77 రోజులు... గదిలో ఒంటరిగా! అంబులెన్స్‌ సైరన్లే తోడు!!

ABN , First Publish Date - 2020-04-15T13:37:11+05:30 IST

కరోనాను వ్యూహాత్మకంగా కట్టడి చేసి, ‘వుహాన్‌’ లాక్‌డౌన్‌ నుంచి విముక్తి అయిన వేళ... వుహాన్‌లోని అపార్ట్‌మెంట్‌లో 77 రోజుల పాటు సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉన్న కేరళ అమ్మాయి అనిల పి. విజయన్‌... అక్కడి వాతావరణాన్ని, తన స్వీయ అనుభవాన్ని ఇలా పంచుకుంటోంది.

77 రోజులు... గదిలో ఒంటరిగా! అంబులెన్స్‌ సైరన్లే తోడు!!

కరోనాను వ్యూహాత్మకంగా కట్టడి చేసి, ‘వుహాన్‌’ లాక్‌డౌన్‌ నుంచి విముక్తి అయిన వేళ... వుహాన్‌లోని అపార్ట్‌మెంట్‌లో 77 రోజుల పాటు సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉన్న కేరళ అమ్మాయి అనిల పి. విజయన్‌... అక్కడి వాతావరణాన్ని, తన స్వీయ అనుభవాన్ని ఇలా పంచుకుంటోంది.  

దీర్ఘకాల లాక్‌డౌన్‌ తర్వాత వుహాన్‌లో గత బుధవారం(8న) ప్రజల కోసం తొలిసారి వీధులన్నీ తెరిచారు. ఆ రోజు నుంచి స్థానికుల ముఖాల్లో చిరునవ్వులు, ఊరట స్పష్టంగా ప్రతిఫలిస్తున్నాయి. నా వరకు నాకు ‘భారతదేశానికి వెళ్లకుండా ఇక్కడే (వుహాన్‌లో) ఉండి నా దేశ ప్రజలకు కరోనా వ్యాప్తి చేయకుండా నా వంతు కర్తవ్యం నిర్వర్తించాను’ అనేది రెట్టింపు ఆనందం కలిగిస్తోంది. నేను వైరస్‌ క్యారియర్‌ కాకూడదని కరోనా వైరస్‌ వెలుగులోకి వచ్చిన మరుక్షణమే నిశ్చయించుకున్నా. నేనిక్కడ చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ వుహాన్‌లోని ‘ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హైడ్రోబయాలజీ’లో పోస్ట్‌ డాక్టోరల్‌ రీసెర్చర్‌గా పని చేస్తున్నా. మాది కేరళలోని పతనంతిట్ట దగ్గర ఉన్న ఎలవుంతిట్ట. చదువు కోసం వుహాన్‌కు వచ్చాను. అయితే ఈ ఏడాది జనవరి మొదటి వారంలో కరోనా వైరస్‌ గురించి నా తోటి విద్యార్థి ద్వారా నాకు తెలిసింది. దాని తీవ్రత గురించి అర్థం అయిన వెంటనే ముఖానికి సర్జికల్‌ మాస్క్‌ ధరించడం మొదలుపెట్టా. అయినా వుహాన్‌లోనే ఉండిపోతే వైరస్‌ బారిన పడకుండా ఉండలేను అనిపించింది. కాబట్టి నా స్వస్థలమైన కేరళ వెళ్లాలా వద్దా అనే మీమాంసలో ఉండిపోయాను. 


భారత ప్రభుత్వం చైనాలో చిక్కుకుపోయిన స్వదేశీ విద్యార్థులను తీసుకుపోయేందుకు విమానాలను ఏర్పాటు చేసిందనే సమాచారం అందింది. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే చైనా ఎంబసీ అధికారులు వచ్చి భారతీయ విద్యార్థుల వివరాలు సేకరించడం మొదలుపెట్టారు. కానీ నాకు భారతదేశానికి తిరిగి వెళ్లాలనే ఆలోచన లేదు. దారి మధ్యలో వైరస్‌ సోకితే, ఆ వైరస్‌ను స్వదేశానికి స్వయానా వెంట తీసుకువెళ్లడం నాకు ఇష్టం లేదు. పైగా నాది రెండేళ్ల రీసెర్చ్‌ కోర్స్‌. ఇప్పుడు స్వదేశం వెళ్లిపోతే జూన్‌ వరకూ వుహాన్‌కు తిరిగి వచ్చే పరిస్థితి ఉండదు. ఈ ఆలోచన రావడంతో హాస్టల్‌ గదిలో ఉండటమే సరైన నిర్ణయం అనిపించింది. అప్పటి నుంచి మూడు నెలలకు పైగా వుహాన్‌లోని నా అపార్ట్‌మెంట్‌ గదికే పరిమితమయ్యాను. అలా ఒంటరిగా గడిపిన 77 రోజులను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను.


అంబులెన్స్‌ సైరన్లే తోడు!

