దుబాయ్ రియల్ ఎస్టేట్‌ పెట్టుబడిదారుల్లో మనోళ్లే టాప్ !

ABN , First Publish Date - 2020-11-15T14:48:11+05:30 IST

గతేడాది దుబాయ్ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడిదారుల జాబితాలో భారతీయులు అగ్రస్థానంలో ఉన్నట్లు శనివారం విడుదలైన అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

దుబాయ్ రియల్ ఎస్టేట్‌ పెట్టుబడిదారుల్లో మనోళ్లే టాప్ !

దుబాయ్: గతేడాది దుబాయ్ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడిదారుల జాబితాలో భారతీయులు అగ్రస్థానంలో ఉన్నట్లు శనివారం విడుదలైన అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. దుబాయ్ ల్యాండ్ డిపార్ట్‌మెంట్ (డీఎల్‌డీ) నివేదిక ప్రకారం మొత్తం 5,246 మంది భారతీయులు రియల్ స్టేట్‌లో పెట్టుబడులు పెట్టారు. మనోళ్ల తర్వాత అత్యధికంగా 5,172 మంది ఎమిరేట్ వాసులు ఈ రంగంలో పెట్టుబడులు పెట్టారు. మూడో స్థానంలో 2,198 మందితో సౌదీ పెట్టుబడిదారులు ఉంటే.. చైనీయులు(2,096), బ్రిటన్ వాసులు( 2,088) వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో పాకిస్తానీలు(1,913), ఈజిప్టియన్స్(955), జోర్డానీస్(855), అమెరికన్స్(682), కెనడియన్లు(678) ఉన్నారు. 


పెట్టుబడి విలువలో టాపర్స్..

పెట్టుబడి విలువలో టాపర్స్ కూడా మనోళ్లే. గతేది ఈ రంగంలో భారతీయులు ఏకంగా 10.89 బిలియన్ దిర్హమ్స్ పెట్టుబడులు పెట్టారు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా ఎమిరేట్ వాసులు(8.1 బిలియన్ దిర్హమ్స్), సౌదీలు(4.92 బిలియన్ దిర్హమ్స్), బ్రిటిషర్లు(3.97 బిలియన్ దిర్హమ్స్), చైనీయులు(3.65 బిలియన్ దిర్హమ్స్), పాకిస్తానీలు(2.79 బిలియన్ దిర్హమ్స్), జోర్డాన్ వాసులు(1.57 బిలియన్ దిర్హమ్స్), ఈజిప్టియన్లు(1.42 బిలియన్ దిర్హమ్స్), అమెరికన్స్(1.25 బిలియన్ దిర్హమ్స్) ఉన్నారు. 


ఈ సందర్భంగా డీఎల్‌డీలో రియల్ ఎస్టేట్ ప్రమోషన్ మరియు ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ విభాగం సీఈఓ మజిదా అలీ రషీద్ మాట్లాడుతూ, ఈ సంవత్సరం చివరి భాగంలో రియల్ ఎస్టేట్ రంగం బాగా పుంజుకుందని అన్నారు. ఇక బలమైన వృద్ధి ఫండమెంటల్స్‌ను నిర్వహించే అతికొద్ది పెట్టుబడి గమ్యస్థానాలలో దుబాయ్ ఒకటి ఆయన పేర్కొన్నారు. 2020 మొదటి త్రైమాసికంలో ఈ రంగం 3.66 శాతం వృద్ధి రేటును సాధించిందని, అదే 2019 మొదటి త్రైమాసికంలో ఈ వృద్ధి రేటు 3.09 శాతంగా ఉందని రషీద్ తెలిపారు. 


లావాదేవీలు..

ఇక లావాదేవీల విషయానికి వస్తే 2019లో సుమారు 226 బిలియన్ దిర్హమ్స్ విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు జరిగాయని, అదే 2018లో జరిగిన లావాదేవీలు సుమారు 221 బిలియన్ దిర్హమ్స్‌తో పోలిస్తే  వృద్ధి రేటు 2.1 శాతం ఉందని డీఎల్‌డీ తెలిపింది. అలాగే రియల్ ఎస్టేట్ అమ్మకాల విలువ 2018లో 77 బిలియన్ దిర్హమ్స్‌గా ఉంటే.. 2019లో 81 బిలియన్ దిర్హమ్స్‌కు చేరుకుంది. అంతేకాకుండా 2018లో 40,000 పెట్టుబడులతో పోలిస్తే 18 శాతం వృద్ధి రేటుతో 2019లో 47,000 పెట్టుబడులకు చేరుకుంది. ఇక 2018లో 29,846 మంది పెట్టుబడిదారులతో పోలిస్తే 14 శాతం వృద్ధి రేటుతో 2019లో పెట్టుబడి దారుల సంఖ్య 34,000కు చేరింది. 


అధిక పెట్టుబడులు మెరీనాలోనే..

రియల్ ఎస్టేట్ పెట్టుబడులు అధికంగా మెరీనాలోనే ఉంటున్నాయి. 2019లో ఇక్కడ రికార్డుస్థాయిలో ఏకంగా 3,920 పెట్టుబడులు వచ్చాయి. రెండో స్థానంలో బిజినెస్ బే(3,508), మూడో స్థానంలో అల్ ఖైరాన్(3,142) ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ గార్డెన్స్(2,833), బుర్జ్ ఖలీఫా (2,721) ఉన్నాయి. 


కొత్త ప్రాజెక్టులు..

2020 ఫస్ట్ హాఫ్‌లో 14 కొత్త రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు నమోదైతే.. 2019లో మొత్తం 70 ప్రాజెక్టులు నమోదు చేయబడ్డాయి. కాగా, దుబాయ్ జీడీపీలో రియల్ ఎస్టేట్ రంగం వాటా 7.2 శాతంగా ఉందని డీఎల్‌డీ పేర్కొంది. 


నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు..

2020 ఏడాది మొదటి ఆరు నెలల వరకు ఇప్పటికీ నిర్మాణ దశలో ఉన్న, డీఎల్‌డీలో నమోదు చేయబడిన ప్రాజెక్టుల సంఖ్య 314. 

Updated Date - 2020-11-15T14:48:11+05:30 IST