కొడుకుకు పునర్జన్మనివ్వడం కోసం.. ఆ తల్లి..!

ABN , First Publish Date - 2020-05-11T18:53:11+05:30 IST

కన్నబిడ్డలకు చిన్న కష్టమొస్తేనే కన్నపేగు తల్లడిల్లిపోతుంది. అటువంటింది.. నవమాసాలు మోసి, జన్మనిచ్చి, అల్లారుముద్దగా పెంచుకున్న బిడ్డలకు..

కొడుకుకు పునర్జన్మనివ్వడం కోసం.. ఆ తల్లి..!

న్యూఢిల్లీ: కన్నబిడ్డలకు చిన్న కష్టమొస్తేనే కన్నపేగు తల్లడిల్లిపోతుంది. అటువంటింది.. నవమాసాలు మోసి, జన్మనిచ్చి, అల్లారుముద్దగా పెంచుకున్న బిడ్డలకు.. ప్రాణం పోయే సమస్య వస్తే, తల్లి అస్సలు తట్టుకోలేదు. తన ప్రాణం అడ్డేసైన.. బిడ్డల ప్రాణాలు కాపాడుకోవడానికి సిద్ధపడుతుంది. ఈ కోవకు చెందిందే.. మినీ నారాయణన్. పూర్తి వివరాల్లోకి వెళితే.. 


కేరళకు చెందిన మినీ నారాయణన్, నారాయణన్ దంపతులు పొట్టకూటి కోసం ఇరవైఏళ్ల క్రితం షార్జా వెళ్లారు. నారాయణన్ షార్జాలో స్కూల్‌ బస్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. వీరికి 16 ఏళ్ల కొడుకు ఉన్నాడు. అతని పేరు అజెయ్ నారాయణన్. కొన్ని సంవత్సరాలుగా అజెయ్ నారాయణన్.. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో అజెయ్ కుటుంబ సభ్యులు అతనికి వైద్యపరీక్షలు చేయించగా.. రెండు కిడ్నీలు పాడైనట్లు డాక్టర్లు చెప్పారు. అంతేకాకుండా కిడ్నీ ట్రాన్స్‌ప్లాట్ చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో కిడ్నీ దాతల కోసం.. సంబంధిత వెబ్‌సైట్‌లో వారు పేరు నమోదు చేసుకున్నారు. అతనికి సరిపడా కిడ్నీ లభించకపోవడం.. ఆరోగ్యం మరింత క్షిణించడంతో మినీ నారాయణన్.. తన కొడుకుకు కిడ్నీ ఇవ్వడానికి ముందుకొచ్చింది. ఆమె కిడ్నీ.. అజయ్‌కి మ్యాచ్ కావడంతో.. శస్త్రచికిత్స కోసం కేరళ వచ్చారు. సమయానికి అజయ్ శరీరం సహకరించకపోవడంతో ఆపరేషన్‌ను ఏప్రిల్‌కు వాయిదా వేశారు. 


దీంతో మినీ నారాయణన్.. తన కొడుకుని కేరళలోని కుటుంబ సభ్యుల వద్ద వదిలి, తిరిగి షార్జా వెళ్లిపోయారు. ఆపరేషన్ కోసం మినీ నారాయణన్ తిరిగి ఇండియాకు వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటుండగానే.. కరోనా కారణంగా విమాన సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో కొడుకు ఆరోగ్యాన్ని తలచుకుని ఆమె ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ నిబంధనలు సడలిస్తూ.. విదేశాల్లో ఉన్న భారతీయులను ‘వందే భారత్ మిషన్’లో భాగంగా స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఇండియాకు తిరిగి రావాలనుకునే వారి కోసం అధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆన్‌లైన్ పోర్టల్‌లో ఆమె పేరు నమోదు చేసుకున్నారు. అయితే ఆమె ప్రయాణానికి అధికారులు అనుమతించలేదు. ఈ నేపథ్యంలో తన కొడుకు ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన రికార్డులను.. షార్జాలోని భారత అధికారులకు చూపించారు. దీంతో ఆమె ప్రయాణానికి వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆపరేషన్‌ కోసం ప్రత్యేక విమానంలో ఆమె సోమవారం రోజు కేరళకు రానున్నారు. 


Updated Date - 2020-05-11T18:53:11+05:30 IST