వారంతా సేఫ్‌!

ABN , First Publish Date - 2020-03-19T13:59:16+05:30 IST

మలేసియాలోని కౌలాలంపూర్‌లో చిక్కుకుపోయిన 186 మంది భారతీయులను బుధవారం సాయంత్రం ఎయిర్‌ ఏషియా విమానంలో సురక్షితంగా విశాఖపట్నం తీసుకువచ్చారు.

వారంతా సేఫ్‌!

క్షేమంగా స్వదేశం చేరుకున్న వైద్య విద్యార్థులు

కౌలాలంపూర్‌ నుంచి విశాఖ చేరిన విమానం

ఎయిర్‌పోర్టులోనే స్ర్కీనింగ్‌.. ఎవరికీ కరోనా లేదు

ఎన్‌ఏడీ జంక్షన్‌ (విశాఖపట్నం), మార్చి 18 (ఆంధ్రజ్యోతి): మలేసియాలోని కౌలాలంపూర్‌లో చిక్కుకుపోయిన 186 మంది భారతీయులను బుధవారం సాయంత్రం ఎయిర్‌ ఏషియా విమానంలో సురక్షితంగా విశాఖపట్నం తీసుకువచ్చారు. వారందరికీ విమానాశ్రయంలోనే వైద్యాధికారులు కరోనా స్ర్కీనింగ్‌ పరీక్షలు నిర్వహించారు. ఒక్కరికి కూడా వైరస్‌ సోకిన లక్షణాలు లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ విమానం సాయంత్రం 6.40 గంటలకు విశాఖకు వస్తుందని తెలిసి జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్‌, జీవీఎంసీ వైద్యాధికారులు, జిల్లా వైద్యాధికారులు, విమానాశ్రయం అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.


నాలుగు దేశాల నుంచి వస్తున్న 186 మంది వివిధ రాష్ట్రాలకు చెందిన వారు కావడంతో వారిని ఆయా ప్రాంతాలకు పంపడానికి కూడా రవాణా ఏర్పాట్లు కూడా చేశారు. అయితే.. విమానం దిగగానే వారందరికీ వేర్వేరు ప్రాంతాల్లో ఏకకాలంలో కరోనా స్ర్కీనింగ్‌ పరీక్షలు నిర్వహించారు. వచ్చిన 186 మందిలో ఒక్కరికి కూడా ఎటువంటి లక్షణాలు లేవని జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి శాస్ర్తి తెలిపారు. వచ్చిన వారిలో చెన్నె, కర్ణాటకతోపాటు రాష్ట్రంలోని విశాఖపట్నం, నెల్లూరు, విజయవాడ, ఉభయ గోదావరి జిల్లాలు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన వారున్నారు.

Updated Date - 2020-03-19T13:59:16+05:30 IST