అమెరికా నుంచి వచ్చే ఎన్నారైల‌కు భార‌త ఎంబ‌సీ ప్రయాణ సూచనలు

ABN , First Publish Date - 2020-05-08T05:53:01+05:30 IST

క‌రోనా సంక్షోభం నేప‌థ్యంలో ప్ర‌యాణాల‌పై ఆంక్ష‌ల కార‌ణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భార‌తీయుల‌ను స్వదేశానికి త‌ర‌లించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం సిద్ధ‌మైన సంగతి తెలిసిందే.

అమెరికా నుంచి వచ్చే ఎన్నారైల‌కు భార‌త ఎంబ‌సీ ప్రయాణ సూచనలు

న్యూయార్క్‌: క‌రోనా సంక్షోభం నేప‌థ్యంలో ప్ర‌యాణాల‌పై ఆంక్ష‌ల కార‌ణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భార‌తీయుల‌ను స్వదేశానికి త‌ర‌లించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం సిద్ధ‌మైన సంగతి తెలిసిందే. వివిధ ద‌శ‌ల్లో ఎన్నారైల‌ను భార‌త్‌కు తీసుకువ‌చ్చేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇదిలాఉంటే అమెరికాలోని భారత రాయబార కార్యలయం స్వ‌దేశానికి వెళ్లే ఎన్నారైల‌కు కీల‌క ప్రయాణ సూచనలు చేసింది. అమెరికాలో చిక్కుకున్న భారతీయులను ఇండియాకు  తరలించేందుకు శనివారం (మే 9) నుంచి 15 వ‌ర‌కు మొద‌టి ద‌శ‌లో ఎయిర్ ఇండియా విమానాల ద్వారా స్వ‌దేశానికి త‌ర‌లించ‌నున్న‌ట్లు పేర్కొంది.  అయితే, విమానాల్లో  పరిమిత సంఖ్యలో సీట్లు ఉన్నందున ప్రయాణికులను వైద్య అత్యవసర పరిస్థితులను ఎదుర్కొంటున్న లేదా కుటుంబంలో మరణం కారణంగా తిరిగి రావడం వంటి ప్రయాణీకులకు ప్రాధాన్య‌త ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపింది.


విద్యార్థులు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు లేదా వీసాల గడువు ముగింపు వంటి సమ‌స్య‌లు ఎదుర్కొంటున్న వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అలాగే ఎలక్ట్రానిక్ రాండమ్ ఎంపిక పద్ధతి ద్వారా గుర్తించబడుతుంది. యుఎస్‌లోని నియమించబడిన విమానాశ్రయం నుండి భారతదేశంలో నియమించబడిన విమానాశ్రయం వరకు ప్రయాణ ఖర్చును ప్రయాణీకులే భరించాల‌ని పేర్కొంది. ఎంబసీ/కాన్సులేట్లు ప్రయాణీకుల వివరాలను ఎయిర్ ఇండియా కార్యాలయాలతో తెలియ‌జేస్తాయి. దీంతో వారు ప్ర‌యాణికుల‌ను టికెట్ల బుకింగ్, చెల్లింపు విధానం గురించి నేరుగా సంప్రదించే అవ‌కాశం ఉంటుంద‌ని తెలిపింది. అలాగే బోర్డింగ్‌కు ముందు ప్ర‌తి ప్ర‌యాణికుడు త‌ప్ప‌నిస‌రిగా స్క్రీనింగ్ టెస్టు చేయించుకోవాల్సి ఉంటుంద‌ని వివ‌రించింది. 

Updated Date - 2020-05-08T05:53:01+05:30 IST