దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ సేవలు నిలిపివేత

ABN , First Publish Date - 2020-03-25T14:08:51+05:30 IST

దుబాయ్‌లోని అన్ని కేంద్రాలలో భారతీయ పాస్‌పోర్ట్ సేవలను నిలిపివేస్తున్నట్లు ఇండియన్ కాన్సులేట్ పేర్కొంది.

దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ సేవలు నిలిపివేత

దుబాయ్: దుబాయ్‌లోని అన్ని కేంద్రాలలో భారతీయ పాస్‌పోర్ట్ సేవలను నిలిపివేస్తున్నట్లు ఇండియన్ కాన్సులేట్ పేర్కొంది. ఈ మేరకు మంగళవారం కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఒక ట్వీట్ చేసింది. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం ఏర్పడిన విపత్కర పరిస్థితుల దృష్ట్యా దుబాయ్, ఉత్తర ఎమిరేట్స్‌లలో ఏప్రిల్ 7 వరకు పాస్‌పోర్ట్ సేవలను నిలిపివేస్తున్నట్లు ఈ ట్వీట్‌లో పేర్కొంది.
"ఏదైనా అత్యవసర కేసును ఈ-మెయిల్(passport.dubai@mea.gov.in) ద్వారా కాన్సులేట్ దృష్టికి తీసుకురావచ్చని, అత్యవసర పరిస్థితిని వివరించే పత్రాలు కూడా జతపర్చాలని" తెలియజేసింది.   


మరోవైపు అబుదాభిలోని భారత రాయబార కార్యాలయం కూడా ఇదే తరహా నిర్ణయం తీసుకుంది. ప్రవాసుల పాస్‌పోర్ట్ గడువు ముగిసిన లేదా 2020 ఏప్రిల్ 30 నాటికి గడువు ముగిసే దరఖాస్తులను మాత్రమే ప్రాసెస్ చేస్తామని వెల్లడించింది. అలాగే సాధారణ ధృవీకరణ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఎంబసీ తెలిపింది. ఒకవేళ ఎవరికైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే.. వారి ధృవపత్రాలను స్కాన్ చేసి cons.abudhabi@mea.gov.inకు పంపించాలని పేర్కొంది. అత్యవసర పరిస్థితిని వివరించే పత్రాలను కూడా జతపర్చాలని కోరింది. అన్ని పని రోజులలో సాయంత్రం 4 గంటల వరకు వచ్చిన అన్ని ఈ-మెయిల్స్‌కు ఎంబసీ రిప్లే ఇస్తుందని తెలియజేసింది. ఒకవేళ అప్లికేషన్ ఆమోదించబడితే తదుపరి పని దినమున ధృవీకరణ సర్వీస్‌ను అందిస్తుందని స్పష్టం చేసింది. 

Read more