ఇటలీలో 5,500కు చేరిన మృతుల సంఖ్య
ABN , First Publish Date - 2020-03-23T13:36:24+05:30 IST
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య మూడు లక్షలకు మించిపోయింది. మరణించినవారి సంఖ్య 13 వేలు దాటింది. 35 దేశాలు ‘లాక్‌డౌన్’ అయ్యాయి. ఇటలీలో మృతుల సంఖ్య 5,500కు చేరింది. ఆదివారం ఒక్కరోజే 651 మంది చనిపోయారు. ఫ్రాన్స్‌లో మరణాల సంఖ్య 562 దాటింది. పారిస్ ఆస్పత్రిలో ఎమర్జెన్సీ విభాగం వైద్యుడు (67) ఒకరు కరోనాతో మరణించారు.

- మరణాల సంఖ్య 13 వేలకు పైనే
- ఇటలీలో ఆగని మరణ మృదంగం
- ఇటలీలో ఒక్కరోజే 651 మరణాలు
వాషింగ్టన్/రోమ్/పారి్‌స్: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య మూడు లక్షలకు మించిపోయింది. మరణించినవారి సంఖ్య 13 వేలు దాటింది. 35 దేశాలు ‘లాక్‌డౌన్’ అయ్యాయి. ఇటలీలో మృతుల సంఖ్య 5,500కు చేరింది. ఆదివారం ఒక్కరోజే 651 మంది చనిపోయారు. ఫ్రాన్స్‌లో మరణాల సంఖ్య 562 దాటింది. పారిస్ ఆస్పత్రిలో ఎమర్జెన్సీ విభాగం వైద్యుడు (67) ఒకరు కరోనాతో మరణించారు. స్పెయిన్‌లో కొత్తగా 394మరణాలు నమోదయ్యాయి. మొత్తం మరణాల సంఖ్య 1,720కు పెరిగింది. రాబోయే గడ్డు రోజులను ఎదుర్కోవడానికి సిద్ధపడాలని స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ ప్రజలను కోరారు. రష్యా తన వైరస్ నిపుణులను, వైద్య సిబ్బందిని ఇటలీ పంపింది. బ్రిటన్‌లో కరోనా ముప్పు ఎక్కువగా ఉందని గుర్తించిన 15 లక్షల మందిని కనీసం మూడు నెలల పాటు ఇళ్ల వద్దే ఉండాలని ప్రభుత్వం సూచించింది. ఇటలీలో మాదిరిగానే బ్రిటన్‌లోనూ కరోనా విస్తరిస్తోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికాలో సైతం లక్షలాది మంది గడప దాటి బయటకురాలేదు.
న్యూజెర్సీ కూడా ప్రజలను ఇళ్లలోనే ఉండాలని కోరింది. న్యూయార్క్ సిటీ జైళ్లలో 38 మందికి కరోనా సోకింది. ఒక్క రోజులో కొత్తగా 7 వేల కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 26,574కు పెరిగింది. నాలుగు రోజుల తర్వాత ఆదివారం చైనాలో స్థానికంగా సోకిన తొలి కరోనా కేసు నమోదయింది. కొత్తగా ఆరు మరణాలు సంభవించడంతో మృతుల సంఖ్య 3,261 చేరింది. థాయ్‌లాండ్‌లో కేసుల సంఖ్య 600కు పెరిగింది. ఆఫ్రికాలో వెయ్యి మందికి పైగా కరోనా సోకింది. ఇరాన్‌లో కరోనా కాటుకు మరో 129 మంది బలయ్యారు. దీంతో మృతుల సంఖ్య 1,685కు చేరింది. శ్రీలంకలో కర్ఫ్యూను ఉల్లంఘించినందుకు 340 మందిని అరెస్టు చేశారు. పాకిస్థాన్‌లో పూర్తిస్థాయి లాక్‌డౌన్ ప్రకటించబోమని దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ఫ్రాన్స్ ఆంక్షలు విధించింది. నిషేధాజ్ఞల పర్యవేక్షణకు హెలికాప్టర్లు, డ్రోన్లను వినియోగిస్తోంది.
హైకమిషన్‌లోనే భారతీయ విద్యార్థులకు ఆశ్రయం
భారతీయ విద్యార్థుల బృందం లండన్‌లోని ఇండియన్ హై కమిషన్ భవనం ఆవరణలోనే ఆశ్రయం పొందుతోంది. 19 మంది ఉన్న ఈ బృందంలో ఎక్కువ మంది తెలంగాణ విద్యార్థులు ఉన్నారు. ఈ నెలాఖరు వరకు యూకే, యూరప్ నుంచి ప్రయాణికులను అనుమతించబోమని భారత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రవాస భారతీయుల సాయంతో వసతి కల్పించినా అక్కడకు వెళ్లడానికి విద్యార్థులు ఒప్పుకోలేదు.
వారంతా క్వారంటైన్‌కు..
ఇటలీ నుంచి భారతదేశానికి ఆదివారం తీసుకువచ్చిన 263 మంది భారతీయులను ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఢిల్లీలోని ఐటీబీపీ క్వారంటైన్‌కు తరలించారు. ఇప్పటికే ఆ క్వారంటైన్‌లో ఇటలీ నుంచి తీసుకొచ్చిన 215 మంది భారతీయులున్నారు. కాగా.. ఆదివారం భోపాల్ విమానాశ్రయానికి ఢిల్లీ నుంచి వచ్చిన ఒక ప్రయాణికురాలికి ఫ్లూ లక్షణాలు కనపడడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి పుణెకు వెళ్లాల్సిన విమానాన్ని గంటపాటు అక్కడే నిలిపేశారు. విమానంలో ఉన్న 44 మంది ప్రయాణికులను శానిటైజ్ చేసి, థర్మల్ స్ర్కీనింగ్ నిర్వహించి టేకా్‌ఫకు అనుమతిచ్చారు. కాగా.. హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా సూచించిన వ్యక్తులు ఉన్న ఇళ్లను మార్కింగ్ చేయాలని ఢిల్లీ సర్కారు నిర్ణయించింది. ఆ ఇళ్లలో ఉన్నవారిని చిన్నచూపు చూడొద్దని.. వారి పట్ల సానుభూతితో వ్యవహరించాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రజలకు సూచించారు. ఇతరులు జాగ్రత్తగా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన వివరించారు.