రంజాన్ కంటే ముందే పౌరులను స్వదేశానికి తరలిస్తాం: కువైట్
ABN , First Publish Date - 2020-04-21T18:01:19+05:30 IST
మహమ్మారి కరోనా వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య సంక్షోభం ఏర్పడింది. 200కు పైగా దేశాలను కమ్మేసిన ఈ వైరస్ అగ్రరాజ్యాలను సైత భయం గుప్పిట్లో నెట్టేసింది.

కువైట్ సిటీ: మహమ్మారి కరోనా వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య సంక్షోభం ఏర్పడింది. 200కు పైగా దేశాలను కమ్మేసిన ఈ వైరస్ అగ్రరాజ్యాలను సైత భయం గుప్పిట్లో నెట్టేసింది. గల్ఫ్‌లో కూడా కరోనా ప్రభావం తీవ్రంగానే ఉంది. ఇక కొవిడ్-19 వ్యాప్తిని అరికట్టే క్రమంలో చాలా దేశాలు లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయాయి. ప్రయాణాలపై ఆంక్షలు విధించడంతో విదేశాల్లో చిక్కుకున్న వారు స్వదేశానికి రాలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదిలాఉంటే కువైట్ ప్రభుత్వం విదేశాలలో చిక్కుకున్న తమ పౌరులకు తాజాగా గుడ్‌న్యూస్ చెప్పింది. విదేశాల్లోని పౌరులందరినీ రంజాన్ పండుగ కంటే ముందే స్వదేశానికి తరలిస్తామని కువైట్ ఎమిర్ షేక్ సబా అల్ అహ్మద్ అల్ జాబెర్ అల్ సభా ప్రకటించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, విదేశాలలో చిక్కుకుపోయిన కువైట్ పౌరులను తప్పనిసరిగా స్వదేశానికి తీసుకువస్తామన్నారు. రంజాన్ కంటే ముందే వారి కుటుంబాలతో చేర్పిస్తామని, అందరూ కలిసి పండుగ జరుపుకోవచ్చని భరోసా ఇచ్చారు.
అలాగే కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు పౌరులు సహకరించాలని ఆయన కోరారు. ఎట్టిపరిస్థితుల్లో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని తెలిపారు. సామాజిక దూరం పాటించడం, వ్యక్తిగత శుభ్రతతోనే ఈ మహమ్మారిని అరికట్టగలమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం యావత్ ప్రపంచం ఆరోగ్య సంక్షోభంలో ఉందని చెప్పిన షేక్ సభా... కువైట్‌లో కూడా విపత్కర పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. దీని నుంచి బయటపడాలంటే ప్రజల సహకారం తప్పనిసరి అని గుర్తు చేశారు. దానికి దేశ పౌరులు చేయాల్సిందల్లా ఇంట్లోనే ఉండి, సామాజిక దూరం పాటించడమేనని సూచించారు. పౌరుల ఆరోగ్యం దృష్ట్యా ప్రభుత్వాధికారులు తీసుకుంటున్న చర్యలకు అందరూ సహకరించాలని కోరారు. అప్పుడే ఈ సంక్షోభం నుంచి మనం గట్టెక్కగలమని ఆయన తెలిపారు. కాగా, కువైట్‌లో ఇప్పటివరకు 1,995 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, తొమ్మిది మంది చనిపోయారు. ఇక ఈ దేశంలో కరోనా బారిన పడుతున్న విదేశీయుల్లో భారతీయులే అధికంగా ఉన్నట్లు కువైట్ ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది.