చార్లెస్‌ సేంద్రీయ సేద్యం

ABN , First Publish Date - 2020-04-26T22:04:06+05:30 IST

ఇంగ్లండ్‌ ప్రిన్స్‌ చార్లెస్‌ సేద్యం చేస్తాడా? ఆయుర్వేదం, హోమియో వైద్యం తీసుకుంటాడా? ప్రకృతిచికిత్స కోసం బెంగళూరుకు వస్తుంటాడా? ఇవన్నీ ఇప్పుడు అం

చార్లెస్‌ సేంద్రీయ సేద్యం

ఇంగ్లండ్‌  ప్రిన్స్‌ చార్లెస్‌ సేద్యం చేస్తాడా? ఆయుర్వేదం, హోమియో వైద్యం తీసుకుంటాడా? ప్రకృతిచికిత్స కోసం బెంగళూరుకు వస్తుంటాడా? ఇవన్నీ ఇప్పుడు అంతర్జాతీయ పత్రికలకు పచ్చటి కథనాలు అయ్యాయి. చార్లెస్‌కు కరోనా సోకిందన్న వార్తల నేపథ్యంలో ఈ విశేషాలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఆయన వ్యక్తిగత జీవితం, ఇష్టాఇష్టాల గురించి తెలుసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది... 


యునైటెడ్‌ కింగ్‌డమ్‌లోని హైగ్రూవ్‌ రాయల్‌ గార్డెన్స్‌కి వెళ్తుంటే దారిలో ఓ పెద్ద బోర్డు చూపరులను ఆకర్షిస్తుంది ‘జాగ్రత్త.. పాత కాలపు సంప్రదాయ భూభాగంలోకి అడుగుపెడుతున్నారు’ అని. దాదాపు రెండు వేల ఎకరాల ఆ తోట ఆలనా పాలనా చూస్తోంది ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌... చార్లెస్‌. ఇంగ్లండ్‌కు రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న హైగ్రూవ్‌కి తను తరచూ సొంత హెలికాప్టర్‌లో వెళుతుంటాడు. వారసత్వంగా వచ్చిన కోటలు, కొన్నితోటలు అక్కడున్నాయి. వాటి చుట్టుపక్కలున్న పొలాలను ఎనభైలలోనే కొన్నాడు. 


మొక్కలతో మాట్లాడతాడు..

కాంక్రీట్‌ కీకారణ్యంలో చార్లెస్‌కు ఊపిరి ఆడదు. భూసారాన్ని దెబ్బతీసే ఎరువుల మాటెత్తడానికి కూడా ఒప్పుకోడు. నేల తల్లిని మన స్వార్థం కోసం పాడుచేస్తే వినాశనమే సంభవిస్తుందని నమ్మేవాళ్లలో ఆయనొకడు. అందుకే వీలు చిక్కినప్పుడల్లా తన పొలంలో సేదతీరతాడు. 


చార్లెస్‌కి వ్యవసాయం అంటే ప్రాణం. ఏ నేలకు ఏ పంట అనువైనది? ఎప్పుడు ఏ పంట పండుతుంది? ఏ రుతువులో ఏ పూలు పూస్తాయి, ఏ పండ్లు కాస్తాయి? అన్నీ తెలుసు. ఆయన తోటలో హైబ్రిడ్‌ వంగడాల ఊసే ఉండదు. రసాయన ఎరువులు అసలే వాడరు. అధిక దిగుబడినిచ్చే ఆధునిక వంగడాల కన్నా సంప్రదాయ విత్తనాలు, పంటలకే ప్రాధాన్యం ఇస్తాడు ప్రిన్స్‌. స్టెఫానీ డొనాల్డ్‌సన్‌తో కలిసి రచించిన ‘ది ఎలిమెంట్స్‌ ఆఫ్‌ ఆర్గానిక్‌ గార్డెనింగ్‌’లో ఇలాంటి ఎన్నో సాగు సంగతులను వివరించాడు. అతడికి మాత్రమే తెలిసిన కళ మొక్కలతో మాట్లాడడం. ఇదే విషయాన్ని స్నేహితులతోనే కాదు.. పెద్ద పెద్ద వేదికలు ఎక్కినప్పుడు కూడా చెబుతుంటాడు. ‘ప్రతి ఒక్కరూ మొక్కలతో మాట్లాడటానికి ప్రయత్నించండి. తద్వారా వెలకట్టలేని మానసిక ఆనందం మీ సొంతం అవుతుంది’ అని ప్రచారం చేస్తాడు. తనొక్కడే కాదు,  ‘డచీ ఒరిజినల్స్‌’ పేరున సేంద్రీయ ఆహార ఉత్పత్తులను, సౌందర్య సాధన ఉత్పత్తులను తయారుచేస్తున్నాడు. ఈ బ్రాండింగ్‌తో సుమారు 250 ఉత్పత్తులను యూరప్‌, అమెరికాలలో అమ్ముడవుతున్నాయి. వీటి ద్వారా వచ్చే ప్రతి పైసా కూడా ప్రిన్స్‌ సేవా కార్యక్రమాలకే వెళుతుంది. హైగ్రూవ్‌ రాయల్‌ గార్డెన్స్‌ను సందర్శకులు కూడా తిలకించవచ్చు.


