'ఓపెన్ హౌజ్ మీటింగ్' కార్యక్రమాన్ని ప్రారంభించిన భారత ఎంబసీ
ABN , First Publish Date - 2020-08-20T18:01:15+05:30 IST
ఇకపై ప్రతి బుధవారం ఓపెన్ హౌజ్ మీటింగ్ నిర్వహిస్తామని కువైట్‌లోని భారత ఎంబసీ ప్రకటించిన విషయం విదితమే. ఆగస్టు 19(బుధవారం) తొలి సమావేశం నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చూట్టింది. భారత దౌత్య కార్యాలయం ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారత రాయబారి సిబి జార్జ్ మాట్లాడారు.

కువైట్ సిటీ: ఇకపై ప్రతి బుధవారం ఓపెన్ హౌజ్ మీటింగ్ నిర్వహిస్తామని కువైట్‌లోని భారత ఎంబసీ ప్రకటించిన విషయం విదితమే. ఆగస్టు 19(బుధవారం) తొలి సమావేశం నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చూట్టింది. భారత దౌత్య కార్యాలయం ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారత రాయబారి సిబి జార్జ్ మాట్లాడారు. కువైట్‌లోని భారతీయ సమాజం ఎదుర్కొంటున్న ఏవైనా సమస్యలను పరిష్కరించడానికి సంఘం సభ్యుల సలహాలను రాయబార కార్యాలయం ఎల్లప్పుడూ స్వాగతిస్తుందని తెలిపారు. కువైట్‌లోని భారతీయ సంఘాల కృషిని ఈ సందర్భంగా రాయబారి ప్రశంసించారు. భారతీయ ఇంజనీర్లు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు, భారతదేశంలో చిక్కుకుపోయిన వారి ప్రయాణ సమస్యలు మొదలైనవి తనకు తెలుసని చెప్పిన రాయబారి... అధికారులతో చర్చించడం ద్వారా వీటన్నింటికీ పరిష్కారం కోసం ప్రయత్నిస్తానని చెప్పారు.
ఇక నుంచి ప్రతి బుధవారం మధ్యాహ్నం 3:30 గంటలకు ఎంబసీ ప్రాంగణంలో ఈ ఓపెన్ హౌజ్ మీటింగ్ జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భారత రాయబారి, కార్మిక శాఖలకు చెందిన అధికారులు, సంక్షేమ సంఘాల అధ్యక్షులు తదితరులు హాజరవుతారని స్పష్టం చేశారు. అయితే, ఇందులో పాల్గొనేందుకు ప్రవాసులు ముందుగానే community.kuwait@mea.gov.inవెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల దృష్ట్యా పరిమిత సంఖ్యలో జనాలను అనుమతించేందుకే ఈ ఏర్పాటు చేశామని, అప్పుడే సామాజిక దూరం పాటించడం వీలవుతుందని ఆయన పేర్కొన్నారు.