బైడెన్‌పై మరోసారి నోరు పారేసుకున్న ట్రంప్ !
ABN , First Publish Date - 2020-10-31T17:15:30+05:30 IST
అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది అక్కడి రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. ఇరు పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఒకరిపై ఒకరు విమర్శలతో విరుచుకుపడుతున్నారు.

అమెరికా రాజకీయ చరిత్రలోనే బైడెన్ అత్యంత చెత్త అధ్యక్ష అభ్యర్థి: ట్రంప్
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది అక్కడి రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. ఇరు పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఒకరిపై ఒకరు విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఇటీవల ఫ్లోరిడాలోని తాంపాలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ ఉపాధ్యక్షుడు జో బైడెన్‌ను తీవ్ర పదజాలంతో దూషించారు. అమెరికా రాజకీయ చరిత్రలోనే బైడెన్ అత్యంత చెత్త అధ్యక్ష అభ్యర్థి అని అన్నారు. అలాగే నవంబర్ 3న జరిగే అధ్యక్ష ఎన్నికలు 'అమెరికన్ కల, సోషలిస్ట్ పీడకల' మధ్య ఒక ఎంపిక అని తెలిపారు. బైడెన్‌కు ఓటు వేస్తే అమెరికాకు కూడా వెనిజులా గతే పడుతుందన్నారు. తాంపా ఎన్నికల ర్యాలీలో అమెరికన్ ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్‌తో కలిసి పాల్గొన్న అధ్యక్షుడు ట్రంప్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
"ఒకవేళ డెమొక్రట్స్‌కు అధికారం దక్కితే యూఎస్ కథ కూడా వెనిజులా లానే ముగుస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. నేను అధ్యక్షుడిగా ఉన్నంతకాలం దేశాన్ని సోషలిస్ట్ కంట్రీగా మారనివ్వను. ఈ ఎన్నికలు అమెరికన్ కల, సోషలిస్ట్ పీడకల మధ్య ఒక ఎంపిక. ఈసారి ఎన్నికల్లో మనం మార్క్సిస్టులు, సోషలిస్టులు, ఫ్లాగ్ బర్నర్స్, వామపక్షాలపై గెలిచి దేశాన్ని కాపాడుకోవాలి. ఈ ఎన్నికల్లో నేను అమెరికా రాజకీయ చరిత్రలోనే అత్యంత చెత్త అధ్యక్ష అభ్యర్థితో పోటీపడుతున్నాను. గెలిచినా లేక ఓడినా నాకు పెద్ద సమస్యేమి కాదు" అని ట్రంప్ అన్నారు. అంతేగాక తన ప్రత్యర్థి బైడెన్ సోషలిస్టు కమ్యూనిస్టు స్ఫూర్తితో బరిలో నిలుస్తున్నారని ట్రంప్ విమర్శించారు. ఒకవైపు కరోనాను అడ్డుకోవడంలో విఫలమయ్యారనే విమర్శలు, మరోవైపు సర్వే ఫలితాలు బైడెన్‌కు అనుకూలంగా రావడం ఒకింత ట్రంప్‌ను అసహనానికి గురి చేస్తున్నాయి. అందుకే బైడెన్‌పై తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్నారు.