్టుగా ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ దిశలో విస్త్రృతమైన పరిశోధనలు జరగాలి. తొలినాళ్లలోనే విదేశీ గడ్డలపై తెలుగు జెండాలు రెపరెపలాడించిన మన తాతముత్తాల గురించి తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. 

డి.పి.అనురాధ 

(9010016555)

Updated Date - 2020-05-17T13:56:36+05:30 IST