న్యూయార్క్‌లో కరోనా మరణాలకు ఇవి రెండే ప్రధాన కారణాలు: ప్రవాసీ వైద్యుడు

ABN , First Publish Date - 2020-04-14T12:52:59+05:30 IST

వేగంగా కొవిడ్‌ పరీక్షలు చేయలేకపోవడం, వైరస్‌ వ్యాప్తిని నిరోధించలేకపోవడం.. న్యూయార్క్‌లో కరోనా మరణాలకు ఇవి రెండే ప్రధాన కారణాలని ప్రవాసాంధ్ర కేన్సర్‌ నిపుణుడు డాక్టర్‌ చిట్టి రమణమూర్తి అంటున్నారు.

న్యూయార్క్‌లో కరోనా మరణాలకు ఇవి రెండే ప్రధాన కారణాలు: ప్రవాసీ వైద్యుడు

లాక్‌డౌన్‌ సడలింపుపై తొందరొద్దు

మే ఆఖరు దాకా అప్రమత్తతే శరణ్యం 

‘ఆంధ్రజ్యోతి’తో ప్రవాసీ వైద్యుడు చిట్టి రమణమూర్తి

వేగంగా కొవిడ్‌ పరీక్షలు చేయలేకపోవడం, వైరస్‌ వ్యాప్తిని నిరోధించలేకపోవడం.. న్యూయార్క్‌లో కరోనా మరణాలకు ఇవి రెండే ప్రధాన కారణాలని ప్రవాసాంధ్ర కేన్సర్‌ నిపుణుడు డాక్టర్‌ చిట్టి రమణమూర్తి అంటున్నారు. తొలుత చేసిన జాప్యమే న్యూయార్క్‌ కొంపముంచిందని చెబుతున్న రమణమూర్తితో ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూ వివరాలివీ..


అమెరికాలో కరోనా తీవ్రత ఎలా ఉంది?

అమెరికాలో ముఖ్యంగా న్యూయార్క్‌లో కరోనా విజృంభిస్తోంది. మార్చి ప్రారంభంలో అక్కడ పదుల సంఖ్యలోనే కేసులు నమోదయ్యాయి. ఆ సమయంలో లక్షణాలున్న వారందరికీ పరీక్షలు చేయడంలో అధికార యంత్రాంగం విఫలమైంది. భౌతిక దూరం పాటించే విషయంలోనూ శ్రద్ధ చూపలేదు. దాంతో కేసుల సంఖ్య ఒక్కసారిగా వేలల్లోకి చేరింది.  


మీరు ఉండే ప్రాంతంలో పరిస్థితేంటి? 

ఉస్మానియాలో మెడిసిన్‌ పూర్తి చేసి 1997లో అమెరికా వచ్చాను. 20 ఏళ్ల పాటు న్యూయార్క్‌లో వైద్యసేవలు అందించాను. ఇటీవలే వెస్ట్‌ వర్జీనియాలోని ఎడ్వర్డ్స్‌ కేన్సర్‌ సెంటర్‌లో సీనియర్‌ అంకాలజి్‌స్టగా బాధ్యతలు చేపట్టాను. నేను ఉంటున్న నగరంలోనూ వారం నుంచి కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు 650 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. మరణాల రేటు పెరగడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.  


పరిస్థితి ఎప్పటిలోగా అదుపులోకి రావచ్చు?

వైరస్‌ నిరోధానికి ప్రభుత్వాలు సీరియ్‌సగా పనిచేస్తున్నాయి. మే నెలాఖరు నాటికి పరిస్థితి కొంత అదుపులోకి రావచ్చని భావిస్తున్నాం.


భారత్‌లో లాక్‌ డౌన్‌పై మీ అభిప్రాయం? 

మోదీ ప్రభుత్వం సకాలంలో స్పందించి లాక్‌డౌన్‌ విధించింది. భారత్‌లోనూ కేసులు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో లాక్‌డౌన్‌ ఎత్తివేస్తే వైరస్‌ మరింత వేగంగా వ్యాప్తి చెందుతుంది. లాక్‌డౌన్‌ సడలింపుపై ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించాలి. మే నెలాఖరు వరకు ప్రజలు భౌతిక దూరం పాటించేలా చూడాలి. - స్పెషల్‌ డెస్క్‌


Updated Date - 2020-04-14T12:52:59+05:30 IST