కువైత్ టూ హైదరాబాద్: డబ్బులు లేక వెనకడుగు వేసిన తెలుగు ప్రవాసులు

ABN , First Publish Date - 2020-05-10T03:50:38+05:30 IST

గత రెండు నెలలుగా వేతనాలు లేకపోవడంతో విమాన టికెట్ కొనుగోలు

కువైత్ టూ హైదరాబాద్: డబ్బులు లేక వెనకడుగు వేసిన తెలుగు ప్రవాసులు

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: గత రెండు నెలలుగా వేతనాలు లేకపోవడంతో విమాన టికెట్ కొనుగోలు చేయడానికి దినార్లు లేక అనేక మంది వెనుకుంజ వేయడంతో కువైత్ నుంచి హైదరాబాద్‌కు మొట్టమొదటి ఆపరేషన్ వందేభారత్ విమానం గందరగోళ, అనిశ్చిత, అయోమయ పరిస్థితుల కారణంగా చాలా ఆలస్యంగా బయలుదేరింది. వాస్తవానికి శుక్రవారం ఈ విమానం బయలుదేరాల్సి ఉన్నప్పటికి.. ఆమ్నెస్టీ విమానాల వివాదంతో కువైత్ ప్రభుత్వం అడ్డుకకుంది. దీనికి తోడు తెలంగాణ, అంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య క్వారంటైన్ ఖర్చుల గురించి స్పష్టంగా తెలియకపోవడంతో అనేక మంది వెనుకంజ వేశారు. ఈ కారణంగా హైదరాబాద్‌కు వెళ్లాలనుకుంటున్న ప్రయాణికులు ముందుకు రావాలంటూ అధికారులు సినిమా టికెట్ల మాదిరిగా విమాన టికెట్లను శనివారం వరకు విక్రయించి ఎట్టకేలకు విమానాన్ని నింపారు. పూర్తి దిగ్బంధంలో ఉన్న అబ్బసియా, మహ్బుల ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులలో ప్రవాసీయులను భారతీయ ఎంబసీ విమానాశ్రయానికి తరలించింది. మరోపక్క విదేశాల నుంచి భారత్‌కు వస్తున్న విమానాల్లో భౌతికదూరం అనేది లేకుండా పోయింది. ప్యాసెంజర్లు పక్కపక్కనే కూర్చుని ప్రయాణిస్తున్నారు. మరోపక్క టూ స్టార్ హోటల్ క్వారంటైన్‌కు 15 వేలు, త్రీ స్టార్ హోటల్ క్వారంటైన్‌కు 30 వేలు, సాధారణ హోటల్‌లో క్వారంటైన్‌కు 5 వేలు చొప్పున ప్రవాసుల నుంచి వసూలు చేశారు.


భారత్ వెళ్లాలనుకున్న వారు పేర్లు నమోదు చేసుకోమని పిలుపునివ్వగా.. గల్ఫ్ దేశాల్లో అనేక మంది ఆసక్తి చూపారు. కానీ, భారత్ వెళ్లే సమయం రాగా.. టికెట్ కొనడానికి డబ్బులు లేక చాలా మంది వెనుకడుగు వేశారు. స్వదేశానికి చేరుకున్న తర్వాత 14 రోజుల క్వారంటైన్ కాలాన్ని ఏ రాష్ట్రంలో గడపాలో స్పష్టంగా తెలియక ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అనేక మంది ముందుకు రాలేదు. విమాన టికెట్‌తో పాటు హైదరాబాద్‌లో దిగిన తర్వాత క్వారంటైన్‌కు డబ్బులు చెల్లించడానికి సిద్ధంగా ఉన్న వారు మాత్రమే భారత్ వెళ్లేందుకు ఆసక్తి చూపారు. కువైత్ నుంచి హైదరాబాద్‌కు సాధారణంగా వన్ వే టికెట్ ధర 60 నుంచి 70 దినార్లు కాగా.. ఇప్పుడు 90 దినార్లకు విక్రయించారు. అది కూడా కార్డు ద్వారా కాకుండా కేవలం నగదు రూపేణా డబ్బు తీసుకుని టికెట్లను విక్రయించడంతో చాల మంది కొనుగోలు చేయలేకపోయారు.


ప్రాజెక్టు పూర్తయి గత రెండు నెలలుగా మాతృభూమికి తిరిగి వెళ్లడం కోసం తాను నిరీక్షిస్తూ గడిపానని చమురు రంగంలో క్వాలిటీ కంట్రోల్ ఇంజినీర్‌గా పనిచేసే రాచకొండ నరేందర్ తెలిపారు. నరేందర్ కరీంనగర్ జిల్లా పెగడపల్లి మండలం సుద్దపల్లి గ్రామానికి చెందిన వాడు. విమాన టికెట్‌తో పాటు క్వారంటైన్‌ కోసం తెలంగాణ ప్రభుత్వానికి డబ్బు చెల్లించేందుకు సిద్ధంగా ఉండడంతో తాను స్వదేశానికి తిరిగి వెళ్లగలుగుతున్నానని ఆయన చెప్పారు. 1982లో రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రామన్న- గోపన్న అనే ఏబీవీపీ నాయకుల జంట హత్యల కేసులో ప్రాణాలు కోల్పోయిన గోపన్న కుమారుడు నరేందర్ కావడం విశేషం. 


ఇక తాను జీవితంలో మరోసారి గల్ఫ్‌కు రానని హైదరాబాద్‌కు చెందిన  కొత్తకాపు హరిప్రియ అనే జర్మన్ భాష అధ్యాపకురాలు చెప్పారు. కువైత్‌లో జర్మన్ భాష బోధించే అమె కూడా మాతృభూమికు చేరుకోవడానికి గత కొద్ది వారాలుగా అతృతతో ఎదురు చూస్తూ చివరకు శనివారం హైదరాబాద్‌కు బయలుదేరారు. అనేక మంది తెలుగు ప్రవాసీయులు మాతృభూమికి చేరుకోవడానికి ఉత్సాహం ప్రదర్శిస్తున్నా.. టిక్కెట్లకు డబ్బు లేక రాలేకపోతున్నట్లుగా తాను గమనించానని అమె పెర్కొన్నారు.

  

ఇరు రాష్ట్రాల మధ్య క్వారంటైన్ ఖర్చుపై నెలకొన్న అయోమయం కారణంగా అనేక మంది ప్రవాసీయులు హైదరాబాద్ వెళ్లేందుకు ఆసక్తి ఉన్నా వెనకడుగు వేశారని కువైత్‌లోని ప్రవాసాంధ్ర ప్రముఖుడు కోడూరి వెంకట్ చెప్పారు. డబ్బులున్న వారు వెళ్తున్నారు.. మరి పేదల సంగతేంటని ఆయన ప్రశ్నించారు. ఎయిర్ ఇండియా ప్రవాసుల నుంచి డబ్బు తీసుకుని ప్రత్యేక విమానాలను నడుపుతున్నప్పుడు.. కువైత్ ప్రభుత్వం భారతీయుల కొరకు ఉచితంగా నడిపే విమానాలకు అనుమతి ఇవ్వడంలో కేంద్రం ఎందుకు తాత్సారం చేస్తోందని వెంకట్ నిలదీశారు.

Updated Date - 2020-05-10T03:50:38+05:30 IST