మ‌రిన్ని క‌ర్ఫ్యూ ఆంక్ష‌లు తొల‌గించేందుకు రెడీ అవుతున్న కువైట్‌

ABN , First Publish Date - 2020-06-26T17:15:11+05:30 IST

క‌రోనా ప్ర‌భావం క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతుండ‌డంతో కువైట్ ఒక్కొక్క‌టిగా క‌ర్ఫ్యూ ఆంక్ష‌ల‌ను తొల‌గించే ప‌నిలో పడింది.

మ‌రిన్ని క‌ర్ఫ్యూ ఆంక్ష‌లు తొల‌గించేందుకు రెడీ అవుతున్న కువైట్‌

కువైట్ సిటీ: క‌రోనా ప్ర‌భావం క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతుండ‌డంతో కువైట్ ఒక్కొక్క‌టిగా క‌ర్ఫ్యూ ఆంక్ష‌ల‌ను తొల‌గించే ప‌నిలో పడింది. ఐదు ద‌శ‌ల్లో పూర్తిగా క‌ర్ఫ్యూను ఎత్తివేసేందుకు ప్ర‌ణాళిక వేసిన కువైట్... ఇప్పుడు రెండో ద‌శ‌ను జూన్ 30 నుంచి అమ‌లు చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. దీనిలో భాగంగా ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ సెక్టార్ కార్యాల‌యాలు 30 శాతం ఉద్యోగుల‌తో ప‌ని చేసుకునే వెసులుబాటు క‌ల్పించింది. అలాగే షాపింగ్ మాల్స్‌, ఆర్థిక రంగం, నిర్మాణ రంగం, రిటైల్ దుకాణాలు, పార్కులు... రెస్టారెంట్లు, కేఫ్‌ల‌ నుంచి పార్శిల్ స‌ర్వీసులు తిరిగి ప్రారంభం కానున్నాయి. 


ఈ సంద‌ర్భంగా ప్ర‌భుత్వ అధికార ప్ర‌తినిధి తారెక్ అల్ మెజ్రేమ్ మాట్లాడుతూ... "కువైట్ తిరిగి సాధార‌ణ జీవ‌నం వైపు అడుగులేస్తోంది. వైర‌స్ వ్యాప్తి నెమ్మ‌దిగా త‌గ్గుముఖం ప‌డుతున్నందున క‌ర్ఫ్యూ ఆంక్ష‌ల‌ను ఒక్కొక్క‌టిగా తొల‌గిస్తున్నాం. ఐదు ద‌శ‌ల్లో పూర్తిగా క‌ర్ఫ్యూను ఎత్తివేసేందుకు ప్ర‌ణాళిక వేశాం. ఈ నెల 30 నుంచి మొద‌లుకాబోతున్న రెండో ద‌శ‌.. మూడు వారాలు కొన‌సాగుతుంది. సెప్టెంబ‌ర్ క‌ల్ల‌ దేశ‌వ్యాప్తంగా తిరిగి ఆర్థిక కార్యాక‌లాపాలు య‌ధావిధిగా కొన‌సాగుతాయ‌ని ఆశిస్తున్నాం" అని అన్నారు. 


ఇదిలా ఉంటే... కువైట్‌లో గురువారం 909 కొత్త కేసులు, 558 రిక‌వ‌రీలు, రెండు మ‌ర‌ణాలు సంభ‌వించాయి. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా 42,788 మంది ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డ‌గా... 33,367 మంది కోలుకున్నారు.  9,082 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా, ఇప్ప‌టి వ‌ర‌కు 339 మంది ఈ వైర‌స్‌కు బ‌ల‌య్యారు. మ‌రోవైపు క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్టేందుకు ముమ్మ‌రంగా టెస్టులు నిర్వ‌హిస్తోంది. నిన్న 3,286 ‌క‌రోనా ప‌రీక్ష‌లు చేసిన కువైట్‌... దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 3,68,510 కోవిడ్ టెస్టులు చేసింది.  ‌  

Updated Date - 2020-06-26T17:15:11+05:30 IST