అజ్మాన్‌ బీచ్‌లో నీట మునిగి భారతీయ తండ్రి, కూతురు మృతి !

ABN , First Publish Date - 2020-11-26T21:29:37+05:30 IST

భారత సంతతి తండ్రి, కూతురు నీట మునిగి మృతిచెందిన విషాద ఘటన బుధవారం అజ్మాన్‌ బీచ్‌లో చోటుచేసుకుంది.

అజ్మాన్‌ బీచ్‌లో నీట మునిగి భారతీయ తండ్రి, కూతురు మృతి !

షార్జా: భారత సంతతి తండ్రి, కూతురు నీట మునిగి మృతిచెందిన విషాద ఘటన బుధవారం అజ్మాన్‌ బీచ్‌లో చోటుచేసుకుంది. మృతులను కేరళ రాష్ట్రం కోజికోడ్‌కు చెందిన ఇస్మాయిల్ చందంకండియిల్(47), కూతురు అమల్(17)గా గుర్తించారు. ఇస్మాయిల్ కుటుంబం బుధవారం సాయంత్రం సరదాగా అజ్మాన్ బీచ్‌కు వెళ్లిన సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుందుని అజ్మాన్ పోలీసులు వెల్లడించారు. మొదట ఇస్మాయిల్ కూతురు అమల్ ప్రమాదవశాత్తు నీటిలో పడి అలల ధాటికి కొట్టుకుపోయింది. ఆమెను కాపాడే క్రమంలో ఇస్మాయిల్ కూడా నీట మునిగిపోయాడు. కొద్ది సేపటి తర్వాత తండ్రి, కూతురు ఇద్దురూ ఒడ్డుకు కొట్టుకువచ్చారు. 


అప్పటికే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇద్దరిని చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే వారు మృతిచెందినట్టు వైద్యులు వెల్లడించారు. ఇస్మాయిల్ 14 ఏళ్లుగా దుబాయి రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్(ఆర్‌టీఏ)లోని టెక్నికల్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేస్తున్నట్లు అతని భార్య నఫీసా తెలిపారు. ఈ ఘటనతో ఇస్మాయిల్ స్వస్థలం కోజికోడ్‌లో విషాదం అలుముకుంది. వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.     

Updated Date - 2020-11-26T21:29:37+05:30 IST