ఒమన్ క్షమాభిక్షపై భారత ఎంబసీ కీలక సూచన !

ABN , First Publish Date - 2020-12-01T15:26:17+05:30 IST

గల్ఫ్ దేశం ఒమన్ ప్రవాస కార్మికులకు కోసం ప్రకటించిన క్షమాభిక్షపై మస్కట్‌లోని భారత రాయబార కార్యాలయం తాజాగా భారత ప్రవాసులకు కీలక సూచన చేసింది.

ఒమన్ క్షమాభిక్షపై భారత ఎంబసీ కీలక సూచన !

మస్కట్: గల్ఫ్ దేశం ఒమన్ ప్రవాస కార్మికులకు కోసం ప్రకటించిన క్షమాభిక్షపై మస్కట్‌లోని భారత రాయబార కార్యాలయం తాజాగా భారత ప్రవాసులకు కీలక సూచన చేసింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. వివరాల్లోకి వెళ్తే... వీసా గడువు ముగిసిన ప్రవాస కార్మికులను డిసెంబర్ 31 వరకు ఎలాంటి జరిమానాలు లేకుండా దేశం విడిచిపెట్టి వెళ్లేందుకు ఒమన్ ప్రభుత్వం అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా దేశం విడిచివెళ్లే ప్రవాస కార్మికుల నుంచి నవంబర్ 15 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఈ అమ్నెస్టీపై తాజాగా ఇండియన్ ఎంబసీ కీలక సూచన చేసింది. రెసిడెంట్ కార్డు, వీసాలు రెన్యూవల్ చేసుకోని వారు, గడువు ముగిసిన వీసాలతో చట్ట విరుద్ధంగా దేశంలో ఉంటున్నవారికి ఒమన్ ప్రభుత్వం డిసెంబర్ 31 వరకు ఎలాంటి జరిమానాలు చెల్లించకుండా దేశం విడిచి వెళ్లేందుకు అవకాశం కల్పించింది. కనుక ఇలాంటి సమస్యలు ఉన్న భారత ప్రవాసులు ఈ క్షమాభిక్షను సద్వినియోగం చేసుకుని ఒమన్ నుంచి వెళ్లిపోవాలని ఎంబసీ కోరింది. 


దీనిలో భాగంగా రాయబార కార్యాలయం దేశం విడిచి వెళ్లాలనుకునే కార్మికుల దరఖాస్తులను ప్రాసెస్ చేయడానికి అవసరమైన ఫీజులను సైతం మాఫీ చేయడానికి ముందుకొచ్చింది. అలాగే పేరు నమోదు, ఇతర ప్రక్రియలకు సంబంధించిన వివరాలను కూడా ఎంబసీ తెలియజేసింది. 


1. ఒమన్ విడిచి వెళ్లాలనుకునే ప్రవాసులు మొదట మినిస్ట్రీ ఆఫ్ లేబర్ వెబ్‌సైట్(https://www.manpower.gov.om/Manpower/ManpowerEServices Portal/GracePeriodManagement/RegiseterWorkerInGracePeriod)లో పేరు నమోదు చేసుకోవాలి. దీనికోసం వ్యక్తిగతంగా, సామాజిక కార్యకర్తల సహాయంతో, సనద్ కార్యాలయాలు లేదా ఇండియన్ ఎంబసీ సహాయం తీసుకోవచ్చు. అలాగే భారత ఎంబసీ.. కార్యాలయం ప్రాంగణంలో రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ఏర్పాట్లు చేసింది. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 31 వరకు ప్రవాసులు పేరు నమోదు చేసుకోవచ్చు. 


2. రిజిస్ట్రేషన్ అనంతరం కార్మిశాఖ నుంచి అనుమతి పొందిన ప్రవాసులు విమాన టికెట్ కొనుగోలు చేసుకోవాలి. అలాగే కొవిడ్ పీసీఆర్ టెస్టుకు సంబంధించిన నెగెటివ్ సర్టిఫికేట్‌, వాలీడ్ ట్రావెల్ డాక్యూమెంట్స్‌తో మస్కట్ అంతర్జాతీయ విమానశ్రయం నుంచి స్వదేశానికి చేరుకోవచ్చు.


3. ఇక పాస్‌పోర్టు గడువు ముగిసిన వారు ఎమర్జెన్సీ సర్టిఫికేట్ కోసం ఒమన్‌లో ఉన్న తొమ్మిది బీఎల్ఎస్ ఇంటర్నెషనల్ కేంద్రాలలో ఏదో ఒక సెంటర్‌లో దరఖాస్తు చేసుకోవాలి.


4. రిజిస్ట్రేషన్, ఎమర్జెన్సీ సర్టిఫికేట్‌లను పొందడంపై ఏవైనా విచారణల కోసం క్రింద ఇవ్వబడిన ఈ-మెయిల్ లేదా హెల్ప్‌లైన్ నెంబర్ల ద్వారా భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.


ఈ-మెయిల్:

* రిజిస్ట్రేషన్: cw.muscat@mea.gov.in

* ఎమర్జెన్సీ సర్టిఫికేట్: cons.muscat@mea.gov.in


హెల్ప్‌లైన్ నెంబర్లు:

* రిజిస్ట్రేషన్: (+968)80071234, 94149703

* ఎమర్జెన్సీ సర్టిఫికేట్: (+968)93577979, 79806929, 24695981

Updated Date - 2020-12-01T15:26:17+05:30 IST