లాక్‌డౌన్‌ రోజులు ఎంతో కష్టంగా గడిచాయి. మాస్టర్స్‌, పీహెచ్‌డీ విద్యార్థులు అదే అపార్ట్‌మెంట్‌లోనే ఉంటున్నారు. అయితే నాది రెండో అంతస్తు. నేను ఉంటున్న అంతస్తులోని మిగతా విద్యార్థులందరూ చైనీయులే! కరోనా భయంతో వాళ్లంతా వారి వారి స్వస్థలాలకు వెళ్లిపోయారు. అయితే వాళ్లు వెళ్తూ నాకు కొన్ని సర్జికల్‌ మాస్క్‌లతో పాటు, యాక్టివేటెడ్‌ కార్బన్‌ మాస్క్‌లు కూడా ఇచ్చారు. వాటితో పాటు చాక్లెట్లు, పళ్లు ఇచ్చారు. వాళ్లందరూ వెళ్లిపోవడంతో రెండో అంతస్తు మొత్తంలో నేనొక్కదాన్నే ఒంటరిగా మిగిలాను. రోజులు నిశ్శబ్దంగా గడవడం మొదలు పెట్టాయి.


వినిపించే శబ్దాల న్నీ రోడ్లపై తిరిగే అంబులెన్స్‌ సైరన్లు, చైనా భాషలో వినపడే రేడియో సందేశాలే! ఆ శబ్దాలతో నిద్ర పట్టేది కాదు. మొత్తానికి ఎలాగై తేనేం మూడు నెలలకు మించి నా హాస్టల్‌కే ఒంటరిగా పరిమిత మయ్యాను. ఇప్పుడు వుహాన్‌ కరోనా ఫ్రీగా మారింది. అంతమాత్రాన ప్రజలందరూ స్వేచ్ఛగా తిరుగుతున్నారు అనుకుంటే పొరపాటు. చైనా ప్రభుత్వం ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందనే చెప్పాలి. నిజం చెప్పాలంటే వైరస్‌ పుట్టుకకు తోడ్పడిందని వుహాన్‌ను తిట్టుకుంటున్న దేశాలన్నీ, ప్రస్తుతం ఈ పట్టణం తీసుకుంటున్న జాగ్రత్తలను బట్టి, వుహాన్‌ను ఆదర్శంగా తీసుకోవాలి అనిపిస్తోంది. 


కలిసికట్టుగా పోరాటం!

ఇక్కడి ప్రజలు కలిసికట్టుగా కరోనా మీద పోరాడారు. అధికార యంత్రాంగంతో పాటు ప్రజలు కూడా బాధ్యతాయుతంగా నడుచుకుంటున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో వైద్య బృందాలు వుహాన్‌లోని ప్రతి ఇంటికీ వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించింది. కొవిడ్‌ - 19 ఉన్న ప్రతి ఒక్కరి శ్యాంపిళ్లు సేకరించి పరీక్షించాయి. క్రమేపీ ఇన్‌ఫెక్షన్‌ రేటు తగ్గినా, వైద్య బృందాలు పనిని విరమించలేదు. ఇప్పుడు స్వేచ్ఛగా వుహాన్‌ వీధుల్లో తిరుగుతున్నా నిబంధ నలు కచ్చితంగా అమలవుతూనే ఉన్నాయి. రోడ్లు, బహిరంగ ప్రదేశాలను ఇప్పటికీ డిస్‌ఇన్‌ఫెక్టెంట్లతో శుభ్రం చేస్తూనే ఉన్నారు. పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఉపయోగించాలంటే గ్రీన్‌ హెల్త్‌ కోడ్‌ ఉండాలి. షాపింగ్‌కు వెళ్లాలంటే, థర్మల్‌ స్ర్కీనింగ్‌ తప్పనిసరి. శరీర ఉష్ణోగ్రత 37.2 డిగ్రీల సెల్సియస్‌కు మించితే, షాపుల్లోకి ప్రవేశించనివ్వరు. షాపుల్లో ప్రవేశం ఉదయం వేళ వృద్ధులకే రిజర్వ్‌ చేశారు. ఇలా కఠినమైన నిబంధనలు పాటించబట్టే, వుహాన్‌లో కరోనాను కట్టడి చేయగలిగారు.


లాక్‌డౌన్‌ రోజులు ఎంతో కష్టంగా గడిచాయి. మాస్టర్స్‌, పీహెచ్‌డీ విద్యార్థులు అదే అపార్ట్‌మెంట్‌లోనే ఉంటున్నారు. నేను ఉంటున్న అంతస్తులోని మిగతా విద్యార్థులందరూ చైనీయులే! కరోనా భయంతో వాళ్లంతా వారి వారి స్వస్థలాలకు వెళ్లిపోయారు. వాళ్లందరూ వెళ్లిపోవడంతో రెండో అంతస్తు మొత్తంలో నేనొక్కదాన్నే ఒంటరిగా మిగిలాను. వినిపించే శబ్దాలన్నీ రోడ్లపై తిరిగే అంబులెన్స్‌ సైరన్లు, చైనా భాషలో వినపడే రేడియో సందేశాలే! 


Updated Date - 2020-04-15T13:37:11+05:30 IST