ఓసీఐ వీసా సమస్యపై త్వరలోనే నిర్ణయం: విదేశాంగ సహాయ మంత్రి

ABN , First Publish Date - 2020-05-19T01:26:55+05:30 IST

ఓవర్సీస్ సిటిజెన్‌షిప్ ఆఫ్ ఇండియా(ఓసీఐ) వీసా సమస్యను తర్వలోనే తీర్చుతామని

ఓసీఐ వీసా సమస్యపై త్వరలోనే నిర్ణయం: విదేశాంగ సహాయ మంత్రి

న్యూఢిల్లీ: ఓవర్సీస్ సిటిజెన్‌షిప్ ఆఫ్ ఇండియా(ఓసీఐ) వీసా సమస్యను తర్వలోనే తీర్చుతామని భారత విదేశాంగశాఖ సహాయమంత్రి వి.మురళీధరన్ తెలిపారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్(ఎఫ్ఐఏ), బీహార్ జార్ఖండ్ అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(బీఏజేఎన్ఏ) నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మురళీధరన్ ఇండియన్ అమెరికన్స్‌తో మాట్లాడారు. ఓసీఐ కార్డ్ హోల్డర్ల వీసాలపై కేంద్రం సస్పెన్షన్ విధించడంతో తాము భారత్‌కు రాలేకపోతున్నామని ఇండియన్ అమెరికన్స్ తమ గోడును చెప్పుకున్నారు. ఎమర్జెన్సీ అయినా సస్పెన్షన్ కారణంగా తాము భారతదేశానికి రాలేకపోతున్నామని.. దీనిపై దృష్టి సారించాలని కోరారు. మిగతా వారిని ఒకలా.. ఓసీఐ కార్డు హోల్డర్లను మరొకలా చూడటం అన్యాయమని తమ ఆవేదనను వెల్లగక్కారు. ఓసీఐ కార్డ్ హోల్డర్ల వేదన తాను అర్థం చేసుకోగలనని, ఏ ఒక్కరు అధైర్య పడొద్దని.. త్వరలోనే ప్రధాని మోదీ దీనిపై నిర్ణయం తీసుకోనున్నారని మురళీధరన్ ఇండియన్ అమెరికన్స్‌కు భరోసానిచ్చారు. త్వరలోనే ఓసీఐ కార్డ్ హోల్డర్లకు అనుమతి వస్తుందని.. ఇండియన్ అమెరికన్స్ భారత్‌లో పెట్టబడులు కూడా పెట్టాలని మురళీధరన్ అభ్యర్థించారు. విదేశాల్లో ఉన్న భారత సంతతికి చెందిన వారు భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఇది సువర్ణ అవకాశమని ఆయన అన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత ఐదు రోజులుగా వెల్లడించిన విషయాలపై భారత సంతతి వారు దృష్టి సారించాలన్నారు.

Updated Date - 2020-05-19T01:26:55+05:30 IST