ఆస్ట్రేలియా నుంచి భారత్‌కు ఏడు ప్రత్యేక విమానాలు
ABN , First Publish Date - 2020-05-14T02:53:16+05:30 IST
India to operate seven special flights to Australia to bring back stranded Indians

సిడ్నీ: విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను కేంద్ర ప్రభుత్వం వందే భారత్ మిషన్ పేరిట స్వదేశానికి తీసుకొస్తోంది. మొదటి విడతలో భాగంగా మే 7 నుంచి మే 13 వరకు భారతీయులు విదేశాల నుంచి భారత్‌కు దాదాపు 15 వేల మంది భారతీయులు చేరుకున్నారు. ఇక రెండో విడత మే 16 నుంచి మొదలుకానుంది. ఈసారి దాదాపు 30 వేల మంది భారతీయులు స్వదేశానికి రానున్నారు. రెండో విడతలో ఆస్ట్రేలియాకు ఏడు విమానాలను కేంద్రం కేటాయించింది. మే 21 నుంచి మే 28 వరకు ఈ విమానాలు ఆస్ట్రేలియా నుంచి భారత్‌లోని వివిధ నగరాలకు చేరుకుంటాయి. ఇప్పటికే కాన్‌బెర్రాలోని ఇండియన్ హై కమిషన్ దీనికి సంబంధించిన సమాచారాన్ని ఇచ్చింది.
భారత్‌కు అత్యవసరంగా వెళ్లాల్సిన వారు ఉంటే వారికి అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు హై కమిషన్ తెలిపింది. విమాన టికెట్‌ను ప్రయాణీకులే కొనుగోలు చేయాల్సి ఉంటుందని చెప్పాంది. షార్ట్‌లిస్ట్ చేసిన వారికి ఈ మెయిల్ పంపుతామని.. సమాచారం పంపిన 24 గంటల్లో టికెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. లేని యెడల ఆ సీటు వేరొకరికి కేటాయిస్తామని స్పష్టం చేసింది. ప్రయాణీకులందరికి బోర్డింగ్ సమయంలో స్క్రీనింగ్ ఉంటుందని, భారత్ వెళ్లాక కూడా స్క్రీనింగ్ ఉండనున్నట్టు తెలిపింది. అంతేకాకుండా భారత్ వెళ్లాక 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని.. అనంతరం కరోనా నెగిటివ్ వస్తేనే ఇళ్లకు పంపిస్తారని స్పష్టం చేసింది. కాగా.. ఆస్ట్రేలియాలో వేల సంఖ్యలో భారతీయులు చిక్కుకున్నారు. వీరంతా భారతదేశానికి వచ్చేందుకు ఆత్రుతతో ఉన్నారు. అయితే మొత్తంగా నడపనున్న 7 విమానాల్లో కేవలం 1400 మంది భారతీయులే స్వదేశానికి వచ్చే అవకాశం ఉంది.