మిలిటరీ పరేడ్‌ ప్రసంగంలో కిమ్‌ జాంగ్ భావోద్వేగం‌

ABN , First Publish Date - 2020-10-12T10:23:34+05:30 IST

అధికార వర్కర్స్‌ పార్టీ ఆఫ్‌ కొరియా 75వ వార్షికోత్సవం సందర్భంగా జరిగి

మిలిటరీ పరేడ్‌ ప్రసంగంలో కిమ్‌ జాంగ్ భావోద్వేగం‌

సియోల్‌, అక్టోబరు 11: అధికార వర్కర్స్‌ పార్టీ ఆఫ్‌ కొరియా 75వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన పరేడ్‌లో మునుపెన్నడూ ఎవరూ చూడని సంఘటన చోటుచేసుకుంది. పరమ క్రూరుడిగా, నియంతగా పేరున్న దేశాధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ తన ప్రసంగం మధ్యలో కన్నీరు పెట్టుకున్నారు. తమ దేశ ప్రజల కష్టాల గురించి చెబుతున్నప్పుడు, సైనికులకు కృతజ్ఞతలు చెబుతున్నప్పుడు కిమ్‌ భావోద్వేగానికి గురైనట్లు కనిపించారు. ఒక క్రూరుడిగా ప్రపంచవ్యాప్తంగా తనకున్న చెడ్డ పేరును మార్చుకునేందుకు లేదా తన పాలనతో విసిగిపోయి ఉన్న ప్రజలను కాస్త మంచి చేసుకునేందుకు కిమ్‌ అలా ప్రవర్తించి ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.


అల్లకల్లోలంగా ఉన్న దేశ ఆర్థిక పరిస్థితి, పరిపాలన విషయంలో కిమ్‌పై నెలకొన్న ఒత్తిడికి కూడా ఆ కన్నీరు సూచిక కావచ్చని అంటున్నారు. ఇక శనివారం పరేడ్‌లో ఉత్తర కొరియా భారీ ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణుల్ని(ఐసీఎంబీ) ఆవిష్కరించింది. ఐసీఎంబీని ఏకంగా 11 యాక్సిల్‌ ఉన్న భారీ వాహనంపై ప్రదర్శనకు తీసుకొచ్చారు. ఈ క్షిపణి కనుక పనిచేసినట్లైతే.. ప్రపంచంలోనే అతి పెద్ద ఐసీఎంబీల్లో ఒకటిగా నిలుస్తుందనేది నిపుణుల అంచనా. అమెరికాలోని ఏ ప్రాంతంపైనైనా అణుదాడి చేసే విధంగా ఈ ఐసీబీఎంను రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ప్రసంగించిన దేశాధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌.. తమ దేశ రక్షణ వ్యవస్థను మరింత పటిష్ఠం చేస్తానని వాగ్దానం చేశారు. ‘‘మన దేశ రక్షణ శక్తిని, స్వీయరక్షణను బలోపేతం చేయడాన్ని కొనసాగిస్తాం. 


అంతర్జాతీయ ఆంక్షలు, తుఫాన్లు, కరోనా వైరస్‌ కారణంగా ఆర్థిక ప్రగతిపై ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేకపోయాను. మీరు నాపై ఉంచిన అపారమైన నమ్మకానికి తగ్గట్టుగా ఏమీ చేయలేకపోయినందుకు సిగ్గు పడుతున్నాను. మన ప్రజల్ని కష్టాల నుంచి బయటికి తీసుకొచ్చేందుకు నా ప్రయత్నాలు, అంకిత భావం సరిపోలేదు. అయితే.. దేశంలో ఒక్కరు కూడా కరోనా బారిన పడకపోవడంపై నాకు సంతోషంగా ఉంది. ఈ కరోనా ప్రపంచం నుంచి పూర్తిగా అంతరించి పోయిన తర్వాత ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మళ్లీ చేయి చేయి కలుపుతాయని ఆశిస్తున్నాను’’ అని కిమ్‌ ప్రసంగించారు. దాదాపు అరగంట సేపు ప్రసంగించిన ఆయనకు, అర్ధరాత్రి చల్లటి వాతావరణంలోనూ చెమటలు పట్టాయి. ప్రసంగం మొత్తంలో అమెరికా గురించి కిమ్‌ ఏమాత్రం ప్రస్తావించకపోవడం ఆసక్తికరం.


Updated Date - 2020-10-12T10:23:34+05:30 IST