నా కోసమో.. మీ కోసమో.. కరోనా ఆగదు: బైడెన్
ABN , First Publish Date - 2020-11-15T18:05:44+05:30 IST
అమెరికాలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ట్రంప్ సర్కార్ వెంటనే మహమ్మారి నియంత్రణకు చర్యలు చేపట్టాలని కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ డిమాండ్ చేశారు.

వాషింగ్టన్: అమెరికాలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ట్రంప్ సర్కార్ వెంటనే మహమ్మారి నియంత్రణకు చర్యలు చేపట్టాలని కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ డిమాండ్ చేశారు. వచ్చే ఏడాది వరకు తాను బాధ్యతలు చేపట్టడం కుదరదు కనుక ప్రస్తుత ప్రభుత్వం వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా తగు చర్యలు చేపట్టాలని తెలిపారు. ఇప్పటికైనా నిర్ణక్ష్యాన్ని వీడి.. సర్కార్ తక్షణ చర్యలు చేపడితే మహమ్మారి విజృంభణ అదుపులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. యూఎస్‌లో ప్రస్తుతం ప్రతిరోజు లక్షకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
"నేను అధ్యక్షుడిగా ఎన్నికయ్యాను. కానీ, వచ్చే ఏడాది వరకు నేను బాధ్యతలు చేపట్టలేను. అయితే, కరోనాకు తేదీలు, క్యాలెండర్‌తో సంబంధం లేదు. వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. ఈ ప్రభుత్వం వెంటనే తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది." అని ట్వీట్ చేశారు. ఇప్పటికైనా ట్రంప్ సర్కార్ నిర్ణక్ష్య ధోరణికి స్వస్తి పలికి.. వెంటనే వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యలకు ఉపక్రమించాలని కోరారు. ఇక తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత... మొదటగా కరోనాపై తక్షణ చర్యలు ఉంటాయని ఇప్పటికే బైడెన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటి నుంచే ఆ దిశగా బైడెన్ అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగంగా 12 మంది సభ్యులతో కొవిడ్-19 టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ బృందం మహమ్మారిని ఎదుర్కోవడానికి వ్యూహా రచనలు చేయనుంది. టాస్క్‌ఫోర్స్ సలహాలు, సూచనలతో బైడెన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొవిడ్‌పై తక్షణ చర్యలకు ఉపక్రమిస్తారు.
ఇక వరల్డ్ ఓమీటర్ గణాంకాల ప్రకారం అమెరికాలో ఇప్పటివరకు మొత్తం కరోనా కేసులు 11 మిలియన్లు దాటిపోయాయి. 2.49 లక్షల మంది అమెరికన్లు ఈ వైరస్‌కు బలయ్యారు. దీంతో ప్రపంచంలోనే అత్యధిక కేసులు, మరణాలలో అగ్రరాజ్యం అగ్రస్థానంలో కొనసాగుతోంది.