ఈబీ-5 వీసా అభ్యర్థులకు మరింత నష్టం.. ట్రంప్ కొత్త రూల్స్‌తోపాటు..
ABN , First Publish Date - 2020-03-02T20:43:28+05:30 IST
అమెరికాలో ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత వీసా, గ్రీన్‌కార్డు జారీల నియమనిబంధనలు కఠినతరం చేసిన విషయం తెలిసిందే. వీసా, గ్రీన్‌కార్డుల జారీల విషయంలో ట్రంప్ తీసుకొచ్చిన కొత్త నిబంధనలు.. భారతీయ విద్యార్థులకు, ఉద్యోగులకు అడ్డంకిగా మారాయి. ఈ నేపథ్యంలో కొందరు భారతీయులు ‘ఈబీ-5’ వీసాల వైపు మొగ్గుచూపారు.

న్యూఢిల్లీ: అమెరికాలో ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత వీసా, గ్రీన్‌కార్డు జారీల నియమనిబంధనలు కఠినతరం చేసిన విషయం తెలిసిందే. వీసా, గ్రీన్‌కార్డుల జారీల విషయంలో ట్రంప్ తీసుకొచ్చిన కొత్త నిబంధనలు.. భారతీయ విద్యార్థులకు, ఉద్యోగులకు అడ్డంకిగా మారాయి. ఈ నేపథ్యంలో కొందరు భారతీయులు ‘ఈబీ-5’ వీసాల వైపు మొగ్గుచూపారు. సాధారణంగా.. అమెరికాలో గ్రీన్ కార్డు పొందేందుకు ‘ఈబీ-5’ వీసాలను రాజమార్గంగా భావిస్తారు. అమెరికాలో కొంత పెట్టుబడి పెట్టి, సుమారు 10 మందికి శాశ్వత ఉద్యోగం కల్పిస్తామని డిక్లరేషన్ ఇచ్చిన వారికి.. అమెరికా ప్రభుత్వం ‘ఈబీ-5’ వీసాలను జారీ చేస్తుంది. ‘ఈబీ-5’ వీసాలు పొందినవారు గ్రీన్‌కార్డును సులభంగా పొందేందుకు వీలుటుంది. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఈబీ-5 వీసాల నిబంధనల్లో కూడా పలు మార్పులు చేశారు.
ఈబీ-5 వీసాలు పొందేందుకు పెట్టే పెట్టుబడి మొత్తాన్ని 5లక్షల డాలర్ల నుంచి 9 లక్షల డాలర్లకు పెంచుతూ గత ఏడాది నవంబర్‌లో ఆదేశాలు జారీ చేశారు. మూలిగే నక్కపై తాటిపండుపడ్డట్టు.. ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో ఇప్పటికే సతమతవుతున్న ఎన్నారైలకు.. అమెరికా ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన నిబంధన మరింత భారంగా మారింది. అమెరికాలో భారతీయులు పెట్టే పెట్టుబడులపై అదనంగా 5 శాతం పన్ను విధిస్తూ అమెరికా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో.. అమెరికాలో ‘ఈబీ-5’ వీసాలు పొందేందుకు పెట్టుబడిపెట్టే వారికి భారంగా మారింది. అమెరికాలో ‘ఈబీ-5’ వీసాల కోసం పెట్టుబడి పెట్టే భారతీయులు.. ఏప్రిల్ 1 నుంచి అదనంగా 50 వేల డాలర్లు(సుమారు 35 లక్షలు) చెల్లించాల్సి ఉంటుంది.