న్యూయార్క్‌లో జూన్‌ వరకు లాక్‌డౌన్ అమ‌లు

ABN , First Publish Date - 2020-05-13T13:07:22+05:30 IST

అమెరికాలో కరోనా తీవ్రంగా ఉన్న న్యూయార్క్‌ నగరంలో జూన్‌ వరకు లాక్‌డౌన్‌ అమలు చేయనున్నారు.

న్యూయార్క్‌లో జూన్‌ వరకు లాక్‌డౌన్ అమ‌లు

పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చేందుకే: మేయర్‌ 

వాషింగ్టన్‌, బీజింగ్‌, సియోల్‌, మే 12: అమెరికాలో కరోనా తీవ్రంగా ఉన్న న్యూయార్క్‌ నగరంలో జూన్‌ వరకు లాక్‌డౌన్‌ అమలు చేయనున్నారు. రోజువారీ కేసులు, మరణాలు తగ్గుతున్నప్పటికీ అదుపులోకి వచ్చేంత వరకు ఇది తప్పదని మేయర్‌ బిల్‌ డె బ్లాసియో తెలిపారు. కాగా, న్యూయార్క్‌ నగరంలోనే 1.83 లక్షలపైగా కొవిడ్‌ కేసులు నమోదవగా 14,928 మంది చనిపోవడం గమనార్హం. ఈ రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో మే 15 నుంచి దశలవారీగా ఆంక్షలు ఎత్తివేయనున్నారు. ఫ్రాన్స్‌, బెల్జియం సహా ఆంక్షలను సడలిస్తున్న దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అత్యవసర విభాగ చీఫ్‌ డాక్టర్‌ మైఖేల్‌ ర్యాన్‌ హెచ్చరికల్లాంటి సూచనలు చేశారు. పటిష్ఠ కాంట్రాక్ట్‌ ట్రేసింగ్‌ వ్యవస్థ లేకుండా ముందుకెళ్లడం తగదన్నారు. అమెరికాలో ఆంక్షల సడలింపు భారీఎత్తున కష్ట నష్టాలకు దారితీస్తుందని కరోనాపై వైట్‌హౌస్‌ టాస్క్‌ఫోర్స్‌ నిపుణుడు ఆంథోని ఫౌసీ అన్నారు. పెద్దఎత్తున మరణాలూ సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.  


రష్యాలో పదో రోజూ 10 వేలపైగా కేసులు

రష్యాలో రోజువారీ మృతుల సంఖ్య కొంత పెరిగి వంద దాటింది. వరుసగా పదో రోజూ పది వేల పైనే కేసులు నమోదయ్యాయి. అధ్యక్షుడు పుతిన్‌ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ కరోనా బారినపడ్డారు. చైనాలో మంగళవారం 16 కేసులు రికార్డయ్యాయి. ఇందులో 15 లక్షణాలు కనిపించని తరహావే. మిగతా ఒక్కటి.. ఇన్నర్‌ మంగోలియా ప్రాంతంలో నమోదైంది. హుబెయ్‌, జిలిన్‌ ప్రావిన్స్‌లో కేసులు బయటపడటంతో.. వైరస్‌ సెకండ్‌ వేవ్‌ (రెండోసారి దాడి) గురించి చైనా ఆందోళన చెందుతోంది. టీకా ఏడాదిలోపే రావొచ్చని లేదంటే అసలే రాకపోవచ్చని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ వ్యాఖ్యానించారు. టీకాను కనుగొన లేకపోయినా.. కొవిడ్‌ జాగ్రత్తలతో వ్యాపారాల పునరుద్ధరణను ఆయన ప్రస్తావించారు. 


చైనాతో చర్చలుండవ్‌: ట్రంప్‌

కరోనా విషయంలో చైనాపై చిందులేస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మరో అనూహ్య ప్రకటన చేశారు. మారిన పరిస్థితుల రీత్యా.. ఇరు దేశాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం విషయంలో చర్చల పునరుద్ధరణ ఉండదని స్పష్టం చేశారు. దీనిపై తనకసలు ఆసక్తే లేదని అన్నారు. అమెరికా చేస్తున్న టీకా పరిశోధనలను చైనా మద్దతున్న హ్యాకర్లు దొంగిలించేందుకు చేస్తున్న ప్రయత్నాలపై స్పందిస్తూ.. ‘ఇందులో కొత్తేముందని’ పేర్కొన్నారు. కాగా, త్వరలో కోటి పరీక్షల మార్క్‌ను చేరుకోనున్నామంటూ మీడియా సమావేశంలో ట్రంప్‌ తెలిపారు. అమెరికన్లు  ప్రాణాలు కోల్పోతున్న ఇలాంటి సమయంలో పోలికలెందుకంటూ ప్రశ్నించిన విలేకరితో ట్రంప్‌ సంవాదానికి దిగారు. ప్రపంచమంతా ఇలానే జరుగుతోందని, ఈ విషయం చైనాను అడగాలని సీబీఎస్‌ న్యూస్‌ చానెల్‌కు చెందిన రిపోర్టర్‌ వీజియా జియాంగ్‌కు సూచించారు.  

Updated Date - 2020-05-13T13:07:22+05:30 IST