సేంద్రీయ నగరం..

ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌ చేపట్టిన మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పౌండ్‌బరీ. డెర్సెట్‌ కౌంటీలో ఈ కొత్త పట్టణాన్ని నిర్మిస్తున్నారు. ఇదంతా ప్రిన్స్‌ సతీమణికి చెందిన స్థలం. ప్రపంచ యుద్ధాల తరవాత ఏర్పడిన పట్టణాలన్నీ పర్యావరణానికి చేటు చేసేవిగా ఉన్నాయని భావిస్తూ.. తన ఆలోచనలకు అనుగుణంగా దీన్ని నిర్మిస్తున్నారు. 1993 లో ప్రారంభించిన ఈ నగర నిర్మాణాన్ని కొందరు వ్యతిరేకించారు. ఈ నగరంలో ఆకాశహార్మ్యాలు ఉండవు. పూర్వకాలంలో ఇంగ్లండ్‌లో పట్టణాలు ఎలా ఉండేవో అలా ఉంటుందీ నవ నగరం. ఆరు వేల మంది జనాభా నివాసానికి అనువైన పౌండ్‌బరీ నిర్మాణం 2025 నాటికి పూర్తవుతుంది. ‘ముప్పై అయిదేళ్ల నాడు సేంద్రీయ వ్యవసాయం మొదలుపెట్టినప్పుడూ విమర్శలు ఎదురయ్యాయి. పౌండ్‌బరీకి కూడా అదే పరిస్థితి. నేను వీటిని పెద్దగా పట్టించుకోను. మా నాన్నగారి జీవన విధానాలనే అనుసరిస్తున్నాను. ఆధునికతపై నాకెలాంటి వ్యామోహమూ లేదు..’ అని నిక్కచ్చిగా చెపుతాడు చార్లెస్‌.


బెంగళూరుకు వస్తుంటాడు...

ప్రిన్స్‌ చార్లెస్‌కు ప్రత్యామ్నాయ వైద్యవిధానాలపై ఆసక్తి ఎక్కువ. తన పెంపుడు గుర్రాల ఆరోగ్య సమస్యలకు హోమియోపతి మందులను వాడతాడట. చార్లెస్‌ సతీమణి కెమిల్లా బెంగళూరులోని ‘సౌఖ్య ఇంటర్నేషనల్‌ హోలిస్టిక్‌ హెల్త్‌ సెంటర్‌’లో ప్రత్యామ్నాయ వైద్య విధానాలతో కూడిన ఽథెరపీల కోసం వస్తుంటుంది. మొన్న నవంబరులో ఈ ఆరోగ్య కేంద్రాన్ని దంపతులిద్దరూ సందర్శించారు. చార్లెస్‌ తన డెబ్భై ఒకటవ పుట్టినరోజును ఈ కేంద్రంలోనే జరుపుకోవడం విశేషం. చార్లెస్‌ను ఇంగ్లండ్‌ రైతులే కాదు ప్రపంచ పర్యావరణవేత్తలూ గొప్ప హీరోగా చూస్తారు. ‘ఇతడికి మళ్లీ జన్మించే అవకాశం ఇస్తే రాజ కుటుంబంలో కాకుండా రైతుగా పుట్టాలని కోరుకుంటాడని’ మెచ్చుకుంటారు. ఈ రోజుల్లో రాజు ఎవరంటే.. ఎలాంటి రసాయనాలు లేకుండా.. తన తిండిని తనే పండించుకు తినేవాడు రాజు. చార్లెస్‌ ఆ పనే చేస్తున్నాడిప్పుడు. ఆయన ఇంగ్లండ్‌కు రాజుగా కంటే.. పొలంలో రైతుగా మారినందుకు గర్వపడుతున్నాడు. 


Updated Date - 2020-04-26T22:04:06+05:30 IST