వ్యాక్సిన్‌పై ట్రంప్ మాటలను నమ్మను: కమలా హారిస్

ABN , First Publish Date - 2020-09-06T16:16:03+05:30 IST

కరోనా వ్యాక్సిన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై డెమొక్రటిక్ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారస్ స్పందించారు.

వ్యాక్సిన్‌పై ట్రంప్ మాటలను నమ్మను: కమలా హారిస్

వాషింగ్టన్: కరోనా వ్యాక్సిన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై డెమొక్రటిక్ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారస్ స్పందించారు. ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే ట్రంప్.. ఆ వ్యాఖ్యలు చేశారని ఆమె ఆరోపించారు. వివరాల్లోకి వెళితే.. అమెరికాలో ఓ వైపు కరోనా కరాళ నృత్యం చేస్తోంటే.. మరోవైపు అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలకు కరోనా అంశం ప్రధాన అస్త్రంగా మారింది. కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో ట్రంప్ సర్కార్ విఫలమైందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీంతో ఎన్నికలకు ముందే అమెరికాలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందంటూ ట్రంప్  ప్రకటించారు. ఈ క్రమంలో అమెరికాలోని సీడీసీ.. నవంబర్ 1 నాటికి కరోనా వ్యాక్సిన్‌ను పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉండాలంటూ రాష్ట్రాలకు సూచించింది. 


ఈ నేపథ్యంలో డెమొక్రటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ స్పందించారు. శనివారం రోజు ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడిన ఆమె.. వ్యాక్సిన్‌పై ట్రంప్ చెప్పే మాటలను తాను విశ్వసించనని  తెలిపారు. ఒకవేళ నవంబర్ 1 నాటికి అమెరికాలో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా.. దాని సామర్థ్యంపై తనకు నమ్మకం లేదన్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం వ్యాక్సిన్ తయారీ సంస్థలపై ట్రంప్ ఒత్తిడి చేస్తున్నారని కమలా హారిస్ ఆరోపించారు. 


ఇదిలా ఉంటే.. అమెరికాలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. అమెరికాలో కరోనా వైరస్ బారినపడిన వారి సంఖ్య 62లక్షలు దాటగా.. 1.88లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 

Updated Date - 2020-09-06T16:16:03+05:30 IST