ఒమన్‌లోని ఇండియన్ ఎంబసీ కీలక నిర్ణయం !
ABN , First Publish Date - 2020-06-18T18:24:15+05:30 IST
గల్ఫ్ దేశాల నుంచి తమ రాష్ట్రానికి వచ్చే ప్రవాసులకు కేరళ ప్రభుత్వం కోవిడ్ నెగెటివ్ సర్టిఫికేట్ తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే.
మస్కట్: గల్ఫ్ దేశాల నుంచి తమ రాష్ట్రానికి వచ్చే ప్రవాసులకు కేరళ ప్రభుత్వం కోవిడ్ నెగెటివ్ సర్టిఫికేట్ తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఒమన్‌లోని ఇండియన్ ఎంబసీ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. చార్టెడ్ విమానాల్లో కేరళ వెళ్లే భారత ప్రవాసులు బోర్డింగ్‌కు ముందు తప్సనిసరిగా కోవిడ్ నెగెటివ్ సర్టిఫికేట్ చూపించాల్సిందేనని కండిషన్ పెట్టింది. 48 గంటల్లో కరోనా పరీక్షలు చేయించుకుని కోవిడ్ నెగెటివ్ సర్టిఫికేట్ తీసుకువస్తేనే కేరళకు వెళ్లే అవకాశం ఉంటుందని తేల్చి చెప్పింది. జూన్ 20 నుంచి ఈ నిబంధన అమలులోకి వస్తుందని పేర్కొంది.
ఇదే తరహాలో సౌదీ అరేబియాలోని భారత ఎంబసీ కూడా ఇంతకుముందు ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. దుబాయిలోని ఇండియన్ కాన్సులేట్ సైతం యూఏఈలోని వారికి ఇదే నిబంధన వర్తిస్తుందని ప్రకటించింది. మరోవైపు కేరళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్ తప్పుబట్టారు. కేరళ నిర్ణయం స్వదేశానికి తిరిగి రావాలనుకునే ప్రవాసులకు ప్రతికూలమని ఆయన పేర్కొన్నారు. విదేశాల నుంచి వచ్చే ప్రవాసులకు దేశవ్యాప్తంగా మిగతా రాష్ట్రాలు క్వారంటైన్, పరీక్షలు నిర్వహిస్తుంటే... కేరళ మాత్రం ఇలా బాధ్యతరాహిత్యంగా ప్రవర్తించడం సరికాదన్నారు.