ట్రంప్‌కు షాక్.. పెన్సెల్వేనియాలో సీన్ రివర్స్..!

ABN , First Publish Date - 2020-11-07T02:03:53+05:30 IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు రసవత్తరంగా మారాయి. ఇప్పటివరకూ డొనాల్డ్ ట్రంప్ ఆధిక్యంలో కొనసాగిన పెన్సెల్వేనియాలో...

ట్రంప్‌కు షాక్.. పెన్సెల్వేనియాలో సీన్ రివర్స్..!

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు రసవత్తరంగా మారాయి. ఇప్పటివరకూ డొనాల్డ్ ట్రంప్ ఆధిక్యంలో కొనసాగిన పెన్సెల్వేనియాలో కూడా సీన్ రివర్స్ అయింది. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ ఆశలు పెట్టుకున్న పెన్సెల్వేనియాలో మొత్తం 20 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. ఇక్కడ ఆది నుంచి ట్రంప్ ఆధిక్యం కొనసాగుతూ వచ్చినప్పటికీ ప్రస్తుతం బిడెన్ ముందంజలో ఉన్నారు. పెన్సెల్వేనియాలో బిడెన్ 5,587 ఓట్ల ఆధిక్యంలో ఉండటం విశేషం. ఈ రాష్ట్రంలో 95 శాతం కౌంటింగ్ పూర్తయింది. ఇక.. మిగిలిన మూడు రాష్ట్రాలైన జార్జియా, నెవాడా, అరిజోనాలో కూడా జో బిడెనే ఆధిక్యంలో ఉన్నారు. అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 8 గంటల 55 నిమిషాల సమయానికి జార్జియాలో 99 శాతం కౌంటింగ్ పూర్తయింది. ఇక్కడ బిడెన్ 1,097 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.


నెవాడాలో 89 శాతం కౌంటింగ్ పూర్తి కాగా.. ఈ రాష్ట్రంలో బిడెన్ 11,438 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక.. అరిజోనాలో 90 శాతం కౌంటింగ్ పూర్తి కాగా.. ఈ రాష్ట్రంలో బిడెన్ అత్యధికంగా 47,052 ఓట్ల ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. ఇప్పటివరకూ వెల్లడైన ఫలితాల ట్రెండ్‌ను పరిశీలిస్తే.. ట్రంప్ అధ్యక్ష స్థానం నుంచి తప్పుకోక తప్పని పరిస్థితి నెలకొంది. ఒక్క నార్త్ కరోలినాలో మాత్రమే ట్రంప్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 15 ఎలక్టోరల్ ఓట్లు ఉన్న నార్త్ కరోలినాలో ట్రంప్ +1.41 శాతం ఆధిక్యంలో ఉన్నారు. నార్త్ కరోలినాలో ఇప్పటివరకూ 94 శాతం కౌంటింగ్ పూర్తయింది. ట్రంప్‌కు 50.09 శాతం ఓట్లు పోలవగా, బిడెన్‌కు 48.69 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇదిలా ఉంటే.. ట్రంప్ మాత్రం కౌంటింగ్‌ను వెంటనే నిలిపివేయాలని, కౌంటింగ్‌లో జరిగిన అవకతవకలపై కోర్టులను ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. పరిస్థితి అక్కడి వరకూ వెళితే.. న్యాయ పోరాటానికి తామూ సిద్ధంగా ఉన్నామని బిడెన్ క్యాంప్ ఇప్పటికే ప్రకటించింది. దీంతో.. అమెరికా ఎన్నికల ఫలితాలను ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.Updated Date - 2020-11-07T02:03:53+05:30 IST