యూఎస్‌లో చదువుతున్న భారత యువతి.. యూపీ రోడ్డుప్రమాదంలో మృతి !
ABN , First Publish Date - 2020-08-11T19:24:56+05:30 IST
ఇదో విషాద ఘటన. యుఎస్‌లో చదువుకోవడానికి రూ. 3.83 కోట్ల స్కాలర్షిప్ పొందిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గౌతమ్ బుద్ధ నగర్ యువతి సుదిక్ష భాతి బైక్ మీద నుంచి పడి మృతి చెందింది.

గౌతం బుద్ధ నగర్(యూపీ): ఇదో విషాద ఘటన. యుఎస్‌లో చదువుకోవడానికి రూ. 3.83 కోట్ల స్కాలర్షిప్ పొందిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గౌతమ్ బుద్ధ నగర్ యువతి సుదిక్ష భాతి బైక్ మీద నుంచి పడి మృతి చెందింది. తన మామ మనోజ్ భాతితో కలిసి సికంద్రబాద్లోని తన బంధువులను కలవడానికి వెళ్తున్న సమయంలో కొందరు ఆకతాయిలు సుదిక్షను వెంబడించారు. ఈవ్ టీజర్లు తమ వాహనాలతో స్టంట్లు చేయడం వల్ల సుదిక్ష ప్రయాణిస్తున్న బైక్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే చనిపోయింది.
సుదిక్షది యూపీలోని దాద్రీ పరిధిలో గల బులంద్‌షహర్. ఆమె తండ్రి జితేంద్ర భాతి టీ విక్రేత. రూ. 3.83 కోట్ల స్కాలర్షిప్ పొందిన ఆమె యూఎస్‌లోని బాక్సన్ కాలేజీలో సీటు సంపాదించింది. ప్రస్తుతం సుదిక్ష బాక్సన్ కాలేజీ నుండి గ్రాడ్యుయేషన్, ఇంటర్న్‌షిప్ చేస్తోంది. అయితే, జూన్‌లో కరోనా లాక్డౌన్ కారణంగా స్వదేశానికి వచ్చింది. ఆగస్టు 20న తిరిగి అమెరికా వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంది. ఇంతలోనే ఈ దారుణం జరిగిపోయింది. ఎంతో ప్రతిభావంతురాలైన సుదిక్ష మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. తమ బిడ్డ మృతికి కారణమైన ఆకతాయిలను కఠినంగా శిక్షించాలని వారు కోరుతున్నారు.