విద్యార్థుల కోసం కర్నూలు ఎన్ఆర్ఐ ఫౌండేషన్ పది లక్షల విరాళం

ABN , First Publish Date - 2020-07-23T01:36:46+05:30 IST

కర్నూలు ఎన్‍ఆర్‍ఐ ఫౌండేషన్‍ సహాయ సేవా కార్యక్రమాల్లో భాగంగా కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని పొదుపులక్ష్మీ ఐక్యసంఘం నిర్వహిస్తున్న బాలభారతి పాఠశాలకు

విద్యార్థుల కోసం కర్నూలు ఎన్ఆర్ఐ ఫౌండేషన్ పది లక్షల విరాళం

ఓర్వకల్లు: కర్నూలు ఎన్‍ఆర్‍ఐ ఫౌండేషన్‍ సహాయ సేవా కార్యక్రమాల్లో భాగంగా కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని బాలభారతి పాఠశాలకు 10 లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చింది. ఈరోజు జరిగిన కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‍ రెడ్డి ద్వారా 10 లక్షల రూపాయల చెక్‍‌ను బాలభారతి స్కూల్‍ వ్యవస్థాపకురాలు విజయభారతికి అందజేశారు. బాలభారతిలో చదువుతున్న తల్లితండ్రులు లేని విద్యార్థులు ఎటువంటి కష్టాలు, ఆటంకాలు లేకుండా చదువుకోవాలన్న ఆశయంతో ఈ విరాళాన్ని అందజేస్తున్నట్లు కర్నూలు ఎన్‍ఆర్‍ఐ ఫౌండేషన్‍ వ్యవస్థాపకులు రవి పొట్లూరి తెలిపారు. ఇక ముందు కూడా విద్యాభివృద్ధి కోసం తమ ఫౌండేషన్‍ మరింతగా కృషి చేస్తుందని, ఇందులో భాగంగా వచ్చే ఐదేళ్లలో బాలభారతి స్కూల్‍‌‌కు 50 లక్షల రూపాయలను విరాళంగా ఇవ్వనున్నామని రవి పొట్లూరి పేర్కొన్నారు. లాక్‌డౌన్ సమయంలో కర్నూలు ఎన్‍ఆర్‍ఐ ఫౌండేషన్‍ వివిధ చోట్ల లక్షలాదిమందికి అన్నదానం చేసిన సంగతి తెలిసిందే.


ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే రాంభూపాల్‍ రెడ్డి మాట్లాడుతూ.. వివిధ దేశాల్లో ఉంటూ సొంత జిల్లా బాగుకోసం పాటుపడుతున్న ఎన్నారైల సేవా నిరతిని, కర్నూలు ఎన్‍ఆర్‍ఐ ఫౌండేషన్‍ను అభినందిస్తున్నట్లు చెప్పారు. జిల్లా ప్రగతి కోసం రవి పొట్లూరి చేస్తున్న సేవను ఆయన ప్రశంసించారు. కర్నూలు ఎన్‍ఆర్‍ఐ ఫౌండేషన్‍ ద్వారా  కర్నూలు జిల్లాకు చెందిన ఎన్నారైల సహకారంతో విద్య, వైద్య రంగాల్లో సేవలు అందిస్తామని, నిరుద్యోగ యువతలో నైపుణ్యం పెంపొందించే విధంగా శిక్షణా శిబిరాలు, సదస్సులు నిర్వహిస్తామని, జిల్లాకు చెందిన కళాకారులను, మేధావులను, క్రీడాకారులను ప్రోత్సహించడానికి ప్రతిభా పురస్కారాలు అందజేస్తామని ఫౌండేషన్‍ కో-ఆర్డినేటర్‍ ముప్పా రాజశేఖర్‍ తెలిపారు.

Updated Date - 2020-07-23T01:36:46+05:30 IST