పూటగడవటమే కష్టంగా మారుతుంది.. మమ్మల్ని భారత్‌కు తీసుకెళ్లండి ప్లీజ్!

ABN , First Publish Date - 2020-03-28T00:26:11+05:30 IST

కరోనా వైరస్ విశ్వరూపం దాల్చింది. చైనాలో ఉద్భవించిన వైరస్.. చాపకింద నీరులా ప్రపంచ దేశాలకు పాకింది. ఈ నేపథ్యంలో మార్చి 10 తర్వాత ఆస్ట్రేలియాలో కూడా కరోనా

పూటగడవటమే కష్టంగా మారుతుంది.. మమ్మల్ని భారత్‌కు తీసుకెళ్లండి ప్లీజ్!

న్యూఢిల్లీ: కరోనా వైరస్ విశ్వరూపం దాల్చింది. చైనాలో ఉద్భవించిన వైరస్.. చాపకింద నీరులా ప్రపంచ దేశాలకు పాకింది. ఈ నేపథ్యంలో మార్చి 10 తర్వాత ఆస్ట్రేలియాలో కూడా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అక్కడ మొత్తం 2,800 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా కట్టిడికి చర్యలు ప్రారంభించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం విద్యాలయాలు, రెస్టారెంట్లు, కేఫ్‌లు మూసేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఇటు భారత్‌లో కూడా కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో అంతర్జాతీయ విమానాలపై నిషేధం విధించిన భారత ప్రభుత్వం.. దేశ వ్యాప్తంగా 21రోజులపాటు లాక్‌డౌన్‌ను విధించింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలోని భారతీయ విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దాదాపు లక్ష మంది విద్యార్థులు ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీల్లో చదువుకుంటున్నారు. ఇందులో చాలా మంది.. అపార్ట్‌మెంట్‌లలో అద్దెకు ఉంటూ పార్ట్‌టైం జాబ్‌లు చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో.. షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు మూత పడుతుండటంతో విద్యార్థులు జాబ్‌లు కోల్పోయి, పూటగడవడమే కష్టంగామారే పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో తమను ఇండియాకు తీసుకెళ్లండంటూ విద్యార్థులు భారత ప్రభుత్వాన్ని కోరుతున్నారు.


ఈ నేపథ్యంలో నాగ్‌పూర్‌కు చెందిన 23ఏళ్ల శరద్‌రావ్.. ఆస్ట్రేలియాలో ఉన్న విద్యార్థుల పరిస్థితిని మీడియాకు వివరించాడు. మెల్‌బోర్న్‌లోని ఓ యూనివర్సిటీలో మాస్టర్స్  చదువుతున్నట్లు చెప్పిన ఆ యువకుడు.. స్థానికంగా ఉన్న ఓ హోటల్‌లో హౌస్‌కీపింగ్ చేస్తున్నట్లు తెలిపాడు. కోవిడ్ -19 దృష్ట్యా.. ఈ నెల 30న భారత్‌కు తిరిగి రావడానికి టికెట్‌లు బుక్ చేసుకున్నట్లు చెప్పాడు. భారత ప్రభుత్వం అంతర్జాతీయ విమానాలపై నిషేధం విధించడంతో తన ప్రయాణం రద్దయ్యిందన్నాడు. అయితే కరోనా కేసులు రోజురోజుకు పెరుతున్న తరుణంలో ఆస్ట్రేలియాలో కూడా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించే అవకాశం ఉందన్నాడు. ఇకవేళ అదే జరిగితే.. తనతో పాటు అక్కడ ఉంటున్న భారతీయ విద్యార్థుల పరిస్థితి అధ్వాన్నంగా మారుతుందన్నాడు. జాబ్‌లు లేక డబ్బులు లేక.. పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నాడు. పరిస్థితులు మరింత దారుణంగా మారకముందే భారత ప్రభుత్వం చొరవ చూపాలన్నాడు. ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసి.. తమను స్వదేశానికి తరలించేందుకు చర్యలు తీసుకోవాలని వేడుకున్నాడు. 


Updated Date - 2020-03-28T00:26:11+05:30 IST